Telugu Global
National

సార్వత్రిక సమరానికి రాహుల్ రెడీ.. త్వరలో 'భారత్‌ న్యాయ యాత్ర'

ఈసారి యాత్ర తూర్పు నుంచి పడమరకు ఉంటుంది. తూర్పున మణిపూర్ నుంచి పడమర ముంబై వరకు 'భారత్‌ న్యాయ యాత్ర' చేపట్టబోతున్నారు రాహుల్ గాంధీ.

సార్వత్రిక సమరానికి రాహుల్ రెడీ.. త్వరలో భారత్‌ న్యాయ యాత్ర
X

'భారత్ జోడో యాత్ర'కు కొనసాగింపుగా 'భారత్‌ న్యాయ యాత్ర' మొదలు పెట్టబోతున్నారు రాహుల్ గాంధీ. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. 2024 జనవరి 14 నుంచి మార్చి 20వకు ఈ యాత్ర జరుగుతుంది. మణిపూర్‌ నుంచి ముంబై వరకు మొత్తం 6,200 కి.మీ మేర రాహుల్ యాత్ర చేస్తారు. మహిళలు, యువత, బలహీనవర్గాల ప్రజలతో ఆయన మాట్లాడుతూ ముందుకు కదులుతారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. అయితే ఈసారి చేపట్టేది పూర్తి పాదయాత్ర కాదు. బస్సులో రాహుల్ యాత్రకు వస్తారు. అక్కడక్కడా స్థానికులతో కలసి కొంతదూరం ఆయన పాదయాత్ర చేస్తారు. మొత్తంగా ఇది బస్సుయాత్ర అని స్పష్టం చేశారు కాంగ్రెస్ నేతలు.

దేశాన్ని ఏకం చేసేందుకంటూ.. ఆమధ్య భారత్ జోడో యాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దక్షిణం నుంచి ఉత్తరానికి నడిచారు రాహుల్. ఈసారి యాత్ర తూర్పు నుంచి పడమరకు ఉంటుంది. తూర్పున మణిపూర్ నుంచి పడమర ముంబై వరకు 'భారత్‌ న్యాయ యాత్ర' చేపట్టబోతున్నారు రాహుల్ గాంధీ. మణిపూర్ లో మొదలు పెట్టి నాగాలాండ్‌, అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌ ఘఢ్‌, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, గుజరాత్‌ మీదుగా యాత్ర మహారాష్ట్రకు చేరుతుంది. ఈసారి మొత్తం 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో రాహుల్‌ యాత్ర జరుగుతుంది.

సార్వత్రిక సమరానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఎదురుదెబ్బలు తగిలాయి. తెలంగాణలో అధికారం చేపట్టినా కాంగ్రెస్ పార్టీ పూర్తి సంతృప్తిగా లేదు. బీజేపీని దెప్పకొట్టాలంటే మరింత బలం పుంజుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మిత్రపక్షాలను కూడా కలుపుకొని వెళ్లాలి. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల వేళ రాహుల్ వ్యూహాత్మకంగా ఈ యాత్ర మొదలు పెడుతున్నారు.

First Published:  27 Dec 2023 6:57 AM GMT
Next Story