Telugu Global
National

రాహుల్ తో ఇల్లు ఖాళీ చేయించారు.. బీజేపీ రాష్ట్రాన్నే ఖాళీ చేసింది

రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగానే రాహుల్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చిందనే విషయం అందరికీ అర్థమైంది. కర్నాటకలో బీజేపీ పరాభవానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటేనని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.

రాహుల్ తో ఇల్లు ఖాళీ చేయించారు.. బీజేపీ రాష్ట్రాన్నే ఖాళీ చేసింది
X

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి శిక్ష పడటం, ఆ తర్వాత ఆయన లోక్ సభ సభ్యత్వం రద్దు కావడం, ఎంపీ కోటాలో సంక్రమించిన క్వార్టర్స్ ని ఆయన కోల్పోవడం తెలిసిందే. రాహుల్ గాంధీ శిక్ష విషయంలో పైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నా కూడా ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసి, ఇంటిని కూడా ఖాళీ చేయించడం దుర్మార్గం అని అప్పట్లో కాంగ్రెస్ మొత్తుకుంది. ప్రతిపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్ కి మద్దతుగా నిలిచాయి. అప్పటి బీజేపీ చర్యకు ఇప్పుడు కర్నాటక ఓటర్లు బదులు తీర్చుకున్నారంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.

రాహుల్ తో బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించారు, ఇప్పుడు ఏకంగా బీజేపీని కర్నాటక రాష్ట్రం నుంచే తరిమేశారంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు కాంగ్రెస్ అభిమానులు. ఆమధ్య కాంగ్రెస్ లో చేరి హడావిడి చేసిన తెలుగు సినిమా నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూడా ఇదే రకమైన పోస్టింగ్ లు పెట్టారు. రాహుల్ తో ఇల్లు ఖాళీ చేయించిన బీజేపీ, ఇప్పుడు రాష్ట్రం నుంచే ఖాళీ అయిపోయిందని ఎద్దేవా చేశారు బండ్ల గణేష్.


సింపతీ వర్కవుట్ అయిందా..?

వాస్తవానికి రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని అంత హడావిడిగా రద్దు చేయాల్సిన పని లేదు. ఆయనకు కేటాయించిన ఇంటిని కూడా ఖాళీ చేయాలని ఒత్తిడి చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ లోక్ సభలో అదానీ వ్యవహారంలో బీజేపీని ఇరుకున పెడుతున్నారనే కారణంతో రాహుల్ ని కట్టడి చేసేందుకే ఆ పని చేశారనేది కాంగ్రెస్ ఆరోపణ. ఆ తర్వాత రాహుల్ పై సహజంగానే ప్రజల్లో సింపతీ పెరిగింది. రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగానే రాహుల్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చిందనే విషయం అందరికీ అర్థమైంది. కర్నాటకలో బీజేపీ పరాభవానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటేనని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.

First Published:  15 May 2023 11:15 AM GMT
Next Story