Telugu Global
National

ఏపీలో మొబైల్ రేషన్.. యూపీలో రేషన్ ఏటీఎం..

రేషన్‌ కార్డు ఉన్న వినియోగదారులు ‘అన్న్ పూర్తి’ ఏటీఎం ముందుకు వెళ్తే కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే సరుకులు తీసుకుని తిరిగి ఇంటిబాట పట్టొచ్చు.

ఏపీలో మొబైల్ రేషన్.. యూపీలో రేషన్ ఏటీఎం..
X

ఏపీలో రేషన్ సరకుల డోర్ డెలివరీ ఇతర రాష్ట్రాల దృష్టిని కూడా ఆకర్షించింది. వాహనంలో రేషన్ సరకులు తీసుకుని ఇంటి వద్దకే వచ్చి ఇచ్చేసి వెళ్తుంటారు ఎండీయూ ఆపరేటర్లు. రేషన్ డీలర్ల వ్యవస్థ పూర్తిగా రద్దుకాకపోవడంతో ప్రభుత్వంపై అదనపు భారం పడింది. కానీ రేషన్ సరకుల డోర్ డెలివరీ అనే కాన్సెప్ట్ మాత్రం క్లిక్ అయింది. ఇప్పుడు యూపీలో కూడా ఇదే తరహాలో రేషన్ సరకులను ప్రజలకు మరింత అందుబాటులోకి తెస్తున్నారు. రేషన్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ‘అన్న్ పూర్తి’ అనే పేరుతో ఏటీఎం సేవలు ప్రారంభమయ్యాయి.

నెలలో కొన్నిరోజులు మాత్రమే రేషన్ సరకులు డీలర్ వద్ద అందుబాటులో ఉంటాయి. సాయంత్రం అందరూ పనులు పూర్తి చేసుకుని రేషన్ షాపుల ముందు బారులు తీరడం మనం గమనిస్తూనే ఉంటాము. ఇకపై ఈ తెగబారెడు క్యూ లైన్లకు స్వస్తి పలికే ఉద్దేశంతో యూపీ ప్రయోగాత్మకంగా రేషన్ ఏటీఎంలను ప్రారంభించింది. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకున్నట్టే ఇక్కడ ఏటీఎం లాంటి మిషన్ వద్దకు వచ్చి వేలిముద్ర వేసి బియ్యం, గోధుమలు తీసుకుని వెళ్లొచ్చు.

అన్ని పథకాలకు ఆధార్ తో లింక్ చేసి, వేలిముద్ర తప్పనిసరి చేసిన ఈరోజుల్లో.. యూపీలోని రేషన్ ఏటీఎంలు కూడా వేలిముద్ర ఆధారంగానే పనిచేసేలా ఏర్పాటు చేశారు. రేషన్‌ కార్డు ఉన్న వినియోగదారులు ‘అన్న్ పూర్తి’ ఏటీఎం ముందుకు వెళ్తే కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే సరుకులు తీసుకుని తిరిగి ఇంటిబాట పట్టొచ్చు. మార్చి 15న లక్నో సమీపంలోని జానకీపురంలో తొలి ఏటీఎం ఏర్పాటు చేశారు. మరో రెండు ఏటీఎంలను కూడా ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చారు. త్వరలో ఈ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తారు. లబ్ధిదారులు ‘అన్న్ పూర్తి’ ఏటీఎం దగ్గర వేలిముద్ర వేయగానే 3 కేజీల బియ్యం, 2 కేజీల గోధుమలు బయటకు వస్తాయి.

First Published:  19 March 2023 2:09 AM GMT
Next Story