Telugu Global
National

జాత్యాంహకారం, లింగ వివక్ష, అనాగరిక ప్రవర్తన, ఒత్తిడి, నిద్రలేమి, తక్కువ జీతం...ఇవీ ఎయిర్ హోస్ట‌స్ ల జీవితాలు.

''ఎయిర్ హోస్టెస్‌లు చాలా సరదాగా ఉంటారని, దేశాలన్నీ చుట్టొస్తారని అందరూ మాగురించి అనుకుంటారు. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే. మేము తరచుగా చాలా ఒంటరి జీవితాలను గడుపుతాము. ఎందుకంటే మేము ఎప్పుడూ అలసిపోయి ఉంటాము. మేము చేసే పనితో,మేము భరించే ఒత్తిడితో పోలిస్తే మాకు చాలా తక్కువ జీతం లభిస్తుంది," అని ఎయిర్ హోస్టెస్‌ ఇంద్రాణి చెప్పారు.

జాత్యాంహకారం, లింగ వివక్ష, అనాగరిక ప్రవర్తన, ఒత్తిడి, నిద్రలేమి, తక్కువ జీతం...ఇవీ ఎయిర్ హోస్ట‌స్ ల జీవితాలు.
X

అందమైన మేకప్, మంచి డ్రస్, ఆకర్షించే నవ్వుతో మనకు కనిపించే ఎయిర్ హోస్టెస్ ల జీవితాల వెనక అనేక విషాదాలు దాగి ఉన్నాయి. విమాన ప్రయాణీకులు సుఖంగా ప్రయాణించడం కోసం వాళ్ళు ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ కొందరు అనాగరిక ప్రయాణీకుల ప్రవర్తన వాళ్ళను దుఖంలో ముంచెత్తుంది. మనస్తాపానికి గురి చేస్తుంది. వాళ్ళ వృత్తి వాళ్ళను అనేక అనారోగ్యాల భారిన పడేస్తుంది.

ఈ మధ్య ఓ ఎయిర్ హోస్ట‌స్ కు ప్రయాణీకుడికి మధ్య జరిగిన వాగ్వివాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇస్తాంబుల్ నుండి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానంలో ఫ్లైట్ అటెండెంట్ కు ప్రయాణీకుడికి మధ్య జరిగిన గొడవ ఇది. తనకు ఇవ్వాల్సిన భోజనం కాకుండా వేరేది ఇచ్చారని ఆ ప్రయాణీకుడు వాగ్వివాదానికి దిగాడు. ఎయిర్ హోస్టెస్ ఎంత ప్రశాంతంగా, చిరునవ్వుతో జవాబు చెప్పినప్పటికీ అతను వినలేదు. పైగా రెచ్చిపోయి. ''నువ్వు నా సేవకురాలివి'' అని గద్దించాడు. దాంతో సహనం కోల్పోయిన ఎయిర్ హోస్టస్ "నేను మీ సేవకురాలిని కాదు, నేను ఉద్యోగిని." అని గొంతు పెంచింది.

ఇలాంటి సంఘటనలు విమానాల్లో తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ వెబ్ సైట్ అనేక మంది అంతర్జాతీయ, దేశీయ విమానాల్లో పని చేసే ఎయిర్ హోస్టస్ లతో మాట్లాడింది.

జాత్యహంకార వ్యాఖ్యలు, లైంగిక వేధింపులు, శారీరక, మానసిక ఒత్తిడి వరకు, అన్నింటినీ చిరునవ్వుతో భరించాల్సి వస్తుందని దాదాపు అందరూ ఏక కంఠంతో చెప్తున్నారు.

ఇండిగోలో మాజీ ఎయిర్ హోస్టెస్ అయిన మెహక్ (పేరు మార్చబడింది) మాట్లాడుతూ,

"బోర్డింగ్ సమయంలో, ముఖ్యంగా ఎయిర్‌బస్లో చాలా మంది ప్రయాణికులు, తమ సామాను ఓవర్‌హెడ్ బిన్‌లో ఉంచడంలో సహాయం కోరుతారు. ఆ నెపంతో, వారు మా శరీరాన్ని వారి శరీరంతో రుద్దుతారు. పైగా ఇది అనుకోకుండా జరిగినట్లు నటిస్తారు!"

మే 2022లో, జైపూర్-బెంగళూరు విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు ఎయిర్ హోస్ట‌స్ ను లైంగికంగా వేధించినందుకు అతన్ని అరెస్టు చేశారు. ఈ ఏడాది జూలైలో ఇండిగో విమానంలో మరో ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

పశ్చిమ బెంగాల్‌లోని కాలింపాంగ్‌కు చెందిన మెహక్, ప్రయాణీకుల నుండి జాత్యహంకార వ్యాఖ్యలకు కూడా గురయ్యానని చెప్పింది. "నా ముఖ లక్షణాల గురించి ప్రయాణీకులు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం నేను విన్నాను." అని అంది.

