Telugu Global
National

బీజేపీ దృష్టిలో మ‌హిళ‌లు ఆట‌వ‌స్తువులు : రాహుల్ గాంధీ తీవ్ర ఆరోప‌ణ‌లు

ఉత్తరాఖండ్ లో ఓ బీజేపీ నాయకుడి రిసార్ట్ లో ఆయన కొడుకే ఓ యువతిని హత్య చేసిన సంఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండి పడ్డారు. బిజెపి, ఆర్ ఎస్ ఎస్ లకు మహిళలంటే ఆటవస్తువులని ఆయన ఆరోపించారు.

బీజేపీ దృష్టిలో మ‌హిళ‌లు ఆట‌వ‌స్తువులు : రాహుల్ గాంధీ తీవ్ర ఆరోప‌ణ‌లు
X

దేశంలో మ‌హిళ‌ల‌ను ఆట‌వ‌స్తువులుగా, రెండ‌వ శ్రేణి పౌరులుగా బిజెపి, ఆర్ ఎస్ ఎస్ ప‌రిగ‌ణిస్తున్నాయ‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉత్త‌రాఖండ్ లోని ఓ రిజార్టులో 19యేళ్ళ‌ అంకిత భండారీ అనే రిసెప్ష‌నిస్టు హ‌త్య‌ను ఆయ‌న ఈ సంద‌ర్భంగా ఉటంకించారు. "హోటల్ యజమాని బిజెపి నాయకుడు, హోటల్ నడుపుతున్నది అతని కుమారుడు, ఒక యువతిని వేశ్యగా ప‌నిచేయమని బలవంతం చేశాడు. ఆమె అందుకు నిరాకరించడంతో, ఆమె చెరువులో శవమై కనిపించింది.ఇదీ బిజెపి మ‌హిళ‌ల ప‌ట్ల వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు" అని రాహుల్ గాంధీ విమ‌ర్శించారు.

'ఈ దేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు మహిళల పట్ల ఎలా వ్యవహరిస్తున్నాయనడానికి ఇది అత్యంత అసహ్యకరమైన, అత్యంత అవమానకరమైన ఉదాహరణ. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల భావజాలం మహిళలను వస్తువులుగా, రెండవ తరగతి పౌరులుగా చూస్తుంది. ఈ భావజాలంతో భారతదేశం ఎన్నటికీ విజయం సాధించదు. మహిళలను గౌరవించలేని, వారికి సాధికారత కల్పించడం నేర్చుకోలేని దేశం ఎప్పటికీ ఏమీ సాధించలేదు'' అని రాహుల్‌ గాంధీ అన్నారు. మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే దేశం ఓటమి పాలవుతుందని ఆయన అన్నారు.

భారత్ జోడో యాత్ర సాయంత్రం విరామ స‌మ‌యంలో ప‌లువురు 'జస్టిస్ ఫర్ అంకిత', 'జస్టిస్ ఫర్ ఇండియన్ వుమెన్ , 'బీజేపీ సే బేటీ బచావో' అనే ప్లకార్డులను పట్టుకుని నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. అంకిత బండారీ మృతికి సంతాప‌సూచ‌కంగా ఓ నిమిషం మౌనం పాటించాల‌ని కోరారు.

"బేటీ బచావో అంటూ ప్రధాని నినాదాలు ఇస్తారు. బిజెపి చర్యలు మాత్రం- రేపిస్టులను రక్షిస్తున్న‌ట్టు ఉంటున్నాయి. ప్రసంగాలు, తప్పుడు విధానాలు, డొల్ల ప్రసంగాలు మాత్రమే చేసే మొద‌టి ప్రధాని ఆయ‌నే. ఆయన పాలన నేరస్థులకు అంకితం అవుతోంది. ఈ చ‌ర్య‌ల‌ను చూస్తూ దేశం మౌనంగా కూర్చోదు. " అని రాహుల్ బిజెపి, మోడీ తీరు పైధ్వ‌జ‌మెత్తుతూ అంత‌కు ముందు ట్వీట్ చేశారు.

భారతదేశానికి అతిపెద్ద బలం మహిళలేనని, వారిని గౌరవించలేకపోతే దేశ భవిష్యత్తు గురించి ఎలా మాట్లాడగలమని గాంధీ అన్నారు. అధికారాన్ని మాత్రమే గౌరవించడం 'బీజేపీ సిద్ధాంతాల సత్యం' అని ఆరోపించారు. అధికారాన్ని తప్ప వారు దేనినీ గౌరవించరు.. అధికారంలోకి రావడానికి ఏమైనా చేస్తారు.. ఒక్కసారి అధికారంలో ఉండేందుకు ఎన్ని అడ్డ‌దోవ‌లైనా తొక్కుతారు. వీటి ఫ‌లిత‌మే ఉత్త‌రాఖండ్ లో యువ‌తి మ‌ర‌ణం అని బిజెపి పై విరుచుకుప‌డ్డారు.

First Published:  28 Sep 2022 5:26 AM GMT
Next Story