Telugu Global
National

రాహుల్ గాంధీ అరెస్టు!

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ విచారిస్తున్నందుకు నిరసనగా ఇవ్వాళ్ళ కూడా కాంగ్రెస్ శ్రేణులు దేశ‌వ్యాప్తంగా నిరసనప్రదర్శనలు నిర్వహించారు. ఢిల్లీలో నిరసనలకు దిగిన ఆ పార్టీ నేత రాహుల్ గాంధీతో సహా అనేక మంది ఎంపీలను పోలీసులు అరెస్టు చేశారు.

రాహుల్ గాంధీ అరెస్టు!
X

"భార‌త్ పోలీసు రాజ్యంగా మారిపోయింది. అరెస్టుల‌తో మా నోళ్ళు నొక్క‌లేరు. స‌త్య‌మే నిరంకుశ‌త్వానికి ముగింపు ప‌లుకుతుంద‌ని"కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ మోడీ ప్ర‌భుత్వంపై నిప్పులు క‌క్కారు. ఆయ‌న్ను మంగ‌ళ‌వారంనాడుఅరెస్టు చేసి తీసుకెళుతున్న సంద‌ర్భంలో ఆయ‌న మీడియాతో ఆ మాట‌లు అంటున్న‌ప్పుడే పోలీసులు ఆయ‌న్ను తోసుకుంటూ తీసుకెళ్ళిపోయారు.

ఎఐసిసి తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీ మంగ‌ళ‌వారంనాడు రెండోసారి ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్ట‌రేట్ (ఈడి) అధికారుల విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈడి చ‌ర్య‌ల‌ను నిర‌సిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళ‌న‌లు,నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు నాయ‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ నిర‌స‌న‌కు దిగారు. ప‌లువురు నాయ‌కుల‌తో పాటు పార్ల‌మెంటు స‌భ్యులు కూడా ఆందోళ‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితుతులు నెల‌కొన్నాయి.

పార్ల‌మెంటు భ‌వ‌నం నుంచి వారు విజ‌య్ చౌక్ కు త‌ర‌లి వ‌చ్చారు. లోక్ స‌భ‌లో కాంగ్రెస్ ప‌క్ష నేత అధిర్ రంజ‌న్ చౌద‌రి, రాజ్య‌స‌భ‌లో కాంగ్రెస్ ప‌క్ష నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే తో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. అనుమ‌తి లేకుండా నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చేస్తున్నందున రాహుల్ గాంధీని పోలీసులు అరెస్టు చేశారు. రాహుల్ అరెస్టు కాకుండా పార్ల‌మెంట్ స‌భ్యులు, ఇత‌ర నాయ‌కులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్క‌డ ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. "భారతదేశం ఇప్పుడు పోలీసు రాజ్యంగా మారింది. ప్రధాని మోడీ రాజులా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇది పోలీసు రాజ్యం. ఎంపీలను రాష్ట్రపతిని క‌ల‌వ‌నివ్వ‌క‌పోతే ఏమ‌వుతుంది. మా ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తాం." అని అన్నారు. "(కాంగ్రెస్) ఎంపీలందరూ ఇక్కడికి వచ్చారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి మాట్లాడారు. మమ్మల్ని ఇక్కడ కూర్చోనివ్వడం లేదు. పార్లమెంటు లోపల చర్చలకు అనుమతించ‌డం లేదు, ఇక్కడ వారు మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు" అని రాహుల్ గాంధీ అన్నారు.

అంత‌కు ముందు పార్ల‌మెంటు నుంచి కాంగ్రెస్ నాయ‌కులు మ‌రికొంద‌రు నాయ‌కుల‌తో క‌లిసి రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వ‌ర‌కూ పాద‌యాత్ర చేసి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును క‌ల‌వాల‌ని అనుకున్నారు. అయితే వారిని పోలీసులు మార్గ‌మ‌ధ్యంలోనే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు శాఖ‌ను దుర్వినియోగం చేసి అరెస్టు చేయడం ద్వారా మీరు మమ్మల్ని అడ్డుకోలేరు మా నోళ్ళు నొక్క‌లేరు అని రాహుల్ అన్నారు.

ఈడి, సిబిఐ వంటి రాజ్యాంగ సంస్థ ల‌ను ప్ర‌ధాని మోడీ స్వార్ద రాజ‌కీయాల‌కు వాడుకుంటున్నార‌ని రాజ్య‌స‌భ‌లో కాంగ్రెస్ ప‌క్ష నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే మండిప‌డ్డారు. ఆ సంస్థ‌లు కూడా మోడీ ఆదేశాల మేర‌కే ప‌నిచేస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. ప్ర‌త్య‌ర్ధుల‌ను బెదిరించేందుకు ప్రధాని ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఖ‌ర్గే ధ్వ‌జ‌మెత్తారు. బిజెపి ఎన్ని బెదిరింపుల‌కు దిగినా తాము భ‌య‌ప‌డేది లేద‌ని అన్నారు. త‌మ‌కు త‌లొగ్గి ఉండ‌ని వారిపై అక్ర‌మంగా కేసులు బ‌నాయిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. రాజ్యాంగ‌ వ్య‌వ‌స్థ‌ల‌ను గుప్పిట్లో పెట్టుకుని ప్ర‌తిప‌క్షాల‌ను నోరెత్త‌కుండా చేయాల‌న్న కుట్ర‌ల‌ను స‌హించేదిలేద‌న్నారు. ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కు త‌మ పోరాటం కొన‌సాగిస్తామ‌ని అన్నారు. బిజెపి చేస్తున్న ఇటువంటి చ‌ర్య‌ల‌ను నిర‌సించేందుకు తాము ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తామ‌ని హెచ్చ‌రించారు.

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని ఇప్ప‌టికే ఒక రోజు విచారించిన విష‌యం విధిత‌మే అంత‌కు ముందు రాహుల్ గాంధీని కూడా ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్ట‌రేట్ విచారించింది. కానీ ఏమీ తేల్చ‌లేక‌పోయింది. త‌మ పార్టీ అగ్ర‌నేత‌ల‌ను అన్యాయంగా ఈడి విచారిస్తోంద‌ని ఇది వేధింపుల కోస‌మేనంటూ దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. కొన్ని చోట్ల ఈ కార్య‌క్ర‌మాలు హింసాయుతంగా మార‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి.

First Published:  26 July 2022 10:54 AM GMT
Next Story