Telugu Global
National

అసెంబ్లీలో పాత బడ్జెట్ చదివిన రాజస్థాన్ సీఎం.. సభ్యుల ముందు నవ్వులపాలు

ముఖ్యమంత్రి చదువుతున్నది కొత్త బడ్జెట్ సారాంశం కాదని, అది గత ఏడాది బడ్జెట్ కు సంబంధించిన కాపీ అని తెలుసుకొని ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు.

అసెంబ్లీలో పాత బడ్జెట్ చదివిన రాజస్థాన్ సీఎం.. సభ్యుల ముందు నవ్వులపాలు
X

మామూలుగా బడ్జెట్ ప్రవేశపెట్టే మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా అన్ని పత్రాలు పక‌డ్బందీ చేసుకొని అసెంబ్లీకి వస్తారు. ఏమేం మాట్లాడాలో ముందే ప్రిపేర్ అవుతారు. ఏ పథకానికి ఎన్ని నిధులు కేటాయించాం, ఏ శాఖలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చాం అన్నది బడ్జెట్ ప్రవేశపెట్టే వారికి సంపూర్ణ అవగాహన ఉంటుంది. అయితే ఇవాళ రాజస్థాన్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన పనికి నవ్వుల పాలయ్యారు.

సీఎం కొత్త బడ్జెట్ కాపీ అనుకొని గత ఏడాదికి సంబంధించిన బడ్జెట్ కాపీని అసెంబ్లీలో చదివి వినిపించారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి చదువుతున్నది కొత్త బడ్జెట్ కాదని, పాత బడ్జెట్ గురించి అని తెలుసుకున్న విపక్ష సభ్యులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ ఏడాది ఆఖర్లో రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. ఇవాళ ఉదయం అసెంబ్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి 11 గంటలకు 2023 -24 ఏడాదికి సంబంధించిన బడ్జెట్ సారాంశాన్ని చదివి వినిపించడం ప్రారంభించారు. ఏయే శాఖలకు ఎన్ని నిధులు కేటాయించాం, ఏ పథకాలకు ఎన్ని నిధులు కేటాయించింది తెలుపుతూ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు.

అయితే ముఖ్యమంత్రి బడ్జెట్ చదివి వినిపించే సమయంలో ప్రతిపక్షాలు గందరగోళంలో కూరుకుపోయాయి. కాసేపటికి సభ్యులకు ముఖ్యమంత్రి చదువుతున్నది కొత్త బడ్జెట్ సారాంశం కాదని, అది గత ఏడాది బడ్జెట్ కు సంబంధించిన కాపీ అని తెలుసుకొని ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు.

ఈ విషయం గురించి తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ మహేష్ జోషి అసలు విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వెంటనే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బడ్జెట్ కాపీని చదవడం ఆపేశారు. ముఖ్యమంత్రి పాత బడ్జెట్ కాపీని ఒకటి, రెండు నిమిషాలు కాదు ఏకంగా 7 నిమిషాల పాటు చదివి వినిపించి సభలో నవ్వుల పాలయ్యారు.

అశోక్ గెహ్లాట్ పాత బడ్జెట్ ను చదివి వినిపించడంతో విపక్ష సభ్యులు ఒక్కసారిగా వెల్ లోకి దూసుకువచ్చి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాను చేసిన పొరపాటుకు ముఖ్యమంత్రి క్షమాపణలు కోరినా ప్రతిపక్ష సభ్యులు తమ ఆందోళన కొనసాగించడంతో స్పీకర్ సీపీ జోషి వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సభను అరగంట పాటు వాయిదా వేశారు.

First Published:  10 Feb 2023 11:14 AM GMT
Next Story