Telugu Global
National

సావర్కర్‌పై తన వ్యాఖ్యలను సమర్థించుకున్న రాహుల్

రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. సావర్కర్ మీద చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. గతంలో సావర్కర్ బ్రిటిష్ వాళ్లకు రాసిన లేఖలను సైతం ఆయన మీడియాకు విడుదల చేశారు.

సావర్కర్‌పై తన వ్యాఖ్యలను సమర్థించుకున్న రాహుల్
X

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. వాసిం జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వీర్ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వీర్ సావర్కర్ గతంలో అండమాన్ జైలులో ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్లను క్షమాభిక్ష కోరారని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఈ వ్యాఖ్యలు బీజేపీ నేతలకు, బీజేపీతో అంటకాగుతున్న షిండే వర్గం శివసేన నేతలకు కోపం తెప్పించాయి. రాహుల్ వ్యాఖ్యలపై సీఎం ఏక్ నాథ్ షిండే తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

మహారాష్ట్రకు చెందిన గొప్ప స్వాతంత్య్ర‌ సమరయోధుడు వీర్ సావర్కర్‌ను రాహుల్ విమర్శిస్తుంటే .. పార్టీ నేతలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సావర్కర్‌ను అవమానిస్తే రాష్ట్ర ప్రజలు సహించరని ఆయన అన్నారు. మరోవైపు ఈ వ్యాఖ్యలను మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే కూడా ఖండించారు. తమకు వీర్ సావర్కర్ అంటే ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు. గతంలో జమ్మూ కశ్మీర్‌లో బీజేపీ.. పీడీపీతో పొత్తు పెట్టుకోవడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు.

కాగా ఇవాళ రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. సావర్కర్ మీద చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. గతంలో సావర్కర్ బ్రిటిష్ వాళ్లకు రాసిన లేఖలను సైతం ఆయన మీడియాకు విడుదల చేశారు. మహాత్మా గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి వారు కూడా జైళ్ల‌లో ఏళ్ల తరబడి శిక్ష అనుభవించారని.. వారు ఎప్పుడు ఇటువంటి లేఖలు రాయలేదన్నారు. దమ్ముంటే తన జోడో యాత్రను ఆపాలంటూ రాహుల్ సవాల్ విసిరారు. మొత్తంగా మహారాష్ట్రలో బీజేపీ, శివసేన, (ఉద్దవ్ వర్గం, షిండే వర్గం) మధ్య పొలిటికల్ వార్ సాగుతోంది.

First Published:  17 Nov 2022 11:51 AM GMT
Next Story