Telugu Global
National

అసెంబ్లీ పెట్టాల్సిందే.. రాజ్ భవన్ ముందు ఆప్ ఎమ్మెల్యేల ర్యాలీ..

సెప్టెంబర్ 27న ప్రత్యేక అసెంబ్లీ పెడతామంటున్నారు సీఎం భగవంత్ మన్. గవర్నర్ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అసెంబ్లీ సమావేశాలు జరిపి తీరతామంటున్నారు.

అసెంబ్లీ పెట్టాల్సిందే.. రాజ్ భవన్ ముందు ఆప్ ఎమ్మెల్యేల ర్యాలీ..
X

పంజాబ్‌లో అసెంబ్లీ సమావేశాలు పెట్టి బల పరీక్ష నిర్వహించాలనుకుంటున్నారు సీఎం భగవంత్ మన్. ప్రత్యేక సమావేశాలకు ససేమిరా అని అడ్డుపుల్ల వేశారు గవర్నర్ భన్వరి లాల్ పురోహిత్. దీంతో అక్కడ కొత్త గొడవ మొదలైంది. మొన్నటి వరకూ బీజేపీ నేతలు ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలను కొంటున్నారనే రగడ, నిన్నటి నుంచి బల పరీక్షకు కావాలనే గవర్నర్ అడ్డుపడ్డారనే గొడవ.. ఇలా పంజాబ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ ముందు ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక సమావేశాలు పెట్టాల్సిందేనంటూ డిమాండ్ చేశారు.

పంజాబ్‌ గవర్నర్‌ భన్వరిలాల్ పురోహిత్ వైఖరిని ఖండిస్తూ ఆ రాష్ట్ర ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ ముందు ర్యాలీ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక అసెంబ్లీ నిర్వహిస్తామని, సెప్టెంబర్ 27న సమావేశాలు ఉంటాయని అంటున్నారు ఎమ్మెల్యేలు. ఈ మేరకు ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం సీఎం భగవంత్ మన్ కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే విశ్వాస పరీక్ష కోసమే అసెంబ్లీ సమావేశ పరుస్తున్నామని సీఎం చెప్పలేదు. విద్యుత్ సమస్యలు, పంట కాల్చడం వంటి అంశాలపై చర్చించాల్సి ఉందని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్ని గవర్నర్‌ రద్దు చేసిన అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు సీఎం భగవంత్ మన్.

ఇదో కొత్త వివాదం..

గతంలో ఎప్పుడూ గవర్నర్, సీఎం మధ్య ఇలాంటి వివాదం తలెత్తలేదు. అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని సీఎం పట్టుబట్టడం, కాదు కాదంటూ గవర్నర్ అడ్డుకోవడం ఎక్కడా జరగలేదు. పంజాబ్‌లో ఇలాంటి ప‌రిస్థితి రావడంతో గొడవ మొదలైంది. గవర్నర్ అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం వంటిదని ఆరోపించారు ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్. ఈ రోజు స్పెషల్ అసెంబ్లీ కోసం సీఎం ప్రయత్నించినా గవర్నర్ అడ్డుకున్నారు. దీంతో సెప్టెంబర్ 27న ప్రత్యేక అసెంబ్లీ పెడతామంటున్నారు సీఎం. గవర్నర్ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అసెంబ్లీ సమావేశాలు జరిపి తీరతామంటున్నారు.

First Published:  22 Sep 2022 10:19 AM GMT
Next Story