Telugu Global
National

జోడో నిరూపించిన నిజం: విపక్షాల ఐక్యత, రాహుల్ సమర్థత

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే విపక్ష కూటమిలో కాంగ్రెస్ కూడా కచ్చితంగా ఉండాలనే విషయం జోడో యాత్రతో స్పష్టమైంది. విపక్షాలన్నీ కాకపోయినా, కాంగ్రెస్ తో కలసి నడిచేందుకు వచ్చినవారంతా ఆ పార్టీ సారథ్యంలోనే బీజేపీతో యుద్ధం చేస్తామన్నారు.

జోడో నిరూపించిన నిజం: విపక్షాల ఐక్యత, రాహుల్ సమర్థత
X

చాక్లెట్ బాయ్, అమూల్ బేబీ అంటూ రాహుల్ గాంధీని గతంలో ఓ ఆట ఆడేసుకునేవి విపక్షాలు. కాంగ్రెస్ పార్టీని నడిపించే సమర్థత రాహుల్ కి లేదని, పార్టీ పగ్గాలు ప్రియాంకకు అప్పగించాలనే డిమాండ్ కూడా బాగానే వినిపించేది. కానీ భారత్ జోడో యాత్ర సరికొత్త రాహుల్ గాంధీని పరిచయం చేసింది. ఆయన ఆహార్యంలోనే కాదు, వ్యవహారంలో కూడా బాగా మార్పు వచ్చింది. ఆ మార్పుకి వేదికగా మారింది జోడో యాత్ర, దేశం మొత్తం ఆ మార్పు చూసేలా చేసింది.

మందీ మార్బలం వేసుకుని, రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయకుల్ని వెంటేసుకుని, చుట్టూ కార్యకర్తలచో చప్పట్లు కొట్టించుకుంటూ, మెడలో దండలు, గజమాలలతో స్వాగతాలు, చేరికలు, తప్పెట్లు, బాణసంచా.. ఇలాంటివేవీ రాహుల్ జోడో యాత్రలో కనిపించలేదు. ఇదే ఆయన్ను సగటు ప్రజలకు దగ్గర చేసింది. ముఖ్యంగా యువతతో ఆయన మమేకం అవుతూ కలసి నడిచారు. రాజకీయంగా తటస్థంగా ఉండే సంస్థలు, సంఘాలన్నీ రాహుల్ యాత్రకు మద్దతు తెలిపాయి.

జోడోయాత్ర మొదలైన సమయంలోనే ఆయన ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు వద్దన్నారు. ఖర్గేకి ఆ స్థానం ఇచ్చి అందరం కలసి నడుద్దామన్నారు. రాహుల్ నిర్ణయానికి పార్టీలో మంచి స్పందన వచ్చింది. కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యాన్ని మరోసారి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బయటపెట్టింది. ఈ విషయంలో రాహుల్ గాంధీ సొంత పార్టీ నేతల మనసు గెలుచుకున్నారు.

ఇక విపక్షాల విషయానికొద్దాం. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ అవసరం లేదని ఇటీవల చాలామంది భావించారు. మమతా బెనర్జీ, అరవింది కేజ్రీవాల్ వంటి నాయకులు కాంగ్రెసేతర కూటమికోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే విపక్ష కూటమిలో కాంగ్రెస్ కూడా కచ్చితంగా ఉండాలనే విషయం జోడో యాత్రతో స్పష్టమైంది. విపక్షాలన్నీ కాకపోయినా, కాంగ్రెస్ తో కలసి నడిచేందుకు వచ్చినవారంతా ఆ పార్టీ సారథ్యంలోనే బీజేపీతో యుద్ధం చేస్తామన్నారు. మిగతావారు నడవాల్సిన దారి చూపించారు. కాశ్మీర్ లో కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు లేకుండా కాలినడకనే యాత్ర కొనసాగించారు రాహుల్ గాంధీ. గట్టకట్టే చలిలోనూ కేవలం టీషర్ట్ మాత్రమే ధరించి ముందుకు నడిచారు. ఆయన పట్టుదల, దీక్షా దక్షత అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశాయి.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కూడా సరికొత్త రాహుల్ గాంధీ అందరికీ కనిపించారు. అదానీ వ్యవహారంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని నిలదీశాయి. ప్రతిపక్షాల ఐక్యత చూసి మోదీ కూడా షాకయ్యారు. ఇలాంటి వ్యవహారాలకోసమే వీరంతా ఏకమవుతారంటూ సెటైర్లు వేశారు. కానీ విపక్ష ఐక్యత, దానికి కాంగ్రెస్ నాయకత్వం.. బీజేపీకి మింగుడు పడటం లేదు. ఎక్కడికక్కడ విపక్షాల ఐక్యతను దెబ్బతీసేలా ప్రయత్నిస్తున్న బీజేపీకి జోడో యాత్ర తర్వాత భయం మొదలైనట్టు స్పష్టమవుతోంది.

First Published:  14 Feb 2023 5:15 AM GMT
Next Story