Telugu Global
National

చ‌రిత్ర అద్దంలో మీ ముఖాలు చూసుకోండి..

నేడు(ఆగస్టు 9) చావోరేవో తేల్చుకోవడం కోసం క్విట్ఇండియా ఉద్యమం కోసం పిలుపు ఇచ్చిన రోజు క‌నుక‌ ఆ సమయంలో ఎవరి పాత్ర ఏమిటో ఈ తరానికి తెలియాల్సిందే.

చ‌రిత్ర అద్దంలో మీ ముఖాలు చూసుకోండి..
X

దేశభక్తి, జాతీయతాభావం తమ గుత్తసొత్తు అని భావించే హిందుత్వవాదులు జాతీయోధ్య‌మ సమయంలో ఏం చేశారో ఒక్కసారి బేరీజు వేసుకోవడం మంచిది. ఇప్పుడు అందరి వీపుల మీద దేశద్రోహులు అన్న ముద్ర వేస్తున్నవారు ఎంతటి దేశద్రోహానికి పాల్పడ్డారో అర్థం చేసుకోవాలంటే చరిత్ర పుటలను తిప్పాల్సిందే. నేడు(ఆగస్టు 9) చావోరేవో తేల్చుకోవడం కోసం క్విట్ఇండియా ఉద్యమం కోసం పిలుపు ఇచ్చిన రోజు క‌నుక‌ ఆ సమయంలో ఎవరి పాత్ర ఏమిటో ఈ తరానికి తెలియాల్సిందే.

బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ మ‌హాసభలో 1942 ఆగస్టు 7వ తేదీన కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమ సమర శంఖారావం పూరించింది. ఆ ఉద్యమం 9వ తేదీ నుంచి ప్రారంభం కావలసింది. ఆ ముందు రోజు ఆగస్టు 8న గొవాలియా ట్యాంక్ మైదానంలో మహాత్మాగాంధీ చేసిన ప్రసంగం చరిత్రాత్మకమైంది. క్విట్ఇండియా ఉద్యమాన్నిఆగస్టు విప్లవం అంటున్నట్టుగానే ఆ మైదానాన్నిఆగస్టు క్రాంతి మైదాన్ అంటారు. అప్పటి నుంచి క్విట్ ఇండియా ఉద్యమాన్నిఆగస్టు క్రాంతి దినోత్స‌వంగా జ‌రుపుకోవడం మొదలైంది.

కాంగ్రెస్ క్విట్ ఇండియా పిలుపు ఇవ్వ‌గానే ఆగ‌స్టు 8వ తేదీన బ్రిటిష‌ర్లు కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుల‌తో స‌హా దాదాపు ల‌క్ష మందిని అరెస్ట్ చేశారు. మూకుమ్మ‌డి జ‌రిమానాలు విధించారు. సాహసించి నిరసన ప్రదర్శనలు చేసిన వారిని కొరడాలతో కొట్టారు. పోలీసు కాల్పుల్లో వందలాది మంది మరణించారు. ఈ ఉద్యమాన్నిఅణచడంలో సంస్థానాధీశులు కూడా బ్రిటిష్‌వారి అడుగుజాడల్లోనే నడిచి తెల్లవారికి దన్నుగా నిలిచారు. అరెస్టు కాకుండా తప్పించుకున్న నాయకులు అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. రహస్యంగా రేడియో స్టేషన్లు నడిపారు. డాక్ట‌ర్‌ రాంమనోహర్ లోహియా, అరుణా ఆసఫ్అలీ అజ్ఞాతవాసంలో ఉంటూ రేడియో స్టేషన్లు నడిపారు. కరపత్రాలు ముద్రించి పంచారు. పోటీ ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో త్రివర్ణ పతాకం బహిరంగంగా పట్టుకున్నందుకు అనేక మందిని బ్రిటిష్ పోలీసులు కాల్చిచంపారు.

బ్రిటిష్ పోలీసులు విరుచుకుపడడానికి ముందే మైసూరు మహారాజా సాయుధ దళాలు త్రివర్ణ పతాకానికి వందనం చేసినందుకు 22 మందిని కాల్చిచంపాయి. ఆ మైసూరు మహారాజా హిందూ మహాసభకు, ఆర్.ఎస్.ఎస్‌కు అత్యంత సన్నిహితుడు. బ్రిటిష‌ర్లు కాంగ్రెస్‌ను జాతివ్యతిరేక శక్తిగా, చట్టవ్యతిరేక సంస్థగా ప్రకటించారు. మరోవైపు హిందూ మహాసభకు, ముస్లిం లీగ్‌కు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఇవ్వడమేకాక ప్రోత్సహించారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో హిందుత్వవాదులు అంటే హిందూ మహాసభ, ఆర్.ఎస్.ఎస్. వారు ఏంచేశారో పరిశీలిస్తే వారు చెప్పే దేశభక్తిలోని డొల్లతనం అర్థం అవుతుంది. హిందుత్వవాదుల విద్రోహపాత్రను గంప కింద కమ్మేయడానికి పెద్ద ప్రయత్నమే జరిగింది. హిందుత్వ వాదులు అప్పుడు క్విట్ ఇండియా ఉద్యమాన్నివ్యతిరేకించడమే కాదు బ్రిటిష్‌వారికి అనేక రీతుల్లో అండదండలందించారు. జాతీయోద్యమంలో చరిత్రాత్మకమైన మహోజ్వల ఘట్టాన్ని అణచివేయడానికి వలసవాద బ్రిటిష్ ప్ర‌భుత్వంతో కుమ్మక్కయ్యారు. ఆనాడు హిందుత్వవాదుల విద్రోహం గురించి దిగ్భ్రాంతి కలిగించే పత్రాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

