Telugu Global
National

75 ఏళ్ళ ఆజాదీ వేళ...నీళ్ళు ముట్టుకున్నందుకు దళిత బాలుడుని కొట్టి చంపారు

75 ఏళ్ళ ఆజాదీ వేళ...నీళ్ళు ముట్టుకున్నందుకు దళిత బాలుడుని కొట్టి చంపారు
X

ఆధునిక భార‌తంలో ఇంకా అస్పృశ్య‌త‌, అంట‌రానిత‌నాల సంస్కృతి కొన‌సాగుతోంది. ద‌ళితుల ప‌ట్ల దారుణ‌మైన వివ‌క్ష వీడిపోవ‌డం లేద‌న్న సంఘ‌ట‌న‌లు ఇంకా వెలుగు చూస్తుండ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. త‌మిళ‌నాడులో ద‌ళిత మ‌హిళా స‌ర్పంచ్ వ‌ర‌ద‌రాజిని స్వాతంత్య్ర‌దినోత్స‌వం రోజున ప‌తాకావిష్క‌ర‌ణకు అనుమ‌తించ‌డంలేదంటూ ఆమె ఫిర్యాదు చేశారు. ఇంత‌లోనే మ‌రో సంఘ‌ట‌న‌. ఆజాదీకా అమృతోత్స‌వాలు జ‌రుపుకుంటున్న వేళ ఈ దుష్ట సంస్కృతికి ప‌రాకాష్ట‌గా నిలుస్తోంది రాజ‌స్తాన్ లోని జాలోర్ లో జ‌రిగిన సంఘ‌ట‌న. ఇదేనా ఆజాదీ కా అమృతోత్స‌వం అంటూ విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి..

ఒక ప్ర‌వేటు పాఠ‌శాల‌లో చ‌దువుతున్న తొమ్మిదేళ్ల ద‌ళిత బాలుడు దాహం తీర్చుకోవ‌డానికి అక్క‌డ ఉన్న కుండ‌లో నీరు తాగాడు. అగ్రకుల విద్యార్థులు నీళ్ళు తాగే కుండ‌ను ఎందుకు తాకావంటూ అత‌నిని ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టాడు. దీంతో గాయాల‌పాలైన ఆ బాలుడు శ‌నివారంనాడు మ‌ర‌ణించాడు. ఈ దుర‌దృష్టక‌ర‌మైన సంఘ‌ట‌న వివ‌రాలిలా ఉన్నాయి.

జాలోర్ జిల్లా సైలా గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జూలై 20న ఈ ఘటన జరిగింది. కంటికి, చెవికి గాయమైన చిన్నారిని చికిత్స నిమిత్తం 300 కిలోమీటర్ల దూరంలోని అహ్మదాబాద్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు నిన్న మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌క్కుండా ఆ ప్రాంతంలో ఇంటర్నెట్‌ను నిలిపివేశారు.

ఆ ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద హత్యా నేరం కేసు న‌మోదు చేశారు. అత‌నిని అరెస్టు చేసి విచారిస్తున్నామ‌ని కేసు ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి తెలిపారు.

తాగు నీటి కుండను తాకినందుకు బాలుడిని దారుణంగా కొట్టారని బాలుడి కుటుంబీకులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. త‌న కుమారుడు కుండ‌లో నీళ్లు తాగినందుకు చైల్ సింగ్ అనే ఉపాధ్యాయుడు కులం పేరుతో దూషిస్తూ తీవ్రంగా కొట్టాడ‌ని బాలుడి తండ్రి దేవ‌రాం మేఘావాల్ చెప్పారు. బాలుడికి క‌న్ను, చెవినుంచి ర‌క్తం విప‌రీతంగా కార‌డంతో ఉద‌య్ పూర్ ఆస్ప్త‌త్రికి చికిత్స కోసం తీసుకెళ్ళాన‌ని చెప్పాడు. అక్క‌డి నుంచి మెరుగైన చికిత్స కోసం అహ్మ‌దాబాద్ త‌ర‌లించార‌ని చెప్పారు. చికిత్స పొందుతూ శ‌నివారం మ‌ర‌ణించాడ‌ని మేఘ‌వాల్ తెలిపారు.

రాష్ట్ర విద్యా శాఖ ఈ విషయంపై విచారణ ప్రారంభించింది. ఈ కేసును వేగంగా దర్యాప్తు చేయాలని రాజస్థాన్ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఖిలాడి లాల్ బైర్వా ఆదేశించారు.

కాగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేస్తూ, కేసును త్వరితగతిన దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చూస్తామని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కుటుంబానికి రూ. 5 లక్షల సాయం అందజేస్తామని ఆయన తెలిపారు.

First Published:  14 Aug 2022 6:43 AM GMT
Next Story