Telugu Global
National

బీజేపీ కంట్రోల్‌లో మీడియా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు

రాహుల్ యాత్రను లైట్‌గా తీసుకుంటున్నామని బీజేపీ నేతలు బయటకు చెబుతున్నప్పటికీ .. వారి చర్యలను బట్టి సీరియస్‌గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే రాహుల్‌పై సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు

బీజేపీ కంట్రోల్‌లో మీడియా..  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్ర అంటూ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన యాత్ర మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో సాగుతోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. దేశంలోని ప్రతి ఊర్లో ఆ పార్టీకి కార్యకర్తలు, అభిమానులు ఉంటారు. ఈ అంశం రాహుల్‌కు బాగా కలిసి వస్తోంది. దీంతో ఆయన పాదయాత్రకు జనం బాగానే తరలివస్తున్నారు.

మరోవైపు రాహుల్ కూడా గతంలో మాదిరి కాకుండా కాస్త దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఎక్కడికక్కడ ప్రజల కష్టాలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో రాహుల్ గాంధీ యాత్ర.. ప్రజల్లోకి వెళితే కాస్త ప్రమాదమని బీజేపీ భావించినట్టుంది. అందుకే ఆయనను టార్గెట్ చేసింది. ఇటీవల నిత్యం బీజేపీ ఐటీ వింగ్‌లో రాహుల్‌కు వ్యతిరేకంగా పోస్టులు దర్శనమిస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ రాహుల్ గాంధీ యాత్రకు పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదు.

కాగా ఈ విషయాలపై ఇవాళ రాహుల్ మీడియాతో మాట్లాడారు. 'మీడియా సంస్థలను బీజేపీ ప్రభుత్వం నియంత్రిస్తోంది. ప్రజా సమస్యలు వెలుగులోకి రాకుండా అడ్డుకుంటోంది. నేను దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించాను. ఈ యాత్ర ఉద్దేశం కేవలం రాజకీయం మాత్రమే కాదు.. ప్రజలు కష్టాలు, వారి సమస్యలు తెలుసుకొనేందుకే నేను యాత్ర చేస్తున్నాను. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదు. వారి సమస్యలు వెలుగులోకి కూడా రానివ్వడం లేదు. ఇది చాలా అన్యాయం' అంటూ రాహుల్ పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో అమేథి నుంచి పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు ఆ విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని దాట వేశారు. రాజస్థాన్‌లో అక్కడి సీఎం అశోక్ గెహ్లాట్, మరో నేత సచిన్ ఫైలెట్ గొడవలపై మాట్లాడుతూ.. వారిద్దరూ తమ పార్టీకి ముఖ్యమేనని వ్యాఖ్యానించారు. వారి మధ్య తలెత్తిన గొడవ తన యాత్రకు ఎటువంటి ఇబ్బంది కలగనివ్వదని కూడా ఆయన పేర్కొన్నారు.

మొత్తానికి రాహుల్ యాత్రను లైట్‌గా తీసుకుంటున్నామని బీజేపీ నేతలు బయటకు చెబుతున్నప్పటికీ .. వారి చర్యలను బట్టి సీరియస్‌గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే రాహుల్‌పై సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. మరి రాహుల్ యాత్ర ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.

First Published:  28 Nov 2022 1:22 PM GMT
Next Story