Telugu Global
National

ఇరు వర్గాల దాడులు, తగలబడ్డ కార్లు.. శ్రీరాముడి ఊరేగింపు హింసాత్మకం

ఆందోళనకారులు వాహనాలకు నిప్పుపెట్టారు. ఇందులో పోలీసుల జీప్ లతో సహా, సామాన్యుల కార్లు కూడా తగలబడ్డాయి.

ఇరు వర్గాల దాడులు, తగలబడ్డ కార్లు.. శ్రీరాముడి ఊరేగింపు హింసాత్మకం
X

శ్రీరామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగిన ఉత్సవాల్లో కొన్ని చోట్ల అల్లర్లు చోటు చేసుకున్నాయి. గుజరాత్ లోని వడోదర, మహరాష్ట్రలోని ఔరంగాబాద్, పశ్చిమబెంగాల్ లోని హౌరా ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. హౌరా అల్లర్లు ఈ సారి దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు వాహనాలకు నిప్పుపెట్టారు. ఇందులో పోలీసుల జీప్ లతో సహా, సామాన్యుల కార్లు కూడా తగలబడ్డాయి.

రెచ్చగొట్టేలా..

శ్రీరామవనమి సందర్భంగా పశ్చిమ బెంగాల్ లో అల్లర్లు జరుగుతాయని ముందునుంచీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికితోడు మమతా బెనర్జీ ముందుగానే ఊరేగింపుల విషయంలో నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు. సున్నిత ప్రాంతాల్లో ఊరేగింపు వద్దని చెప్పారు. అయితే హౌరా ప్రాంతంలో ఊరేగింపులు కొంతమందిని రెచ్చగొట్టేలా జరిగాయని మమత ఆరోపిస్తున్నారు. అల్లర్లు, కుట్రలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని దీదీ వెల్లడించారు. శ్రీరామనమవి ఊరేగింపుల్లో కత్తులు దూసేందుకు మీరెవరు, ఎవరు అనుమతిచ్చారు, హౌరా ర్యాలీలో బుల్డోజర్లు ఉపయోగించడానికి మీకెంత ధైర్యం.. అంటూ ప్రశ్నించారు మమత. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు ఉన్న ప్రాంతంలో సందడి వాతావరణం ఉంటుందని, ఊరేగింపుల పేరుతో ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లడం సరికాదని మమత ఇదివరకే హెచ్చరించారు.

బీజేపీ వాదన ఏంటంటే..?

బెంగాల్ లో హింస, కాల్పులకు కారణం మమతా బెనర్జీ వంటి నేతలేనని బీజేపీ విమర్శిస్తోంది. హిందువుల మనోభావాలను విస్మరిస్తూ మమతా బెనర్జీ.. శ్రీరామ నవమి రోజు ధర్నా చేశారని ఆరోపించారు. ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని హిందువులను మమత హెచ్చరించారని, అయితే ఆమె హిందువులను మరిచిపోవడం సరికాదన్నారు. బెంగాల్ హోం శాఖ మంత్రి ఈ హింసకు బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు.

First Published:  30 March 2023 4:24 PM GMT
Next Story