Telugu Global
National

ఆ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే..

Rajasthan Gas Cylinder Price: సరిగ్గా ఎన్నికల వేళ గ్యాస్ సిలిండర్ రేట్లు తగ్గిస్తున్నామని కాంగ్రెస్ ప్రకటిస్తే, అది ఎన్నికల స్టంట్ అనుకోవచ్చు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే కాంగ్రెస్ దీన్ని అమలు చేయాలని చూస్తుండటంతో బీజేపీకి దిక్కుతోచడంలేదు.

Rajasthan Gas Cylinder Price
X

ఆ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే..

బీజేపీ జమానాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్.. పోటీ పెట్టుకుని మరీ పరుగులు పెడుతున్నాయి. వీటికి రివర్స్ లో రూపాయి విలువ పాతాళానికి పడిపోతోంది. దేశం మొత్తం ఇదే పరిస్థితి. కానీ రాజస్థాన్ లో మాత్రం గ్యాస్ సిలిండర్ రేటు కేవలం 500 రూపాయలు మాత్రమే. అవును రాజస్థాన్ వాసులకు ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలవారికి ఏడాదికి 12 సిలిండర్లను ఒక్కొకటి 500 రూపాయలకు మాత్రమే అందిస్తామని చెప్పారు సీఎం అశోక్ గెహ్లాత్.

రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది టైమ్ ఉంది. 2023 డిసెంబర్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 200 స్థానాలున్న రాజస్థాన్ లో 108 సీట్ల బొటాబొటి మెజార్టీతో ఉంది కాంగ్రెస్. పైగా అక్కడ వర్గపోరు చాలా ఎక్కువ. అశోగ్ గెహ్లాత్ కి పక్కలో బల్లెంలా మారారు సచిన్ పైలెట్. ఏమాత్రం ఛాన్స్ ఇచ్చినా బీజేపీ వైరి వర్గాన్ని ప్రోత్సహించి తమవైపు తిప్పుకుంటుంది. కానీ ఇద్దరూ కొట్టుకుంటున్నా, అధిష్టానానికి విధేయులు కావడంతో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మనగలుగుతోంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఏమాత్రం తేడా వచ్చినా కాంగ్రెస్ నుంచి అధికారం చేజారుతుంది. అందుకే అశోక్ గెహ్లాత్ అక్కడ పట్టు బిగించారు. గ్యాస్ సిలిండర్ రేటు తగ్గిస్తున్నట్టు ప్రకటించి శత్రు శిబిరంలో సెగలు రేపారు.

కాంగ్రెస్ కి చెలగాటం, బీజేపీకి ప్రాణ సంకటం..

రాజస్థాన్ లో అధికారం కోసం సిలిండర్ రేటుని 500 రూపాయలకంటే తగ్గించే హామీ ఇవ్వడం బీజేపీకి పెద్ద పనేం కాదు. కానీ అక్కడే చిన్న మతలబు ఉంది. రాజస్థాన్ లో ఇలాంటి హామీ ఇస్తే, కచ్చితంగా బీజేపీ పాలిత ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి డిమాండ్ మొదలవుతుంది. కాంగ్రెస్ కి కూడా ఆ ఇబ్బంది ఉంది కానీ అది ఒక్క రాష్ట్రానికే పరిమితం. నిజంగానే అదే డిమాండ్ తెరపైకి వస్తే, రాజస్థాన్ తో పాటు, హిమాచల్ ప్రదేశ్ లో కూడా గ్యాస్ సిలిండర్ రేటు తగ్గిస్తుంది కాంగ్రెస్. అదే పని బీజేపీ చేస్తే మాత్రం దేశం మొత్తం సిలిండర్ రేటు తగ్గించాలి. అదే జరిగితే ఇతర విషయాల్లో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది.

కాంగ్రెస్ కి లాభమేనా..?

సరిగ్గా ఎన్నికల వేళ గ్యాస్ సిలిండర్ రేట్లు తగ్గిస్తున్నామని కాంగ్రెస్ ప్రకటిస్తే, అది ఎన్నికల స్టంట్ అనుకోవచ్చు. కానీ ఏడాది ముందే కాంగ్రెస్ దీన్ని అమలు చేయాలని చూస్తుండటంతో బీజేపీకి దిక్కుతోచడంలేదు. సిలిండర్ రేట్లపై కచ్చితంగా బీజేపీ స్పందించాల్సిన సందర్భం ఇది. ఎన్నికల ప్రచారంలో కూడా దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిందే. తాము అధికారంలోకి వస్తే సిలిండర్ రేట్ల తగ్గింపుని కొనసాగిస్తామని బీజేపీ ఒప్పుకోవాల్సిందే. లేకపోతే కచ్చితంగా రాజస్థాన్ లో కాంగ్రెస్ గెలుపుని బీజేపీ ఒప్పుకున్నట్టే లెక్క. మొత్తమ్మీద గ్యాస్ సిలిండర్ విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజస్థాన్ సహా ఇతర రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది.

First Published:  19 Dec 2022 3:23 PM GMT
Next Story