Telugu Global
National

ఇంగ్లిష్ మీడియం వద్దు.. కోర్టుకెళ్లి విజయం సాధించిన గ్రామస్తులు

కోర్టు ఇచ్చిన తీర్పుపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. పిల్వా గ్రామంలో స్వాతంత్రానికి ముందే 1945లో పాఠశాల ప్రారంభించారు.

ఇంగ్లిష్ మీడియం వద్దు.. కోర్టుకెళ్లి విజయం సాధించిన గ్రామస్తులు
X

ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలోనే విద్య అందిస్తున్నారు. రాజస్థాన్‌లో కూడా గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటికే సుమారు 1000 పాఠశాలలను ఇంగ్లిష్ మీడియం పాఠశాలలుగా ప్రభుత్వం మార్చింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఓ గ్రామం తమ ఊరిలోని పిల్లలకు హిందీలోనే బోధన సాగించాలని ప్రభుత్వాన్ని వేడుకుంది. అయితే ప్రభుత్వం స్పందించకపోవడంతో గ్రామస్తులు కోర్టుకు వెళ్లి మరి విజయం సాధించారు.

జోధ్ పూర్ జిల్లా లోహవత్ అసెంబ్లీ పరిధిలో పిల్వా అనే గ్రామం ఉంది. ఈ ఊరి ప్రజలు తమ గ్రామంలోని పాఠశాలలో ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. వారు తమ పిల్లలు మాతృభాషలోనే చదువుకోవాలని కోరుకున్నారు. తమ గ్రామంలోని పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టవద్దని, మాతృభాషలోనే పాఠాలు చెప్పాలని విద్యాశాఖకు విజ్ఞప్తి చేశారు.

అయితే ప్రభుత్వం గ్రామస్తులు చేసిన విన్నపాన్ని పట్టించుకోలేదు. ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించింది. దీంతో పిల్వా గ్రామస్తులంతా ఏకమై రాజస్థాన్ కోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత విద్యాశాఖ కూడా ఈ విషయమై కోర్టుకు వెళ్ళింది. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన కోర్టు గ్రామస్తులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పిల్వా గ్రామంలోని పాఠశాలలో హిందీ మీడియంలోనే పాఠాలు చెప్పాలని ఆదేశించింది.

కోర్టు ఇచ్చిన తీర్పుపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. పిల్వా గ్రామంలో స్వాతంత్రానికి ముందే 1945లో పాఠశాల ప్రారంభించారు. సైన్యంలో పనిచేస్తూ చనిపోయిన తన కుమారుడి పేరిట ఠాకూర్ గోపాల్ సింగ్ అనే వ్యక్తి ఈ స్కూలును నిర్మించాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల సంఖ్య అన్నిచోట్లా తగ్గుతున్నప్పటికీ ఇక్కడ మాత్రం దాదాపు 800 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఈ ఊరి నుంచి గడిచిన 78 ఏళ్లలో 500 మందికి పైగా భారత సైన్యంలో చేరారు.

First Published:  24 Jan 2023 8:07 AM GMT
Next Story