Telugu Global
National

మహిళలు దుస్తులు వేసుకోకపోయినా బాగుంటారు.. - రామ్‌దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు

అయితే యోగా శిక్షణ కోసం మహిళలందరూ యోగా దుస్తుల్లోనే కార్యక్రమానికి హాజరయ్యారు. వారు దుస్తులు మార్చుకోవడానికి అవకాశం లేకపోవడంతో సమావేశానికి కూడా అలాగే హాజరయ్యారు.

మహిళలు దుస్తులు వేసుకోకపోయినా బాగుంటారు.. - రామ్‌దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు
X

ఈ మధ్య ఆధ్యాత్మిక ప్రవచన కర్తలు, యోగా గురువులు దారి తప్పి ప్రవర్తిస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన వారే శృతిమించి ఆగ్రహావేశాలు ప్రదర్శించడంతోపాటు అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ విమర్శల పాలవుతున్నారు. మహిళల దుస్తుల గురించి ఇటీవల ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు, యోగా గురువులు చేస్తున్న వ్యాఖ్యలు ఎవరికీ రుచించడం లేదు. తాజాగా ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా మహిళలు దుస్తులు వేసుకోకపోయినా బాగుంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ్ దేవ్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రామ్ దేవ్ బాబాకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.

అసలేం జరిగిందంటే.. మహారాష్ట్రలోని థానేలో పతంజలి యోగా పీఠం, ముంబై మహిళల పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం యోగా సైన్స్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చాలామంది ప్రముఖ మహిళలు హాజరయ్యారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అక్కడ ఒక సమావేశం జరిగింది.

అయితే యోగా శిక్షణ కోసం మహిళలందరూ యోగా దుస్తుల్లోనే కార్యక్రమానికి హాజరయ్యారు. వారు దుస్తులు మార్చుకోవడానికి అవకాశం లేకపోవడంతో సమావేశానికి కూడా అలాగే హాజరయ్యారు. ఈ పరిస్థితి గమనించిన రామ్ దేవ్ బాబా ఇంటికి వెళ్లిన తర్వాత చీరలు ధరించవచ్చని మహిళలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు చీరలు, సల్వార్ సూట్లలో అందంగా ఉంటారని వ్యాఖ్యానించారు. తన కళ్ళకి అయితే వారు ఏం ధరించకపోయినా బాగుంటారని నోరు జారారు.

ఒక యోగా గురువు అయి ఉండి రామ్ దేవ్ మహిళల దుస్తులు వేసుకోకపోయినా బాగుంటారని వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేకంగా మహిళలు రామ్ దేవ్ బాబా పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మహిళలపై రాందేవ్ బాబా చేసిన ఈ వ్యాఖ్యల పట్ల చెలరేగిన వివాదం మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది.

First Published:  26 Nov 2022 4:44 AM GMT
Next Story