Telugu Global
National

ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక.. తప్పు ఎవరిదంటే..?

సిగ్నల్‌ లోపం కారణంగా ప్రమాదం జరిగినట్టు రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్థారించింది. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌.. లూప్‌ లైన్‌ లోకి మారినట్లు తెలిపారు అధికారులు.

ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక.. తప్పు ఎవరిదంటే..?
X

మూడురైళ్ల ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో ఇంత ఘోరం ఎక్కడా జరగలేదు, కనీసం ఎవరూ ఊహించలేదు. అసలింతకీ ఈ ప్రమాదానికి కారణం ఏంటి..? తప్పు ఎక్కడ జరిగింది..? దీనిపై రైల్వే శాఖ ప్రాథమిక విచారణ చేపట్టింది. ఆ నివేదిక కూడా బయటపెట్టింది. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ మెయిన్ లైన్ లో వెళ్లకుండా లూప్ లైన్ లోకి వెళ్లడమే దీనికి కారణం అని తేల్చింది.

సిగ్నల్ లోపం..

సిగ్నల్‌ లోపం కారణంగా ప్రమాదం జరిగినట్టు రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్థారించింది. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌.. లూప్‌ లైన్‌ లోకి మారినట్లు తెలిపారు అధికారులు. ఖాంతాపార స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. చెన్నై వెళ్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ ప్రెస్‌ మెయిన్‌ లైన్‌ లోకి వెళ్లేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అయితే, రైలు పొరపాటున లూప్‌ లైన్‌ లోకి ప్రవేశించింది. అప్పటికే ఆ లూప్‌ లైన్‌ లో గూడ్స్‌ రైలు ఆగి ఉంది. కోరమాండల్‌ ఎక్స్‌ ప్రెస్‌ దాన్ని వేగంగా ఢీకొట్టి పట్టాలు తప్పింది.

మరో ప్రమాదం..

కోరమాండల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతోపాటు, దాని కారణంగా హౌరా ఎక్స్ ప్రెస్ కూడా ప్రమాదానికి గురికావడం మరో విషాదం. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బోగీలు పట్టాలు తప్పి పక్క ట్రాక్ పై పడ్డాయి. సాయంత్రం 6.52 నిమిషాల తర్వాత ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత మరో రెండు నిమిషాలకే హౌరా ఎక్స్ ప్రెస్, కోరమాండల్ బోగీలను ఢీకొని పట్టాలు తప్పింది. ప్రాథమిక నివేదికలో ఈ వివరాలు పొందుపరిచింది రైల్వే శాఖ.

మానవ తప్పిదమే కారణమా..?

సిగ్నలింగ్‌ లో మానవ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో కోరమాండల్‌ ఎక్స్‌ ప్రెస్‌ గంటకు 130 కి.మీల వేగంతో వెళ్తోందని, లూప్ లైన్ లో గూడ్స్ రైలు ఆగి ఉన్నట్టు గుర్తించినా, లోకోపైలట్ బ్రేక్ వేయడం సాధ్యం కాలేదని.. దీంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కోరమాండల్‌ ఎక్స్‌ ప్రెస్‌ లో 1257 మంది రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు ఉన్నట్లు రైల్వే శాఖ తెలిపింది. బెంగళూరు-హౌరా ఎక్స్‌ ప్రెస్‌ లో 1039 మంది రిజర్వ్‌ డ్‌ ప్రయాణికులు ఉన్నట్లు లెక్క తేల్చారు. వీరు కాకుండా జనరల్‌ బోగీల్లో ఉన్నవారు కూడా ప్రమాదానికి గురయ్యారు.

First Published:  3 Jun 2023 11:28 AM GMT
Next Story