Telugu Global
National

పుణ్యానికి ప్యాసింజర్ రైళ్లు.. రైల్వే మంత్రి సంచలన వ్యాఖ్యలు..

మోదీ ప్రభుత్వం లాభాల గురించి పని చేయడం లేదని, ప్రజల సౌలభ్యం కోసం రైళ్లను కచ్చితంగా నడపాలని మోదీ సూచించారని, అందుకే ప్యాసింజర్ రైళ్లను ఆపడంలేదని సెలవిచ్చారు మంత్రి ధన్వే.

పుణ్యానికి ప్యాసింజర్ రైళ్లు.. రైల్వే మంత్రి సంచలన వ్యాఖ్యలు..
X

ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ విధి. అంతే కాని, ‌ప్రైవేట్ ట్రావెల్స్ లాగా లాభాలు బేరీజు వేసుకుంటే కష్టమే. కానీ రైల్వే ఇప్పుడు పూర్తిగా కమర్షియల్‌గా మారిపోతోందనే ఆరోపణలు వినపడుతున్నాయి. చార్జీలు పెరిగిపోయాయి. పండగ వేళ ప్లాట్ ఫామ్ చార్జీలతో మోత మోగిస్తున్నారు. ఎక్స్ ప్రెస్ రైళ్లలో సౌకర్యాలుండవు కానీ, చార్జీలు భారీగా పెంచారు. ఇక స్పెషల్ రైళ్లు అంటూ అడ్డగోలు దోపిడీ అదనం. వీటన్నిటికీ పరాకాష్టగా మిగిలాయి రైల్వే శాఖ సహాయ మంత్రి రావ్ సాహెబ్ ధన్వే మాటలు. ప్యాసింజర్ రైళ్లు నష్టానికి నడుపుతున్నామని చెప్పారాయన.

"ప్యాసింజర్‌ రైళ్ల వల్ల భారతీయ రైల్వేకు లాభాలు రావడం లేదు, ప్రజల సౌకర్యం కోసమే సర్వీసులు నడుపుతున్నాం. ప్యాసింజర్‌లో ప్రతి రూపాయికి 55 పైసలు నష్టం వస్తోంది. ఈ నష్టాన్ని గూడ్సు రైళ్ల ద్వారా భర్తీ చేస్తున్నాం." రైల్వే శాఖ సహాయ మంత్రి చేసిన తాజా వ్యాఖ్యలివి. అక్కడితో ఆయన ఆగలేదు, మోదీ ప్రభుత్వం లాభాల గురించి పని చేయడం లేదని, ప్రజల సౌలభ్యం కోసం రైళ్లను కచ్చితంగా నడపాలని మోదీ సూచించారని, అందుకే ప్యాసింజర్ రైళ్లను ఆపడంలేదని సెలవిచ్చారు మంత్రి ధన్వే.

మోదీకి ముందు రైళ్లు లేవా..?

ఏదో పుణ్యానికి ప్యాసింజర్ రైళ్లను నడుపుతున్నట్టు కలరింగ్ ఇస్తున్నారు మంత్రి ధన్వే. ప్రధాని మోదీ చెప్పకపోతే ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసేవారిమని కూడా అంటున్నారాయన. అసలు మోదీ కంటే ముందు భారత్‌లో రైళ్లు లేవా, అప్పటి ప్రభుత్వాలు ప్యాసింజర్ రైళ్లను నడపలేదా. అప్పటి ప్రభుత్వాలకు సాధమైంది, ఈ ప్రభుత్వానికొచ్చిన కష్టమేంటి..? అసలు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా..? కరోనా తర్వాత పరిస్థితులు చక్కబడినా కొన్ని చోట్ల ప్యాసింజర్ సర్వీసులు పూర్తి స్థాయిలో పునరుద్ధరించలేదు. రైల్వేలో వివిధ వర్గాలకు ఇచ్చే రాయితీని కూడా ఎత్తేశారు. అట్టహాసంగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ల పనితీరు ఏంటో ఇప్పటికే అర్థమైంది. రాగా పోగా రైల్వేకు మోదీ హయాంలో జరిగింది శూన్యం. పైగా ఇప్పుడు ప్యాసింజర్ రైళ్లపై మంత్రి చేసిన వ్యాఖ్యలు మరింత బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.

First Published:  28 Oct 2022 5:02 AM GMT
Next Story