Telugu Global
National

దేశాన్ని విద్వేషాల‌కు బ‌లి కానివ్వ‌బోను. .: రాహుల్ గాంధీ

శ్రీ పెరంబుదూర్ లో తన తండ్రి రాజీవ్ గాంధీ స్మారక స్థ‌లిని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సందర్శించారు. విద్వేషం, విభ‌జ‌న రాజ‌కీయాల‌కు త‌న తండ్రిని పోగొట్టుకున్నాన‌ని, కానీ దేశాన్ని వాటికి బ‌లికానివ్వ‌బోన‌ని ఈ సందర్భంగా రాహుల్ పేర్కొన్నారు.

దేశాన్ని విద్వేషాల‌కు బ‌లి కానివ్వ‌బోను. .: రాహుల్ గాంధీ
X

భార‌త దేశాన్ని విద్వేషాల‌కు, విభ‌జ‌న రాజ‌కీయాల‌కు బ‌లి కానివ్వ‌బోన‌ని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. విద్వేషాల వ‌ల్ల వినాశ‌నం త‌ప్ప లాభ‌మేమీ ఉండ‌ద‌ని, ప్రేమ‌, సామ‌ర‌స్యాలే ద్వేష భావ‌న‌ల‌పై విజ‌యం సాధిస్తాయ‌ని ఆయ‌న అన్నారు. విద్వేషం, విభ‌జ‌న రాజ‌కీయాల‌కు త‌న తండ్రిని పోగొట్టుకున్నాన‌ని, కానీ దేశాన్ని వాటికి బ‌లికానివ్వ‌బోన‌ని పేర్కొన్నారు. బుధ‌వారంనాడు ఆయ‌న త‌మిళ‌నాడులోని శ్రీ పెరంబుదూర్ లో త‌న తండ్రి రాజీవ్ గాంధీ స్మార‌క స్థ‌లిని సంద‌ర్శించి నివాళులు అర్పించారు. అనంత‌రం ఆయ‌న ట్వీట్ చేస్తూ.. "ప్రేమ ద్వేషాన్ని జయిస్తుంది. ఆశ భయాన్ని ఓడిస్తుంది.. మ‌నం అంద‌రం గెలుస్తాం." అని పేర్కొన్నారు.

బిజెపి పాలనలో భారతదేశంలో సామాజిక పోల‌రైజేష‌న్, రాజకీయ కేంద్రీకరణ జ‌రుగుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు. దేశాన్ని ఏకం చేయడానికి 'భారత్ జోడో యాత్ర' తనకు 'తపస్సు' లాంటిదని గాంధీ అన్నారు.

ఈ సాయంత్రం క‌న్యాకుమారిలో మహాత్మాగాంధీ మండపంలో జరిగే కార్యక్రమంలో ఆయ‌న పాల్గొంటారు. అక్కడ యాత్ర ప్రారంభానికి ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ జాతీయ జెండాను రాహుల్ గాంధీకి అందజేయనున్నారు.

3,500 కిలోమీటర్ల సుదీర్ఘ యాత్ర, గత శతాబ్ద కాలంలో దేశంలో నిర్వహిస్తున్న అతి పెద్ద (లాంగ్ మార్చ్‌) పాద‌యాత్ర‌గా కాంగ్రెస్ అభివర్ణించింది. రేపు ఉద‌యం క‌న్యాకుమారిలో పాద‌యాత్ర మొద‌ల‌వుతుంది.

రాహుల్ గాంధీ నేతృత్వంలో, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు రాబోయే 150 రోజులలో 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ ప్రతిరోజూ ఆరు-ఏడు గంటలపాటు నడవనున్నారు. రాహుల్ గాంధీకి సంఘీభావంగా అన్ని రాష్ట్ర యూనిట్ల అధ్యక్షులు తమ తమ రాష్ట్రాల్లో 'భారత్ జోడో యాత్ర'ను నిర్వహిస్తారు.

ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిరుద్యోగంతో సహా వివిధ సమస్యలపై సామాన్య ప్రజలతో మమేకమయ్యేందుకు చేప‌ట్టిన ఈ యాత్ర పార్టీ అతిపెద్ద 'జన సంపర్క కార్యక్రమం' అని కాంగ్రెస్ చెబుతోంది. పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ ఈ యాత్ర భారత రాజకీయాలకు ఒక పరివర్తన స‌మ‌య‌మ‌ని, పార్టీ పునరుజ్జీవనానికి ఇది నిర్ణయాత్మక ఘట్టమని అన్నారు. గాంధీతో పాటు మొత్తం 118 మంది రాహుల్ పాద యాత్ర మొత్తం నడుస్తారు. యాత్రలో పాల్గొనేందుకు దాదాపు 50,000 మంది త‌మ పేర్ల‌ను నమోదు చేసుకున్నారు.

శ్రీపెరంబుదూర్ ప్రాముఖ్యత..

రాహుల్ గాంధీ తండ్రి, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ 1991 మే 21న తమిళనాడులో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు హత్యకు గురయ్యారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టిటిఇ) కార్యకర్త జరిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ చుట్టూ ఉన్న 14 మంది కూడా మరణించారు.

జీకే మూపనార్‌తో కలిసి రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విశాఖపట్నంలో ప్రచారం నిర్వహించిన ఆయన తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ చేరుకున్నారు. ఓటర్లతో మమేకమయ్యేందుకు తెల్లటి అంబాసిడర్ కార్ల కాన్వాయ్ ని చాలా చోట్ల ఆపుతూ రాజీవ్ ముందుకు సాగారు. ఆయన స‌భా వేదిక వద్దకు చేరుకుంటున్న స‌మ‌యంలో ఆత్మాహుతి ద‌ళ స‌భ్యురాలు ఆయ‌న పాదాలకు నమస్కరించి ఆర్డీఎక్స్ బెల్టు బాంబును ను పేల్చింది. గాంధీ అక్కడికక్కడే మృతి చెందాడు. 43 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆత్మాహుతి దాడిలో స్థానిక కెమెరాపర్సన్ చనిపోయాడు, అయితే అతని కెమెరాలో ఈ హత్యోదంతం మొత్తం రికార్డు అయింది.

ఇలా విద్వేషాల‌కు త‌న తండ్రి బ‌లైపోయాడ‌ని రాహుల్ గాంధీ గుర్తుకు తెచ్చుకుంటూ త‌న‌ప్రియ‌మైన భార‌త దేశాన్ని అటువంటి కుట్ర‌ల‌కు బ‌లికానివ్వ‌న‌ని చెప్పారు.

First Published:  7 Sep 2022 5:57 AM GMT
Next Story