Telugu Global
National

రాహుల్, ఉద్ధవ్ మధ్య.. సావర్కర్ చిచ్చు

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించబోనని అన్నారు.

రాహుల్, ఉద్ధవ్ మధ్య.. సావర్కర్ చిచ్చు
X

భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతున్న వేళ మిత్ర పక్షాల మధ్య వివాదం రేగింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్గం నేత ఉద్ధవ్ ఠాక్రే మధ్య సావర్కర్ విషయంలో భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. ఇరు నేతల మధ్య స్వాతంత్రోద్యమ సమయంలో సావర్కర్ చేసిన పని చిచ్చు పెట్టినట్లయ్యింది. మీడియా ముందు వేర్వేరు ప్రాంతాల్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. బ్రిటిష్ వాళ్ల కాళ్లు మొక్కి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్న వ్యక్తి వీడీ సావర్కర్ అని రాహుల్ గాంధీ అన్నారు.

సావర్కర్ హిందుత్వ భావజాలానికి, ఆర్ఎస్ఎస్‌కు, బీజేపీకి మాత్రమే చిహ్నమని అన్నారు. బ్రిటిషర్ల నుంచి పెన్షన్ తీసుకుంటూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సావర్కర్ పని చేశారని.. ఎన్నో మార్లు క్షమాభిక్ష అర్జీలు పెట్టుకున్న వ్యక్తి సావర్కర్ అని విమర్శించారు. పైగా ఆయన గొప్ప ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి అంటూ పుస్తకాలు రాశారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

కాగా, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించబోనని అన్నారు. మేం సావర్కర్‌ను ఎంతో గౌరవిస్తామని ఠాక్రే చెప్పారు. సావర్కర్‌ను విమర్శిస్తున్న వారితో, హిందుత్వ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న వారితో ఎందుకు పొత్తు పెట్టుకున్నావని బీజేపీ ప్రశ్నిస్తోంది. అలా అయితే జమ్ము కశ్మీర్‌లో పీడీపీతో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకున్నదో చెప్పాలని ఠాక్రే డిమాండ్ చేశారు. పీడీపీ ఎప్పుడూ భారత్ మాతాకీ జై అని చెప్పదని ఠాక్రే ఆరోపించారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే స్వేచ్ఛ మాకు ఉందని ఉద్ధవ్ చెప్పారు. సావర్కర్‌పై బీజేపీకి ప్రేమ లేదని అన్నారు. నిజంగా అంత ప్రేమే ఉంటే.. మోడీ ప్రభుత్వం ఆయనకు భారత రత్న ఎందుకు ఇవ్వలేదని మండిపడ్డారు.

రాహుల్ గాంధీ ఆ తర్వాత మహారాష్ట్రలోని అకోలాలో మరోసారి మాట్లాడారు. ఇంతకు ముందు తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. బ్రిటిషర్లకు సావర్కర్ రాసిన క్షమాభిక్ష పిటిషన్‌ను చూపించారు. మహాత్మా గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్ వంటి వాళ్లు కూడా జైలుకు వెళ్లారు. ఏళ్ల పాటు శిక్ష అనుభవించారు. కానీ ఏనాడూ సావర్కర్‌లాగ ఇలాంటి లేఖలు రాయలేదని రాహుల్ గుర్తు చేశారు.

First Published:  17 Nov 2022 11:32 AM GMT
Next Story