Telugu Global
National

రాహుల్ గాంధీపై అనర్హత వేటు: ఈ సువర్ణవకాశాన్ని విపక్షాలు ఉపయోగించుకుంటాయా ?

నిజం చెప్పాలంటే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం నరేంద్ర మోడీకి అననుకూలమైతే, విపక్షాలకు ఒక సువర్ణావకాశం. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ తో సహా విపక్షాలన్నీ వినియోగించుకుంటాయా లేదా అనేది భవిష్యత్తు తేలుస్తుంది.

రాహుల్ గాంధీపై అనర్హత వేటు: ఈ సువర్ణవకాశాన్ని విపక్షాలు ఉపయోగించుకుంటాయా ?
X

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో దోషిగా తేలడం, ఆయనపై సత్వరమే అనర్హత వేటు వేయడం భారత రాజకీయాల్లో ఒక ముఖ్యమైన ఘట్టం.

దీనిపై మూడంచెల పోరాటం చేస్తానని కాంగ్రెస్ ప్రకటించింది. న్యాయపోరాటం, రోడ్ల మీద ఆందోళనలు, విపక్షాలతో కలిసి ఉమ్మడి ఉద్యమాలు...ఈ మూడు పద్దతులు అనుసరించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

నిజం చెప్పాలంటే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం నరేంద్ర మోడీకి అననుకూలమైతే, విపక్షాలకు ఒక సువర్ణావకాశం. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ తో సహా విపక్షాలన్నీ వినియోగించుకుంటాయా లేదా అనేది భవిష్యత్తు తేలుస్తుంది.

అయితే ఈ సమయంలో ఒక గుర్తించతగ్గ కీలక‌ పరిణామం ఏంటంటే, కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్న పక్షాలన్నీ రాహుల్ గాంధీకి మద్దతు తెలిపాయి. బీజేపీ తీరును ఎండగట్టాయి.

ఢిల్లీ ముఖ్యమంత్రి , ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ దీనిని 'ఒక పార్టీ, ఒకే నాయకుడి నియంతృత్వం' అని అభివర్ణించారు."మోడీ ప్రభుత్వం బ్రిటిష్ పాలన కంటే ప్రమాదకరమైనది. ఇది కాంగ్రెస్ పోరాటం మాత్రమే కాదు. ఇది దేశాన్ని రక్షించడానికి పోరాటం." అనిఅన్నారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ , "ప్రధానమంత్రి మోడీ నవభారతంలో, ప్రతిపక్ష నాయకులు బిజెపికి ప్రధాన లక్ష్యంగా మారారు! నేర చరిత్ర కలిగిన బిజెపి నాయకులు మంత్రివర్గంలో ఉంటారు. విమర్శలు చేసిన ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు పడుతుంది." అన్నారు.

భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సిఎం కేసీఆర్ "భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చీకటి రోజు" అని అభివర్ణించారు. ప్రతిపక్ష పార్టీలు తమ విభేదాలను విడనాడి "రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కలిసి రావాలని" కోరారు.

ప్రతిపక్ష నేతలను వేధించడం బిజెపికి ఒక విధానంగా మారిపోయిందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.

మిగతా చాలా రాజకీయ పార్టీలు రాహుల్ గాంధీపై అనర్హత వేటును ఖండించాయి. అయితే కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్న వారు, తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో పోరాడుతున్న కేసీఆర్, మమత, కేజ్రీవాల్ ల ప్రకటనలు ముఖ్యమైనవి.

ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటున్న నేతల విధానం మారుతుందా ? అసలు కాంగ్రెస్ తన పద్దతులను మార్చుకుంటుందా ? ఒకవైపు విపక్షాలన్నీ తమ నాయకత్వంలో ఏకం కావాలని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలకు బీజేపీ వల్ల కష్టాలు ఎదురైనప్పుడు వారికి మద్దతు తెలపకపోగా బీజేపీతో గొంతుకలిపిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

ఉదాహరణకు, మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా అరెస్టును ఢిల్లీ కాంగ్రెస్ స్వాగతించింది. తెలంగాణ కాంగ్రెస్ BRS నేత కవితను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి తృణమూల్ కాంగ్రెస్‌తో కూడా ఘర్షణాత్మక‌ సంబంధాలే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విపక్షాలు కాంగ్రెస్ ను నమ్ముతాయా? రాహుల్ గా‍ంధీ వ్యవహారం అందుకేమైనా అవకాశాన్ని కలిగిస్తుందా ?

ఏది ఏమైనప్పటికీ, రాహుల్ పై అనర్హత వేటు విషయంలో ప్రతిపక్షాల ఖండనల వెల్లువ ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక వేదిక మీదికి రావడానికి అవకాశం కల్పిస్తున్నది.

ఇప్పుడు ప్రధాని ఎవరన్నది కాకుండా దేశ ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు వస్తోందన్న భావన ప్రతిక్షాల్లో పెరుగుతోంది.

రాహుల్ గాంధీ, ఆజం ఖాన్, మనీష్ సిసోడియా, కవితలను చాలా మంది ప్రతిపక్ష నేతలు రాజకీయ ప్రత్యర్థులుగా కాకుండా కేంద్రం బాధితులుగా చూస్తున్నారు.

అయితే, ఎన్నికల్లో ఆప్, టిఎంసి, బిఆర్‌ఎస్, ఎస్‌పి వంటి పార్టీలతో కాంగ్రెస్ ప్రత్యక్ష పోటీలో ఉన్నందున వారిని కాంగ్రెస్ తమవారిగా పరిగణిస్తుందా ? వారికి సహకరిస్తుందా ? ఆయా పార్టీలు కూడా రాహుల్ అనర్హత వేటు ఒక్క విషయంపైనే ఖండనలకు పరిమితమవుతారా ? లేక బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ తో చేతులు కలుపుతారా ? ఇవన్నీ కూడా ఇప్పటి వరకు సమాధానాలు లేని ప్రశ్నలే. విపక్షాలన్నీ ఈ ప్రశ్నలకు వీలైనంత‌ త్వరగా సమాధానాలు వెతుక్కోకపోతే మళ్ళీ బీజేపీ చేతిలో అధికారాన్ని పళ్ళెంలో పెట్టి అందించినవారవుతారు.

First Published:  26 March 2023 4:06 AM GMT
Next Story