Telugu Global
National

సైబ‌ర్ మోసం.. ఏడు నిమిషాల్లో రూ.8 ల‌క్ష‌లు మాయం.. - పోరాడి ముప్పాతిక శాతం రిక‌వ‌రీ సాధించిన రైతు

హ‌ర్షవ‌ర్ద‌న్ ఆ లింకును క్లిక్ చేయ‌డంతో ఫోనులోకి డూప్లికేట్ యాప్ డౌన్‌లోడ్ అయింది. దీంతో హ‌ర్ష‌వ‌ర్ద‌న్ అందులో యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్ న‌మోదు చేశాడు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా బ్యాంకు ఖాతా నుంచి న‌గ‌దు విత్‌డ్రా అవుతున్న‌ట్టు మెసేజ్‌లు వ‌చ్చాయి.

సైబ‌ర్ మోసం.. ఏడు నిమిషాల్లో రూ.8 ల‌క్ష‌లు మాయం.. - పోరాడి ముప్పాతిక శాతం రిక‌వ‌రీ సాధించిన రైతు
X

పంట సాగు కోసం తీసుకున్న రుణం సొమ్మును సైబ‌రాసురులు కాజేశారు. కేవ‌లం ఏడు నిమిషాల వ్య‌వ‌ధిలో రూ.8,03,899 దోచేశారు. దీంతో కంగుతిన్న రైతు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై బ్యాంకు అధికారులు, పోలీసుల‌కు ఫిర్యాదు చేసి.. కోల్పోయిన సొమ్ములో ముప్పాతిక శాతం వెన‌క్కి తెచ్చుకోగ‌లిగాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

రాజ‌స్థాన్‌లోని శ్రీగంగాన‌గ‌ర్ సిటీకి చెందిన రైతు ప‌వ‌న్‌కుమార్ సోని (55) కిసాన్ కార్డు ద్వారా పంట సాగు కోసం రుణం తీసుకున్నాడు. అత‌ని ఎస్బీఐ ఖాతా అత‌ని కుమారుడి ఫోన్‌తో లింక్ అయి ఉంది. ప‌వ‌న్‌కుమార్ త‌న‌యుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ (26) ఢిల్లీలోని ద్వార‌కాలో ఉండి చ‌దువుకుంటున్నాడు. అత‌ని ఫోనుకు జ‌న‌వ‌రి 7వ తేదీన ఒక మెసేజీ వ‌చ్చింది. `మీ ఖాతా ఆగిపోయింది.. ద‌య‌చేసి కేవైసీ అప్‌డేట్ చేయండి` అనేది దాని సారాంశం.

హ‌ర్షవ‌ర్ద‌న్ ఆ లింకును క్లిక్ చేయ‌డంతో ఫోనులోకి డూప్లికేట్ యాప్ డౌన్‌లోడ్ అయింది. దీంతో హ‌ర్ష‌వ‌ర్ద‌న్ అందులో యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్ న‌మోదు చేశాడు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా బ్యాంకు ఖాతా నుంచి న‌గ‌దు విత్‌డ్రా అవుతున్న‌ట్టు మెసేజ్‌లు వ‌చ్చాయి. ఈ విధంగా నాలుగు ద‌ఫాలుగా మొత్తం రూ.8,03,899 న‌గ‌దు డ్రా చేసుకున్న‌ట్టు మెసేజ్‌లు వ‌చ్చాయి. దీంతో కంగారుప‌డిన హ‌ర్ష‌వ‌ర్ద‌న్ వెంట‌నే త‌న తండ్రికి ఈ విష‌యాన్ని చేర‌వేశాడు. దీంతో కంగుతిన్న ప‌వ‌న్‌కుమార్ వెంట‌నే బ్యాంకుకు ప‌రుగులు పెట్టి.. మేనేజ‌ర్‌కు ఫిర్యాదు చేశాడు. మ‌రోప‌క్క హ‌ర్ష‌వ‌ర్ద‌న్ సైతం ద్వార‌కాలోని సైబ‌ర్ సెల్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు. బ్యాంకు మేనేజ‌ర్ వెంట‌నే స్పందించి పంపించిన ఈ మెయిల్‌తో `పేయూ` డిజిట‌ల్ పేమెంట్ స‌ర్వీసుకు వెళ్లిన డ‌బ్బు రూ.6,24,000 వెన‌క్కి ర‌ప్పించ‌గ‌లిగారు.

మ‌రో డిజిట‌ల్ పేమెంట్ స‌ర్వీసు `సీసీ అవెన్యూ`, యాక్సిస్ బ్యాంకు ఖాతాల‌కు వెళ్లిన మిగిలిన సొమ్ము మాత్రం ఫిర్యాదుల న‌మోదు, ఈ మెయిల్ పంప‌డంలో పోలీసుల నుంచి జ‌రిగిన జాప్యంతో వెన‌క్కి రాలేదు. త‌న ఖాతాలో నుంచి వెళ్లిన డ‌బ్బు కోల్‌క‌తాలోని వ్య‌క్తుల‌కు చేరిన‌ట్టు మిత్రుల ద్వారా తెలుసుకొని చెప్పినా.. జ‌న‌వ‌రి 23 దాకా సైబ‌ర్ సెల్ పోలీసులు స్పందించ‌లేద‌ని ప‌వ‌న్‌కుమార్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మిగిలిన సొమ్మును కూడా ఇప్పించాల‌ని ఆయ‌న వేడుకుంటున్నారు.

First Published:  20 Feb 2023 5:24 AM GMT
Next Story