Telugu Global
National

సీజేఐ ఎన్వీ రమణ ముందే జుడీషియరీపై రాజస్థాన్ సీఎం సంచలన వ్యాఖ్యలు

ఈ దేశంలో న్యాయవ్యవస్థ పనితీరుపైన, కేంద్రంపైనా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదికూడా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, సుప్రీంకోర్టుకు చెందిన ఇతర జడ్జీల ముందే ఆయన నిష్కర్షగా తన అభిప్రాయాలు చెప్పారు.

సీజేఐ ఎన్వీ రమణ ముందే జుడీషియరీపై రాజస్థాన్ సీఎం సంచలన వ్యాఖ్యలు
X

ఈ దేశంలో న్యాయవ్యవస్థ పనితీరుపైన, కేంద్రంపైనా రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదికూడా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, సుప్రీంకోర్టుకు చెందిన ఇతర జడ్జీల ముందే ఆయన నిష్కర్షగా తన అభిప్రాయాలు చెప్పారు. జైపూర్ లో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. జడ్జీలు రిటైరయ్యాక వాళ్ళు ఇతర పదవులు పొందడంలో ఔచిత్యం ఉందా అని ప్రశ్నించారు. ఇందుకు ఉదాహరణగా మాజీ సీజేఐ, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు రంజన్ గొగోయ్ గురించి ప్రస్తావించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని నలుగురు జడ్జీలు చెప్పారని, వీరిలో ఒకరు రంజన్ గొగోయ్ అని ఆయన వ్యాఖ్యానించారు. రిటైర్ మెంట్ తర్వాత వచ్చే పోస్టుల కోస‍ం న్యాయమూర్తులు తహతహలాడుతూ ఉంటే ఇక న్యాయమేం చేస్తారని ఆయన అన్నారు.

కొందరు లాయర్లు 50 లక్షల నుంచి కోటి రూపాయలవరకు ఫీజు తీసుకుంటున్నారు. పేదలు, మధ్యతరగతి వర్గాలెవరూ సుప్రీంకోర్టుకు వచ్చే పరిస్థితి లేదు అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ వ్యాఖ్యలపై కామెంట్ చేసిన ఇద్దరు న్యాయమూర్తులపై మాజీ జడ్జీలు, మాజీ బ్యూరోక్రాట్లు కొందరు విరుచుకపడడాన్ని ఆయన ప్రశ్నించారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పార్దీవాలా మీద సుమారు 116 మంది ధ్వజమెత్తారని, ఇంత రచ్చ అవసరమా అని ఆయన అన్నారు. జుడీషియరీ మీద తనకు గౌరవం ఉందంటూనే.. మాజీ జడ్జీలు తమ తీరు మార్చుకోవాలని పరోక్షంగా పేర్కొన్నారు. దేశంలోని పరిస్థితిపై ఈ ఇద్దరు జడ్జీలు మాట్లాడితే ఈ మాజీలంతా దానిమీద పెద్ద రచ్చ చేశారు అని అశోక్ గెహ్లాట్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

దేశంలోని హింసాత్మక పరిస్థితులపై ప్రధాని మోడీ, కేంద్రం దృష్టి సారించాలని, ఈ విధమైన ఉద్రిక్త వాతావరణం తలెత్తకుండా చూడాలని ఆయన కోరారు. దేశంలో సమైక్యత, మత సామరస్యం నెలకొనాలని మోడీ ఈ దేశ ప్రజలకు ఎందుకు చెప్పరు అని గెహ్లాట్ ప్రశ్నించారు. హింసను తానెట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని మోడీ హెచ్చరించాలని, న్యాయశాఖ మంత్రి (కిరణ్ రిజిజు) ఆయనకు నచ్చజెబుతారని ఆశిస్తున్నానని గెహ్లాట్ పేర్కొన్నారు. మేం చెప్పేది ఎలాగూ మోడీ ఆలకించడం లేదు.. కనీసం మీరైనా చెప్పండి అని రిజిజును కోరారు.

ప్రజాప్రతినిధుల బేరసారాల గురించి ఆయన ప్రస్తావిస్తూ తమ రాష్ట్రంలో తన ప్రభుత్వం ఎలా నిలదొక్కుకుందో తనకేకు తెలియడంలేదన్నారు. ఎమ్మెల్యేలను కోట్లు పెట్టి కొంటున్నారని, దేశంలో పరిస్థితి ప్రమాదకరంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గోవా, మణిపూర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొడుతున్నారని, ఈ దేశంలో ఇలాంటి తమాషా కొనసాగుతోందని వ్యాఖ్యానించిన ఆయన.. ఇదేనా ప్రజాస్వామ్యం అని కూడా ప్రశ్నించారు.




First Published:  17 July 2022 5:17 AM GMT
Next Story