Telugu Global
National

వివాహానికి వేదికైన ఆస్పత్రి.. రెండు చేతులు విరిగిన వధువుకు తాళి కట్టిన వరుడు

వధువు ఇంటి మెట్లు దిగుతుండగా కాలుజారి పైనుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో పెళ్లికూతురి రెండు చేతులు విరిగిపోయాయి. తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.

వివాహానికి వేదికైన ఆస్పత్రి.. రెండు చేతులు విరిగిన వధువుకు తాళి కట్టిన వరుడు
X

ఇంకొన్ని గంటల్లో పెళ్లి.. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో వధువు రెండు చేతులు విరిగి, తలకు గాయాలై ఆసుపత్రిలో చేరింది. అయితే పెళ్లి ఆగిపోకుండా వరుడు కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతా కలిసి ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడే వరుడు వధువుకు తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది.

కోట జిల్లా రామ్ గంజ్ మండి ప్రాంతంలోని భావ్ పురా గ్రామానికి చెందిన పంకజ్ కు రావత్ భటా కు చెందిన మధు రాథోడ్ కు శనివారం వివాహం జరగాల్సి ఉంది. దీంతో వరుడు, వధువు కుటుంబాల్లో వివాహ తంతుకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అమ్మాయి తరపు వాళ్లు పెళ్లికూతురిని ముస్తాబు చేశారు. అక్కడి నుంచి ఆమెను మండపానికి తీసుకెళ్లేందుకు అందరూ బయలుదేరారు.

వధువు ఇంటి మెట్లు దిగుతుండగా కాలుజారి పైనుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో పెళ్లికూతురి రెండు చేతులు విరిగిపోయాయి. తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం కోట పట్టణంలోని ఎస్బీఎస్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వరుడి కుటుంబ సభ్యులు వెంటనే పెళ్లి మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడ అమ్మాయి తరఫు వారితో చర్చించారు. పెళ్లి ఆగిపోకుండా ఆస్పత్రిలోనే జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ఆసుపత్రి అధికారుల అనుమతి తీసుకున్నారు.

ఆస్పత్రిలోని ఒక గదిని తీసుకొని, దానిని అందంగా అలంకరించారు. ఆ తర్వాత వరుడు కల్యాణ మండపం వద్ద నుంచి ఊరేగింపుగా ఆసుపత్రి వద్దకు చేరుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లికూతురు రెండు విరిగిన చేతులకు కట్లు కట్టుకొని ఉండగా వరుడు ఆమె మెడలో తాళి కట్టాడు. ఈ ఫొటోలను కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అయ్యాయి. వివాహం ఆగిపోకుండా వరుడి కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

First Published:  14 Feb 2023 7:09 AM GMT
Next Story