Telugu Global
National

ఐటీలోనే కాదు, రైల్వేలోనూ ఉద్యోగులకు మూడింది

రైల్వేలో సిగ్నలింగ్‌, మెడికల్‌, స్టోర్స్‌, మెకానికల్‌ విభాగాల్లో ఇప్పటికే 139 మంది ఉద్యోగులకు బలవంతంగా వీఆర్ఎస్ ఇప్పించారు. మరో 38మందిని విధులనుంచి తొలగించారు.

ఐటీలోనే కాదు, రైల్వేలోనూ ఉద్యోగులకు మూడింది
X

కరోనా కాలంలో కూడా ఉద్యోగుల్ని భరించిన ఐటీ సంస్థలు, తాజాగా ఖర్చు తగ్గించుకోవడం కోసం కొలువులను తెగ్గోస్తున్నాయి. దిగ్గజ సంస్థలు సైతం ఉద్యోగులను తొలగించడం రివాజుగా మారింది. ట్విట్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇది ఐటీ, ఐటీ సంబంధిత పరిశ్రమలకే కాదు, భారత్ లో రైల్వే కూడా ఉద్యోగుల్ని తొలగించడంలో దూకుడుగా ఉంది. గత 16నెలలుగా భారతీయ రైల్వేలో ప్రతి మూడు రోజులకు ఓ ఉద్యోగిపై వేటు పడుతోంది.

రైల్వే ఉద్యోగులపై కొరడా..

గతేడాది అశ్వినీ వైష్ణవ్‌ రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగుల పనితీరు విషయంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. విధులు సక్రమంగా నిర్వర్తించనివారికి వీఆర్‌ఎస్‌ ఇస్తామని హెచ్చరించారు. అక్కడితో ఆగలేదు, బలవంతపు వీఆర్ఎస్ పద్ధతిని అమలులోకి తెచ్చారు కూడా. అవినీతికి పాల్పడే ఉద్యోగులను తక్షణమే విధుల నుంచి తొలగిస్తోంది రైల్వే శాఖ. సిగ్నలింగ్‌, మెడికల్‌, స్టోర్స్‌, మెకానికల్‌ విభాగాల్లో ఇప్పటికే 139 మంది ఉద్యోగులకు బలవంతంగా వీఆర్ఎస్ ఇప్పించారు. మరో 38 మందిని విధులనుంచి తొలగించారు.

బుధవారం ఇద్దరు సీనియర్‌ గ్రేడ్‌ అధికారులను విధుల నుంచి తొలగించారు. ఇందులో ఒకరు హైదరాబాద్‌ లో రూ.5లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కగా, రాంచీలో మరో అధికారి రూ.3లక్షలు తీసుకుంటూ అధికారులకు దొరికిపోయారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గత 16 నెలలుగా ప్రతి మూడు రోజులకు ఓ ఉద్యోగిపై వేటు పడుతూనే ఉంది.

First Published:  24 Nov 2022 8:52 AM GMT
Next Story