Telugu Global
National

ఆలయంలోకి రాకుండా 'బ్రహ్మాస్త్ర' హీరో, హీరొయిన్లను అడ్డుకున్న వీహెచ్ పీ, భజరంగ్ దళ్

రణబీర్ కపూర్, ఆలియా భట్ లను మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ టెంపుల్ లోకి వెళ్ళకుండా హిందుత్వ కార్యకర్తలు అడ్డుకున్నారు. రణ్ బీర్ కపూర్ బీఫ్ తింటానని చెప్పడమే ఇందుకు కారణమని VHP, బజరంగ్ దళ్ సభ్యులు చెప్పారు.

ఆలయంలోకి రాకుండా బ్రహ్మాస్త్ర హీరో, హీరొయిన్లను అడ్డుకున్న వీహెచ్ పీ, భజరంగ్ దళ్
X

బ్రహ్మాస్త్ర మూవీ ప్రమోషన్ కోసం మధ్యప్రదేశ్ వెళ్ళిన హీరో, హీరోయిన్లు, రణబీర్ కపూర్, అలియా భట్, చిత్ర దర్శకులు అయాన్ ముఖర్జీలు ముందుగా ఉజ్జయినీ మహంకాళీ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్ళారు. అయితే అప్పటికే అక్కడ గుమి గూడిన VHP, బజరంగ్ దళ్ సభ్యులు వీళ్ళను ఆలయంలోకి వెళ్ళకుండా అడ్డుకున్నారు. జై శ్రీరాం నినాదాలతో కొంత సేపు వాళ్ళక్కడ రచ్చ చేశారు.

కొన్ని రోజుల క్రితం రణ్‌బీర్ కపూర్, నాన్‌వెజ్‌ ఫుడ్‌లో మటన్‌, చికెన్‌, బీఫ్‌ ఇష్టం అని చెప్పినందున వారిని పవిత్ర మహాకాళేశ్వర్‌ ఆలయంలో పూజలు చేసేందుకు అనుమతించబోమని బజరంగ్‌ దళ్‌ నాయకుడు అంకిత్‌ చౌబే అన్నారు.

తన 'బ్రహ్మాస్త్ర' చిత్రాన్ని చూడాలనుకునే వారు చూడాలని, ఆసక్తి లేని వారు చూడకూడదని ఆలియా కూడా వ్యాఖానించిందని అందువల్ల వీరిని ఆలయంలోకి రానిచ్చే సమస్యే లేదని VHP, బజరంగ్ దళ్ సభ్యులు పట్టుబట్టారు. గొడ్డు మాసం తినే వాళ్ళు హిందూ ఆలయాల్లోకి రావడానికి వీల్లేదంటూ వాళ్ళు గొడవ సృష్టించారు.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అల్లరి సృష్టిస్తున్న వారిపై లాఠీ చార్జ్ చేసి చెదర గొట్టారు. అయినప్పటికీ దర్శకుడు అయాన్ ముఖర్జీ మాత్రమే దేవుడిని దర్శించుకోగలిగారని ఆలయ పూజారి ఆశిష్ పూజారి తెలిపారు.

గొడవ సృష్టించిన వారిపై మహకాల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

First Published:  7 Sep 2022 3:58 AM GMT
Next Story