1942లో కాన్పూర్‌లో జరిగిన హిందూ మహాసభ 24వ సమావేశంలో ప్రసంగిస్తూ వీరసావర్కర్ హిందూ మహాసభ బ్రిటిష్‌వారికి ఏరకంగా తోడ్పడాలో పూసగుచ్చినట్టు వివరించారు. "ఆచరణాత్మక రాజకీయాలంటే హిందూ మహాసభ దృష్టిలో ప్రతిస్పందనతో కూడిన సహకారం. అందువల్ల కౌన్సిలర్లుగా, మంత్రులుగా, చట్టసభల‌ సభ్యులుగా, మునిసిపల్ సంస్థ‌ల్లో సభ్యులుగా ఉండేవారందరూ ప్రభుత్వ కేంద్రాలను వినియోగించుకుని దేశసేవ చేయాలి. బ్రిటిష్‌వారికి ప్రతిస్పందనాత్మక సహకారం అంటే బేషరతుగా ప్రభుత్వానికి సహకరించడం. అవసరమైతే క్విట్ ఇండియా ఉద్యమకారులతో సాయుధ ప్రతిఘటనకు దిగడం" అని ఉద్బోధించారు.

బ్రిటిష్‌వారితో ప్రతిస్పందనతో కూడిన సహకారం కేవలం సైద్ధాంతికమైందికాదు. అది ముస్లింలీగ్‌తో హిందుత్వవాదులు వియ్యమందడానికి దారితీసింది. వీరసావర్కర్‌ నాయకత్వంలోని హిందూ మహాసభ 1942లో ముస్లింలీగ్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేసింది. హిందూ మహాసభ కాన్పూర్‌ సమావేశంలో అధ్యక్షోపన్యాసం చేస్తూ సావర్కర్‌ ముస్లింలీగ్‌తో అనుబంధాన్నిఇలా సమర్థించుకున్నారు.. "ఆచరణాత్మక రాజకీయాలు అంటే మనం హేతుబద్ధమైన రాజీ కూడా కుదుర్చుకోవాలి. ఇటీవలే సింధ్‌లో ముస్లింలీగ్‌ ఆహ్వానం మేరకు సింధ్‌-హిందు-స‌భ ఆ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. బెంగాల్‌ సంకీర్ణ ప్రభుత్వం గురించి అందరికీ తెలుసు. కాంగ్రెస్ ఎంత త‌గ్గినా ముస్లిం లీగ్‌ను శాంతింప‌చేయ‌లేక‌పోయింది. కానీ ఫజ్లుల్హఖ్‌ ప్ర‌ధానమంత్రిగా (అప్పుడు ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి అనేవారు) ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో కూడా శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ విజయవంతంగా ఏడాది పాటు పనిచేశారు. ఇది రెండు మతాలవారికీ ఉపయోగపడింది. ఆ సమయంలో హిందూ మహాసభ ముస్లిం లీగ్‌తో కలిసి వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో కూడా సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది.

బ్రిటిష్‌వారితో సహకరించాలన్న హిందూ మహాసభ ఆదేశం మేరకు ప్రస్తుతం హిందుత్వవాదులకు ఆరాధ్యుడైన డాక్ట‌ర్ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ 1942 జూలై 26న రాసిన ఉత్తరంలో బ్రిటిష్‌వారికి ఎలాంటి హామీ ఇచ్చారో గమనిస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. "కాంగ్రెస్‌ ప్రారంభించిన విస్తృత ఉద్యమం వల్ల ఏ రాష్ట్రంలోనైనా తలెత్తే పరిస్థితి గురించి నేను ప్రస్తావిస్తున్నాను. ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రజల మనోభావాలను రేకెత్తించాలని ప్రయత్నిస్తే, తద్వారా అంతర్గతంగా కలహాలు రేగితే, భద్రతకు విఘాతం కలిగితే ఏ ప్రభుత్వమైన తీవ్రంగా నిరోధించవలసిందే" అని శ్యామాప్రసాద్‌ ముఖర్జీ ఆ లేఖలో రాశారు.