అలాంటి ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ఇలా చెప్పింది, "ఒకసారి, విమానంలో, ఒక పిల్లవాడు తన తండ్రికి నా కళ్ళను చూపిస్తూ ఎంత చిన్నగా ఉన్నాయో చూడమన్నాడు. ఆ పిల్లవాడి వ్యాఖ్యకు తండ్రి నవ్వుతూ, ''బాగా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో కూడా ఆమెకు తెలియదు. ఆమె ట్రే నుండి కాఫీ దొంగిలించినా ఆమెకు తెలియదు.'' అని వ్యాఖ్యానించాడు.

అంతర్జాతీయ విమానయాన సంస్థలో పనిచేస్తున్న నలభై ఒక్క ఏళ్ల ఇంద్రాణి (పేరు మార్చబడింది), తాను తరచుగా తెల్లజాతి ప్రయాణీకుల చేతుల్లో జాత్యహంకారాన్ని అనుభవించానని చెప్పింది. "నేను వారి ఉద్యోగాలను కొల్లగొట్టడానికి వారి దేశానికి వచ్చిన భారతీయురాలిన‌ని వ్యాఖ్యానించారు. నన్ను పాకిస్థానీ అని కూడా పిలిచారు."

ఇటీవల వైరల్ అయిన వీడియో గురించి ఇంద్రాణి మాట్లాడుతూ "వీడియోలోని ప్రయాణికుడు విమాన సహాయకురాలిని 'సేవకురాలు' అని పిలిచాడు. అది ఆమోదయోగ్యం కాదు. ప్రయాణీకులు తరచుగా మా వృత్తిని చిన్నచూపు చూస్తారు." ''ఒకసారి ఒక ప్రయాణికుడు వైన్ బాటిల్‌ను పగలగొట్టి బోర్డులోని సిబ్బంది తో డబ్బులు కట్టించాడు.'' అని చెప్పింది.

అంజన అనే ఎయిర్ హోస్టస్ మాట్లాడుతూ "నేను ప్రయాణీకుల నుండి దారుణమైన‌ ప్రవర్తనను ఎదుర్కొన్నాను. వారు అసభ్యంగా, మొరటుగా, అనాగరికంగా ప్రవర్తించేవారు. ఇది చాలా దారుణంగా ఉండేది, నేను ఉద్యోగం వదిలేయాలని అనుకున్నాను, కానీ ఆర్థిక బాధ్యతల కారణంగా నేను ఉద్యోగం కొనసాగించాల్సి వస్తోంది." అన్నారు.

అయితే వీరికి ఒక్క ప్రయాణీకుల నుండి ఎదురయ్యే ఇబ్బందులే కాదు. ఇంకా అనేక సమస్యలుంటాయి.

"అంతర్జాతీయ విమానాల కోసం, మేము అనేక టైం జోన్ లను దాటాలి. 40,000 అడుగుల ఎత్తులో పని చేయాలి. మేము నిజంగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం లేదు." అని ఎయిర్ హోస్టెస్ ఇంద్రాణి తెలిపారు.

ఫలితంగా, నిద్ర చక్రం దెబ్బతింటుంది. " కొన్నిసార్లు నేను 14 గంటల పాటు నిద్రపోతాను. కొన్ని సమయాల్లో నేను రోజుల తరబడి నిద్రపోను. దీని వల్ల శారీరకంగా మానసికంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది అంత తేలికైన పని కాదు. " అని ఇంద్రాణి అన్నారు.

"ఎయిర్ హోస్టెస్‌లు చాలా సరదాగా ఉంటారని, దేశాలన్నీ చుట్టొస్తారని అందరూ మాగురించి అనుకుంటారు. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే" అని ఇంద్రాణి చెప్పారు..

"మేము తరచుగా చాలా ఒంటరి జీవితాలను గడుపుతాము. ఎందుకంటే మేము ఎప్పుడూ అలసిపోయి ఉంటాము. మేము చేసే పనితో,మేము భరించే ఒత్తిడితో పోలిస్తే మాకు చాలా తక్కువ జీతం లభిస్తుంది," అని ఆమె చెప్పింది.

బైటికి ఎంతో అందంగా కనిపించే ఈ జీవితాల వెనక ఎంత విషాదం దాగి ఉంది? పైగా వీరి ఉద్యోగాలు శాశ్వతం కూడా కాదు. 40 ఏళ్ళు దాటాయంటే వీళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయి. ఈ ఒత్తిడిలతో, ఇంత వివక్ష భరించి, అనారోగ్యాలపాలై 60 ఏళ్ళ దాకా అందంగా కనిపించడం ఎవరితరం చెప్పండి. అందుకే యాజమాన్యాలు వీళ్ళను 40 ఏళ్ళకే ఉద్యోగాల నుండి తొలగిస్తాయి. ఎందుకంటే మరి ప్రయాణీకులకు అందమైన అమ్మాయిలు మాత్రమే సేవచేయాలి కదా ! వాట్ ఏ పిటీ!

First Published:  24 Dec 2022 7:42 AM GMT
Next Story