Telugu Global
National

రామన్ మెగసెసే కమ్యూనిస్టు వ్యతిరేకి.. అందుకే ఆ అవార్డు తిరస్కరిస్తున్నాం: సీపీఎం

ఫిలిపైన్స్‌లో కమ్యూనిస్టులను అణిచి వేసిన వ్యక్తిగా, కమ్యూనిస్టు వ్యతిరేకిగా రామన్ మెగసెసేకు పేరుంది. అలాంటి వ్యక్తి పేరు మీద ఇచ్చే అవార్డును సీపీఎం అంగీకరించదు అని ఏచూరి అన్నారు.

రామన్ మెగసెసే కమ్యూనిస్టు వ్యతిరేకి.. అందుకే ఆ అవార్డు తిరస్కరిస్తున్నాం: సీపీఎం
X

కేరళ వైద్య శాఖ మాజీ మంత్రి కేకే శైలజను 64వ రామన్ మెగసెసే అవార్డుకు ఎంపిక చేసినట్లు మెగసెసే ఫౌండేషన్ కొన్ని వారాల కిందట ప్రకటించింది. కాగా, ఈ అవార్డును తిసరస్కరిస్తున్నట్లు కేకే శైలజతో పాటు సీపీఎం పార్టీ ప్రకటించింది. తాజాగా అవార్డు ఎందుకు తీసుకోవట్లేదో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వివరించారు. పార్టీ నాయకత్వం రామన్ మెగసెసే అవార్డు తీసుకోవద్దని నిర్ణయించిందని ఆయన తెలిపారు.

కేరళలో నిఫా వైరస్‌తో పాటు కరోనా సమయంలో కేకే శైలజ తీసుకున్న చర్యలకు కేరళ ప్రజలు ఆమెను ప్రశంసల జల్లులో ముంచెత్తారు. సరైన సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయాల వల్లే కోవిడ్, నిఫాల ప్రభావం పెద్దగా లేకుండా పోయిందని వాళ్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆమెకు రామన్ మెగసెసే అవార్డు ఇవ్వాలని నిర్ణయించగా, పార్టీ సెంట్రల్ కమిటీ తిరస్కరించింది. దీనిపై పలు విమర్శలు వచ్చాయి.

సీపీఎం పార్టీలోనే కాకుండా బయట కూడా శైలజకు వస్తున్న ఆదరణ చూసే కొంత మంది కావాలని అవార్డును తీసుకోకుండా చేశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే సీతారాం ఏచూరి మాత్రం ఇది సెంట్రల్ కమిటీ డెషిషన్ అని చెప్పారు. ఫిలిపైన్స్‌లో కమ్యూనిస్టులను అణిచి వేసిన వ్యక్తిగా, కమ్యూనిస్టు వ్యతిరేకిగా రామన్ మెగసెసేకు పేరుంది. అలాంటి వ్యక్తి పేరు మీద ఇచ్చే అవార్డును సీపీఎం అంగీకరించదు అని ఏచూరి అన్నారు. అంతే కాకుండా కేరళలో నిఫా, కరోనా వైరస్‌లపై శైలజ ఒక్కరే పోరాడలేదు.. ఒక టీమ్‌గా చేసిన వర్క్.. అందుకే ఆమెను తీసుకోవద్దని చెప్పామన్నారు.

మాజీ మంత్రి శైలజ కూడా పార్టీ నిర్ణయాన్ని స్వాగతించారు. పార్టీ తీసుకున్న నిర్ణయంపై వచ్చిన విమర్శలను పూర్తిగా ఖండించారు. నేను ఓ రాజకీయ నాయకురాలిని, మెగసెసే అవార్డు చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి ఈ అవార్డు ఇవ్వలేదు. కానీ, నన్ను ఎందుకు నామినేట్ చేశారో మాత్రం అర్థం కాలేదని శైలజ వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని పార్టీ నాయకత్వంతో చర్చించాను. పార్టీ తీసుకున్న నిర్ణయాన్నే తాను మెగసెసే ఫౌండేషన్‌కు చెప్పానని ఆమె వివరించారు. తాను అవార్డు తీసుకోకపోవడం పూర్తిగా పార్టీ నిర్ణయమే, తాను కూడా అందుకు అంగీకారం తెలిపానని అన్నారు.

కాగా, కోవిడ్-19 సమయంలో కేరళలో ట్రాకింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ అనే కాన్సెప్ట్‌ను ఉపయోగించి ప్రభుత్వం చాలా చురుకుగా వ్యవహరించింది. ఇదంతా కేకే శైలజ ఆలోచన నుంచి పుట్టిందే. ఓ ఆరోగ్య మంత్రిగా ఆమె ఆ సమయంలో చాలా యాక్టీవ్‌గా పని చేశారు. ఆమె రూపొందించిన కాన్సెప్ట్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు రావడమే కాకుండా మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. అందుకే మెగసెసే ఫౌండేషన్ ఆమెను అవార్డుకు నామినేట్ చేసింది. అయితే, సీఎం పినరయ్ విజయన్‌కు ఆమె పోటీగా తయారవుతున్నదని, ప్రజల్లో ఆమెకు పాపులారిటీ పెరుగుతున్నదనే అక్కసుతోనే సీపీఎం ఈ అవార్డు అందుకోకుండా అడ్డుకున్నదనే విమర్శలు వచ్చాయి. తాజాగా ఆ విమర్శలను సీతారాం ఏచూరి ఖండించారు.

First Published:  5 Sep 2022 1:15 AM GMT
Next Story