Telugu Global
National

ఖైదీలు భాగస్వాములతో సంసారం చేసుకోవచ్చు.. పంజాబ్ జైళ్లలో కొత్త పథకం

జైలులోని ఖైదీలను కలవడానికి వచ్చే భాగస్వాములు తప్పకుండా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హెల్త్ సర్టిఫికెట్ తీసుకొని రావాలి. అందుతో సదరు భాగస్వామికి హెచ్ఐవీ, ఎస్టీడీ, కోవిడ్, టీబీ, ఇతర ప్రాణాంతకమైన వ్యాధులు లేనట్లుగా ధృవీకరించాలి.

ఖైదీలు భాగస్వాములతో సంసారం చేసుకోవచ్చు.. పంజాబ్ జైళ్లలో కొత్త పథకం
X

పంజాబ్ ప్రభుత్వం ఖైదీల కోసం వినూత్న పథకాన్ని నేటి నుంచి అమలు చేయనుంది. దీర్ఘకాలంగా జైళ్లలో శిక్ష అనుభవిస్తూ, మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలు ఇకపై తమ భాగస్వామి (భర్త లేదా భార్య)తో ఏకాంతంగా గడిపేందుకు అనుమతి ఇవ్వనుంది. ఇందుకోసం ముందుగా రాష్ట్రంలోని మూడు జైళ్లను ఎంపిక చేసి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు జైళ్ల శాఖ తెలిపింది. దేశంలోనే ఇలాంటి పథకం తీసుకొని వచ్చిన తొలి రాష్ట్రంగా పంజాబ్ రికార్డు సృష్టించింది. జైళ్లలో ఇప్పటికే ములాఖత్ విధానం అందుబాటులో ఉంది. ఆ సమయంలో కేవలం మాట్లాడుకోవడానికే పర్మిషన్ ఉంటుంది. ఇక పెరోల్ మీద బయటకు వెళ్లి కొన్ని రోజులు కుటుంబంతో గడిపే అవకాశం కూడా ఉంది. కానీ 'కంజ్యుగల్ మీట్' (దాంపత్య సంబంధిత కలయిక) మాత్రం ఇదే తొలిసారి.

ప్రపంచంలో చాలా దేశాల్లో కంజ్యుగల్ మీట్‌ను అమలు చేస్తున్నారు. యూఎస్ఏ, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బ్రెజిల్, ఫ్రాన్స్, డెన్మార్క్ దేశాల్లో ఈ అవకాశం ఉన్నట్లు పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి హర్‌జోత్ సింగ్ వెల్లడించారు. ప్రతీ కంజ్యుగల్ మీట్ సరాసరి రెండు గంటల సమయం ఉంటుంది. రాష్ట్రంలోని మూడు జైళ్లలో ఈ పథకాన్ని తొలి దశలో ప్రవేశపెడుతున్నారు. గోండ్వాల్ సాహిబ్‌లోని సెంట్రల్ జైలు, భటిండాలోని మహిళా జైలు, నభాలోని న్యూ డిస్ట్రిక్ జైలులో ఈ అవకాశం ఉంది. ప్రస్తుతం జైళ్లలో గదుల కొరత ఉన్నందున.. నెలలో రెండు సార్లు మాత్రమే ఈ కంజ్యుగల్ మీట్‌కు అనుమతి ఇవ్వనున్నారు. ఖైదీల ప్రవర్తనలో మార్పు, కుటుంబ బంధాలపై ప్రేమ పెంచడం, నెగెటివ్ థాట్స్‌ నుంచి దూరం చేయడం లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఆప్ ప్రభుత్వం చెబుతోంది.

ఇప్పటి వరకు కంజ్యుగల్ మీట్ కోసం 102 దరఖాస్తులు వచ్చాయని.. అందులో 62 దరఖాస్తులను అంగీకరించినట్లు తెలిపారు. వీరిలో 26 మంది మహిళా ఖైదీలు కూడా ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. కాగా, కంజ్యుగల్ మీట్లు కేవలం ఓ సౌకర్యం మాత్రమేనని ఏ ఖైదీకి అది హక్కుగా ