Telugu Global
National

రాష్ట్రాలపై దాడిని మేం ఒప్పుకోం..

వన్ నేషన్ -వన్ ఎలక్షన్ పేరుతో రాష్ట్రాలపై బీజేపీ దాడి చేయాలని చూస్తోందని మండిపడ్డారు రాహుల్. ట్విట్టర్లో తన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రాలపై దాడిని మేం ఒప్పుకోం..
X

జమిలి ఎన్నికలు భారత్ లోని రాష్ట్రాలపై జరుగుతున్న దాడి అని అభివర్ణించారు రాహుల్ గాంధీ. ఆ దాడిని తాము ఒప్పుకునే ప్రసక్తే లేదని తెల్చి చెప్పారు. వన్ నేషన్ -వన్ ఎలక్షన్ పేరుతో రాష్ట్రాలపై బీజేపీ దాడి చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఈమేరకు ట్విట్టర్లో తన ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్.


ఇండియా కూటమి భేటీ రోజే జమిలి ఎన్నికలపై పలు అనుమానాలు వ్యక్తం చేశాయి ప్రతిపక్ష పార్టీలు. కాంగ్రెస్ కూడా ఈ వ్యూహంపై పలు అనుమానాలు లేవనెత్తింది. చివరకు జమిలి ఎన్నికల నిర్వహణకోసం ఉన్నత స్థాయి కమిటీ వేయడం, అందులో కాంగ్రెస్ కి కూడా చోటిస్తూ బీజేపీ సరికొత్త డ్రామాకి తెరతీయడంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. కమిటీలో చోటిచ్చినా కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి తిరస్కరించారు. తాజాగా రాహుల్ గాంధీ జమిలిపై ఘాటు ట్వీట్ వేశారు. అది రాష్ట్రాలపై దాడిగా పేర్కొన్నారు.

కమిటీతో సరికొత్త నాటకం..

పార్లమెంట్ తో సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విషయంలో ఇప్పటికే కేంద్రం ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతా అయిపోయాక పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలంటూ ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. ఆ తర్వాత కమిటీ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టింది. ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఇప్పుడిలా ప్రజల్ని, ప్రతిపక్ష పార్టీల్ని కమిటీ పేరుతో మోసం చేయాలని చూడటం సరికాదంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఆ కమిటీ రిపోర్ట్ కచ్చితంగా జమిలికి మద్దతుగానే ఉంటుందని ఆరోపిస్తున్నారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది, వచ్చే ఏడాది లోక్ సభతోపాటు మరికొన్ని రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరుగుతాయి. బీజేపీకి ఎదురుగాలి ఖాయమనుకుంటున్న ఈ దశలో జమిలి పేరుతో కొత్త ఫార్ములాని తెరపైకి తెచ్చింది కేంద్రం. ఓటమి భయంతోనే మోదీ టీమ్ జమిలి నాటకం ఆడుతోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

First Published:  3 Sep 2023 10:27 AM GMT
Next Story