Telugu Global
National

సైన్యం బాటలో రైల్వే.. ఇకపై ఆ ఉద్యోగాలు ఉండవు..

ఇకపై క్లర్క్ పోస్ట్ లకు నోటిఫికేషన్లు వేయొద్దంటూ డివిజన్ అధికారులను రైల్వే బోర్డ్ ఆదేశించింది. దీంతో కారుణ్య నియామకాల్లో కూడా ఇప్పుడు క్లర్క్ పోస్ట్ లు కరువయ్యాయి.

సైన్యం బాటలో రైల్వే.. ఇకపై ఆ ఉద్యోగాలు ఉండవు..
X

అగ్నిపథ్ తో భారత సైన్యంలో పర్మినెంట్ ఉద్యోగాలు, పింఛన్లకు కోతపడింది. దీంతో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆర్థిక భారం తగ్గింది. ఇదే వ్యూహం ఇతర విభాగాల్లో కూడా మొదలైంది. అయితే అగ్నిపథ్ ఆందోళనలు దృష్టిలో ఉంచుకుని, తెలివిగా ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంది కేంద్రం. రైల్వేలో కూడా పెద్ద ఎత్తున క్లరికల్ పోస్ట్ లకు కోత పెట్టడం ప్రారంభించింది.

గతంలో టెన్త్ అయిపోగానే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలంటే.. సైన్యం, రైల్వే, స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ వైపు చూసేవారు విద్యార్థులు, ఉద్యోగార్థులు. తక్కువ వయసులోనే ఉద్యోగం దొరికితే లైఫ్ సెటిల్ అనుకునేవారు. కానీ, ఇప్పుడు అవంత సులభం కాదు, ఎందుకంటే ఏడాదికేడాది పోటీపడే అభ్యర్థుల సంఖ్య పెరగడంతోపాటు, పోస్ట్ ల సంఖ్య తగ్గిపోతోంది. అగ్నిపథ్ తో సైన్యంలో ఉద్యోగం ఎంత తాత్కాలికమో అర్థమవుతోంది. దీంతోపాటు.. ఇప్పుడు రైల్వే శాఖ కూడా పోస్టులకు కత్తెర వేస్తోంది. రైల్వే నిర్వహణ, భద్రతకు సంబంధించిన విభాగాల్లో తప్ప మిగిలిన వాటిల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని రైల్వే బోర్డ్ నిర్ణయించింది.

ఇకపై క్లర్క్ పోస్ట్ లకు నోటిఫికేషన్లు వేయొద్దంటూ డివిజన్ అధికారులను రైల్వే బోర్డ్ ఆదేశించింది. దీంతో కారుణ్య నియామకాల్లో కూడా ఇప్పుడు క్లర్క్ పోస్ట్ లు కరువయ్యాయి. కారుణ్య నియామకాల్లో గ్యాంగ్ మెన్లు, డీజిల్ షెడ్లలో కళాశీ పోస్ట్ లు మాత్రమే ఇస్తున్నారు. ఇతర విభాగాల్లో ఉన్న పోస్ట్ లను భర్తీ చేయకుండా సరెండర్ చేస్తున్నారు.

ఇవే ఉదాహరణలు..

ఐదేళ్ల క్రితం గుంతకల్లు రైల్వే డివిజన్లో దాదాపు 18వేలమంది ఉద్యోగులు ఉండగా.. ప్రస్తుతం 14వేలమంది మాత్రమే పనిచేస్తున్నారు. 2వేలమంది పదవీ విరమణ చేసినా ఆ పోస్ట్ లు భర్తీ చేయలేదు, మరో 2వేల పోస్ట్ లను సరెండర్ చేశారు. దాదాపు అన్ని డివిజన్లదీ ఇదే పరిస్థితి. రైల్వే డివిజన్ పరిధిలో పారిశుధ్య పనులు, క్వార్టర్ల నిర్వహణ, పార్శిల్ కార్యాలయాల నిర్వహణ, గూడ్స్ షెడ్ల నిర్వహణ వంటి పనుల్ని క్రమంగా ప్రైవేటు అప్పగిస్తున్నారు. దీంతో ఆయా విభాగాల్లో రైల్వే బోర్డ్ నియామకాలు పూర్తిగా ఆగిపోయాయి. రైళ్లు నడపడం, రైల్వే ట్రాక్, కంట్రోల్ ఆఫీస్ నిర్వహణ, రైల్వే భద్రతతో ముడిపడిన విభాగాలను మాత్రమే పటిష్టపరుస్తున్నారు. భద్రతతో సంబంధం లేని విభాగాలను క్రమంగా తొలగించాలని రైల్వే బోర్డ్ ఆలోచిస్తోంది.

First Published:  25 July 2022 2:49 AM GMT
Next Story