Telugu Global
National

రాహుల్ టీ షర్ట్ వర్సెస్ మోదీ సూట్..

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ధరించిన టీ షర్ట్ ఖరీదు 41వేల రూపాయలంటూ బీజేపీ కామెంట్ చేసింది. దీనికి ప్రతిగా మోదీ సూటు 10 లక్షల రూపాయలంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది.

రాహుల్ టీ షర్ట్ వర్సెస్ మోదీ సూట్..
X

కోడిగుడ్డుపై ఈకలు పీకడం బీజేపీకి బాగా తెలుసు. అందుకే భారత్ జోడో యాత్ర గురించి ఏం మాట్లాడాలో తెలియక, రాహుల్ గాంధీ వేసుకున్న టీ షర్ట్ పై ఫోకస్ పెట్టింది. రాహుల్ వేసుకున్న తెలుపు రంగు టీ షర్ట్ ధర 41వేల రూపాయలంటూ బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతా సెటైర్లు వేసింది. బర్బెరీ కంపెనీకి చెందిన ఆ టీ షర్ట్ కాస్ట్ లీ ది అని, పాదయాత్రలో అంత కాస్ట్ లీ టీ షర్ట్ ఎందుకు అనే విధంగా పాయింట్ తీసింది. అయితే అంతలోనే బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చింది కాంగ్రెస్. డ్రస్సుల గురించి మాట్లాడుకోవాలంటే మోదీ వేసిన సూట్ గురించి చర్చిద్దామా అంటూ కౌంటర్ ఇచ్చింది.

భారత్ జోడో యాత్రలో భారత్ దేఖో అంటూ బీజేపీ ట్వీట్ పెట్టింది. రాహుల్ కాస్ట్ లీ టీ షర్ట్ వేసుకున్నారంటూ ఆయన్ను టార్గెట్ చేయాలని చూసింది. కానీ బీజేపీ గురివింద నాయకులు తమ వెనకాల ఉన్న నలుపు మర్చిపోయినట్టున్నారు. ప్రధాని మోదీ వేసుకునే ఒక్కో సూటు ఖరీదు 10 లక్షల రూపాయలకు తగ్గదు. అందులోనూ ఆయన విదేశాలకు వెళ్తే ఆ సోకు మామూలుగా ఉండదు. ఈ విషయాలన్నీ కాంగ్రెస్ ఇప్పుడు బయటకు తీసింది.

భారత్ జోడో యాత్రకు వస్తున్న ప్రజా స్పందనను చూసి బీజేపీ నేతలు భయపడుతున్నారా? అని కాంగ్రెస్ ప్రశ్నించింది. 'డ్రెస్సుల గురించి కాదు, దేశంలోని సమస్యల గురించి మాట్లాడండి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడండి. బట్టల గురించే మాట్లాడుకోవాల్సి వస్తే ప్రధాని మోదీ వేసిన సూట్ గురించి మాట్లాడాలి. మోదీ ధరించిన రూ.10 లక్షల సూటు, రూ.1.5 లక్షల కళ్లజోడు గురించి కూడా మాట్లాడుకుందామా' అంటూ కౌంటర్ అటాక్ ఇచ్చింది. దీంతో ఈ టీషర్ట్ వ్యవహారం కాస్తా తిరిగి బీజేపీ మెడకే చుట్టుకుంది.

భారత్ జోడో యాత్రను లైట్ తీసుకోవాలని బీజేపీ భావించింది. కానీ దాన్ని పట్టించుకోకపోతే అసలుకే ఎసరొచ్చే ప్రమాదముందని గ్రహించింది. విపక్షాలన్నీ రాహుల్ కి మద్దతుగా కదిలితే 2024లో బీజేపీ ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశముంది. అందుకే రాహుల్ యాత్రను టార్గెట్ చేశారు. ఏ పాయింట్ లేవనెత్తాలో తెలియక, ఇలా టీ షర్ట్ ని తెరపైకి తెచ్చారు. మోదీ సూటు రేటుని కాంగ్రెస్ లేవనెత్తే సరికి అడ్డంగా బుక్కయ్యారు.

First Published:  10 Sep 2022 2:51 AM GMT
Next Story