ఆ సమయంలో హిందూ మహాసభలో సావర్కర్‌ త‌రవాతి స్థానం శ్యామాప్రసాద్‌ ముఖర్జీదే. బెంగాల్లో ముస్లిం లీగ్ నాయ‌కత్వంలోని ప్రభుత్వంలో ముఖర్జీ ఉపముఖ్యమంత్రి కూడా. ఆ సమయంలో ఆయన హిందూ మహాసభ, ముస్లింలీగ్‌ త‌రఫున బెంగాల్‌ గ‌వర్నర్‌కు రాసిన లేఖలో క్విట్ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్‌ పాలకులు బెంగాల్ ప‌రిర‌క్ష‌కులు అన్నారు. క్విట్ఇండియా ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి తీసుకోవలసిన చర్యలను ముఖర్జీ ఇలా ఏకరువుపెట్టారు. "బెంగాల్‌లో క్విట్ఇండియా ఉద్యమాన్నిఎలా ఎదుర్కోవాలన్నదే ప్రశ్న. కాంగ్రెస్‌ ఎంత ప్రయత్నించినా ఆ ఉద్యమం సఫలం కాని రీతిలో ప్రభుత్వం పనిచేయాలి. కాంగ్రెస్ ఏ స్వాతంత్య్రం కోసమైతే పోరాడుతోందో అది ప్రజాప్రతినిధులకు దక్కిందని ప్రజలు నమ్మేట్టుగా చెప్పాలి. కొన్నిచోట్ల స్వాతంత్య్రం పరిమితంగా ఉండవచ్చు. భారతీయులు బ్రిటిష్‌వారిని నమ్మాలి. అది బ్రిటిష్‌వారి ప్రయోజనం కోసం కాదు. రాష్ట్రానికి ఉన్నస్వేచ్ఛను కాపాడుకోవడానికే" అని ముఖర్జీ రాశారు.

హిందుత్వ పరిరక్షణకు కంకణం కట్టుకున్న ఆర్.ఎస్.ఎస్. కూడా క్విట్ఇండియా విషయంలో హిందూ మహాసభలాగే ప్రవర్తించింది. సహాయ నిరాకరణోద్యమం, క్విట్ఇండియా ఉద్యమం గురించి అప్పటి ఆర్.ఎస్.ఎస్. అగ్రనాయకుల్లో రెండవ స్థానంలో ఉన్న ఎం.ఎస్.గోల్వాల్కర్‌ అభిప్రాయాలు గమనించదగినవి. "క్విట్ఇండియా ఉద్యమానికి దుష్ఫలితాలు రాక తప్పదు. 1920-21 సహాయ నిరాకరణోద్యమంలో యువకులు కట్టుతప్పారు. అది కేవలం నాయకుల మీద బురదచల్లడం కాదు. ఇలాంటి పోరాటంలో ఈ ఫలితాలు అనివార్యం. విషయం ఏమిటంటే మనం ఈ ఫలితాలను సరిగ్గా వినియోగించుకోలేకపోయాం. 1942 తరవాత జనం చట్టం గురించి ఆలోచించవలసిన పనిలేదు అనుకున్నారు" అన్నారు గోల్వాల్కర్.

హిందువులను, ముస్లింలను విడగొట్టాలన్నబ్రిటిష్ పాలకుల, ముస్లిం లీగ్ ప్ర‌యత్నాలు సఫలమయ్యేట్టు ఆర్.ఎస్.ఎస్. బాగా తోడ్పడింది. ఆర్.ఎస్.ఎస్. క్విట్ఇండియా ఉద్యమానికి దూరంగానే ఉందని అప్పటి ప్రభుత్వ గూఢచార నివేదికలు కూడా నిర్ధారించాయి. జాతీయోద్యమ కీలకఘట్టంలో స్వాతంత్య్ర పోరాటయోధులను అణచివేయడంలో బ్రిటిష్‌ ప్ర‌భుత్వానికి హిందుత్వవాదులు పూర్తిగా సహకరించారు. ఆ హిందుత్వవాదుల వారసులే ఇప్పుడు రాజ్యమేలుతున్నారు. క్విట్ఇండియా ఉద్యమ సమయంలో ఆర్.ఎస్.ఎస్.లో కీలక పాత్ర పోషించిన గోల్వాల్కర్, దీన్ ద‌యాళ్‌ ఉపాధ్యాయ, బల‌రాజ్‌ మ‌ధోక్, లాల్ కిష‌ణ్ అడ్వాణీ, కె.ఆర్. మల్కానీ లాంటివారు ఆ మహోద్యమంలో ఎలాంటి పాత్రా పోషించలేదు. ఇది చరిత్ర చెప్పే సాక్ష్యం. పాకిస్తాన్ ప‌ర్య‌ట‌న‌లో జిన్నాను అడ్వానీ పొగిడినప్పుడు హిందుత్వవాదులు తెగ బాధపడిపోయారు. చరిత్ర దర్పణంలో తమ ముఖం చూసుకుంటే ఏ బాధా ఉండదు.. సత్యం బోధపడుతోంది.

Next Story