Telugu Global
National

తమిళనాడు గవర్నర్ వ్యవహారాన్ని తప్పుబట్టిన రాష్ట్ర బీజేపీ

“తమిళనాడు, తమిళగంపై వివాదం అనవసరం. ఈ వివాదం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు' అని అన్నామలై అన్నారు. మరి రవి ఎందుకు ఈ గొడవను లేవదీశారు అని అడిగిన ప్రశ్నకు, “బహుశా అతను కూడా పొరపాటు చేసి ఉండవచ్చు” అని అన్నామలై అన్నారు.

తమిళనాడు గవర్నర్ వ్యవహారాన్ని తప్పుబట్టిన రాష్ట్ర బీజేపీ
X

తమిళనాడు కంటే తమిళగం అనే పేరు రాష్ట్రానికి సరైనదని తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి వివాదాన్ని రేకెత్తించిన కొద్ది రోజులకే, ఆ వ్యాఖ్య అనవసరమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై అన్నారు.

పేరు మార్పుపై వివాదం "ఎటువంటి ఉపయోగం లేనిది" అని స్పష్టం చేస్తూ, రాష్ట్ర చిహ్నం లేకుండా పొంగల్ కోసం ఆహ్వానాలు జారీ చేయాలనే రాజ్ భవన్ నిర్ణయాన్ని అన్నామలై కూడా విభేదించారు, అయితే అది "క్లరికల్ లోపం" వల్ల జరిగి ఉండవచ్చని అన్నారు.

తమిళ వార్తా ఛానల్ తంతి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నామలై తమిళనాడు, తమిళగం రెండూ ఒకే విధమైన అర్ధం కలిగి ఉన్నాయని, రాష్ట్రం పేరు మార్చాలనే అభిప్రాయంతో బిజెపి ఏకీభవించదని అన్నారు.

“తమిళనాడు, తమిళగంపై వివాదం అనవసరం. ఈ వివాదం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు' అని అన్నామలై అన్నారు. మరి రవి ఎందుకు ఈ గొడవను లేవదీశారు అని అడిగిన ప్రశ్నకు, “బహుశా అతను కూడా పొరపాటు చేసి ఉండవచ్చు” అని అన్నామలై అన్నారు.

రవి కొన్ని విభజన శక్తుల గురించి మాట్లాడుతున్నారని, పేరు మార్పు ఆలోచనకేవలం సూచన మాత్రమే అని అన్నారు. అయితే ఆ సూచనను నేను అంగీకరించను. ఆయన (గవర్నర్) ఒక సూచన ఇస్తున్నారు, అందరూ దానిని ఆమోదించాల్సిన అవసరం లేదు. అన్నారాయన‌

అయితే, కొందరు డీఎంకే నేతలు ప్రత్యేక దేశం కోసం పాత డిమాండ్ ను లేవదీస్తున్నారని అన్నామలై తెలిపారు. "ఇటీవల కూడా, డిఎంకె నాయకుడు ఎ రాజా మాట్లాడుతూ, ప్రత్యేక దేశ‌ డిమాండ్‌కు పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి అన్నారు. డీఎంకే ఐటీ విభాగం, కొందరు నేతలు ఇప్పటికీ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు.''అని ఆయన అన్నారు.

గవర్నర్ పొంగల్ వేడుకల ఆహ్వానపత్రంపై రాష్ట్ర చిహ్నం లేకపోవడంపై అన్నామలైని అడగ్గా, “ఆహ్వానంలో 100 శాతం తమిళనాడు లోగో ఉండాలి. కానీ నేను దానిని క్లరికల్ లోపంగా చూస్తున్నాను ఎందుకంటే గవర్నర్ అలాంటి వ్యక్తి కాదు... అది కావాలని చేసినపని కాకపోవచ్చు.'' అన్నారు.

ఈ వివాదం నేపథ్యంలో గవర్నర్‌కు మద్దతు పలికిన బీజేపీ నేతల్లో అన్నామలై కూడా ఉన్నారు. కానీ రాష్ట్ర బిజెపి యూనిట్‌లోని కొందరు, ఢిల్లీలోని కొంతమంది కేంద్ర నాయకులు రవి యొక్క వైఖరికి వ్యతిరేకంగా ఉన్నారు. జనవరి 9 న గవర్నర్ అసెంబ్లీ నుండి వాకౌట్ చేయడాన్ని పలువురు బీజేపీ నేతలు వ్యతిరేకించారు.

“ఆయన (గవర్నర్)ను నిదానంగా వెళ్లమని ఢిల్లీ నేతలు చెప్పారు. ”అని తమిళనాడుకు చెందిన ఒక సీనియర్ బిజెపి నాయకుడు అన్నారు. రాష్ట్రంలో పార్టీ అవకాశాలను పాడుచేసే వివాదాలను కేంద్ర నాయకత్వం భరించలేదని అన్నారు.

First Published:  17 Jan 2023 2:46 AM GMT
Next Story