Telugu Global
National

ఆనంద్‌ని దాటి.. అగ్రస్థానానికి మాస్టర్‌ ప్రజ్ఞానంద

ఫిడే ర్యాంకింగ్స్‌ ప్రకారం.. ప్రజ్ఞానంద 2748.3 పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ 2748 పాయింట్లతో 12 స్థానంలో కొనసాగుతున్నాడు.

ఆనంద్‌ని దాటి.. అగ్రస్థానానికి మాస్టర్‌ ప్రజ్ఞానంద
X

యువ గ్రాండ్‌ మాస్టర్‌ ప్రజ్ఞానంద.. చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ని దాటి అగ్రస్థానానికి ఎగబాకాడు. భారత్‌ టాప్‌ ర్యాంకర్‌గా అవతరించాడు. బుధవారం జరిగిన టాటా స్టీల్‌ మాస్టర్స్‌ టోర్నమెంట్‌ నాలుగో రౌండ్‌లో ప్రపంచ ఛాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ (చైనా)ను ఓడించడంతో ఈ ఘనత అందుకున్నాడు. ప్రజ్ఞానంద.. విశ్వనాథన్‌ ఆనంద్‌ను దాటి టాప్‌ ర్యాంకర్‌గా అవతరించడం తన కెరీర్‌లోనే తొలిసారి కావడం విశేషం.

ఫిడే ర్యాంకింగ్స్‌ ప్రకారం.. ప్రజ్ఞానంద 2748.3 పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ 2748 పాయింట్లతో 12 స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో భారత్ తరఫున టాప్‌ ప్లేయర్‌గా ఈ యువ గ్రాండ్‌మాస్టర్‌ అగ్రస్థానంలోకి ఎగబాకాడు. అంతేకాదు.. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత.. క్లాసికల్‌ చెస్‌ విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించిన రెండో భారతీయుడిగా నిలిచాడు.

ప్రజ్ఞానందపై అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించి ఈ ఘనత అందుకున్నాడని కొనియాడారు. నిన్ను చూసి ఈ దేశం గర్వపడుతోంది.. అంటూ అభినందించారు. కాగా ప్రజ్ఞానందకు ఆర్థికంగా అండగా ఉంటామని ఇటీవల అదానీ గ్రూప్‌ ప్రకటించింది. గతేడాది చెస్‌ ప్రపంచకప్‌లో ప్రజ్ఞానంద కొద్దిలో టైటిల్‌ మిస్సయ్యాడు.

First Published:  17 Jan 2024 8:53 AM GMT
Next Story