Telugu Global
National

దేవుణ్ణి మొక్కుతారు..ప్ర‌జ‌ల‌ను తొక్కుతున్నారు. బిజెపి పై రాహుల్ ధ్వ‌జం

త‌ప‌స్వుల‌ను పూజించే దేశం భార‌త దేశం. నేను కూడా గ‌త మూడు నెల‌లుగా చిన్న త‌ప‌స్సు చేస్తున్నాను. కానీ తుది శ్వాస వ‌ర‌కూ రైతులు, కార్మికులు చేసేదే నిజమైన తపస్సు. వారి ముందు నేను చేసేది చాలా స్వ‌ల్పం అని రాహుల్ గాంధీ అన్నారు.

దేవుణ్ణి మొక్కుతారు..ప్ర‌జ‌ల‌ను తొక్కుతున్నారు. బిజెపి పై రాహుల్ ధ్వ‌జం
X

"బీజేపీ ముకుళిత హస్తాలతో దేవుడిని పూజిస్తుంది, కానీ నిజమైన తపస్వులు అయిన‌ రైతులు, కార్మికులు, చిన్న, మధ్యతరహా వ్యాపారులు, విద్యావంతులైన యువకుల భవిష్యత్తును నాశనం చేస్తోంది. ఇలా అనేక వ‌ర్గాల ప్ర‌జ‌లు పైకి రాకుండా అన‌వ‌స‌ర భారాల‌తో అణ‌గ‌దొక్కుతోంది " అని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ భార‌తీయ జ‌న‌తా పార్టీ (బిజెపి) పై ధ్వ‌జ‌మెత్తారు.

"త‌ప‌స్వుల‌ను పూజించే దేశం భార‌త దేశం. నేను కూడా గ‌త మూడు నెల‌లుగా చిన్న త‌ప‌స్సు చేస్తున్నాను. కానీ తుది శ్వాస వ‌ర‌కూ రైతులు, కార్మికులు చేసేదే నిజమైన తపస్సు. వారి ముందు నేను చేసేది చాలా స్వ‌ల్పం. " అని రాహుల్ గాంధీ అన్నారు. కోవిడ్ స‌మ‌యంలో దేశం న‌లుమూల‌ల వ‌ల‌స‌ కార్మికులను చూశాం. జీవితాంతం క‌ష్ట‌ప‌డి ప‌నిచేసేవారే నిజ‌మైన త‌ప‌స్వులు. కానీ వారికి ప్ర‌భుత్వం నుంచి అంద‌వ‌ల‌సిన‌వేవీ అంద‌డంలేదు. నిర్ల‌క్ష్యానికి గుర‌వ‌తున్నారు అని రాహుల్ గాంధీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

''రైతులకు ఎరువులు అందడం లేదు , ఒకవేళ వచ్చినా అధిక ధరలకే వస్తుంది. పూర్తి ప్రీమియం చెల్లించినప్పటికీ న‌ష్ట‌పోయిన పంట‌కు బీమా కంపెనీల నుండి పరిహారం పొందడం లేదు. వారు తమ ఉత్పత్తులకు తగిన ధర పొంద‌లేక‌ నష్టానికి పంట‌ను అమ్ముకునే దుస్థితి వ‌చ్చింది, "అని విమ‌ర్శించారు.

రాహుల్ గాంధీ మ‌ధ్య ప్ర‌దేశ్ లో భార‌త్ జోడో యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయ‌న ఉజ్జ‌యిని లోని మ‌హాకాళేశ్వ‌రుణ్ణి ద‌ర్శించుకున్నారు. ధోతీ, ఎరుపు రంగు అంగవస్త్రం రుద్రాక్షలు ధరించి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం ఆయ‌న ఉజ్జయినిలో జైన మత గురువు ప్రజ్ఞా సాగర్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు.

వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2018లో ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీయే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత పార్టీ నాయ‌కుడు జ్యోతిరాదిత్య సింధియా త‌న మ‌ద్ద‌తుదారుల‌తో పార్టీని వీడి బిజెపిలో చేర‌డంతో కాంగ్రెస్ నుంచి అధికారం చేజారి బిజెపి ప్ర‌భుత్వం వ‌చ్చింది.

First Published:  30 Nov 2022 6:57 AM GMT
Next Story