Telugu Global
National

మరో వివాదంలో చిక్కుకున్న రాందేవ్ బాబా.. ఈసారి ఏమన్నారంటే..!

తాను చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరినీ కించపరచడానికి చేసినవి కావని, ఆయా మత గ్రంథాల్లో ఉన్న విషయాలనే తాను తెలియజేసినట్లు రాందేవ్ బాబా తెలిపారు.

మరో వివాదంలో చిక్కుకున్న రాందేవ్ బాబా.. ఈసారి ఏమన్నారంటే..!
X

ఇటీవల యోగా గురువు రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన హిందూ మతాన్ని ఇతర మతాలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇటీవల ఆయన రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో పర్యటించారు. ధర్మ పూజారి మహరాజ్ మందిర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఆలయ ప్రాణ ప్రతిష్ఠ‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజుకు ఐదుసార్లు నమాజ్ చేసే ఇస్లాం నుంచే అత్యధిక మంది ఉగ్రవాదులుగా మారారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఒక ముస్లిం ఉగ్రవాదిగా మారినప్పటికీ రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తాడని రాందేవ్ బాబా చెప్పారు. రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తే ఎలాంటి పాపమైనా చేయొచ్చని ముస్లింలు భావిస్తారన్నారు. ఇస్లాం అంటే రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయడమేనని ముస్లింలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

క్రైస్తవులు కూడా ఏసుక్రీస్తు విగ్రహం ముందు నిలబడి కొవ్వొత్తి వెలిగిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయని భావిస్తారని చెప్పారు. క్రైస్తవులు మెడలో సిలువ గుర్తు ధరిస్తారని, వారి కోసం ప్రత్యేకంగా కొన్ని రకాల దుస్తులు తయారవుతాయని పేర్కొన్నారు. ఇలాంటి ఆచారాలు హిందూమతంలో లేవని, హిందూ మతం వీటిని ప్రోత్సహించదని అన్నారు.

అయితే తాను చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరినీ కించపరచడానికి చేసినవి కావని, ఆయా మత గ్రంథాల్లో ఉన్న విషయాలనే తాను తెలియజేసినట్లు రాందేవ్ బాబా తెలిపారు. ఒక వర్గం వారు ప్రపంచాన్ని క్రైస్తవంలోకి మారుస్తామని హెచ్చరికలు చేస్తుంటే, మరొక వర్గం వారు ముస్లింలోకి మారుస్తామని హెచ్చరిస్తున్నారన్నారు. ఇవి ఏ పరిస్థితులకు దారితీస్తాయో తెలియజేయడమే తన ఉద్దేశమని రాందేవ్ బాబా పేర్కొన్నారు. హిందూ మతాన్ని ఇతర మతాలతో పోలుస్తూ రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి.

First Published:  4 Feb 2023 2:30 AM GMT
Next Story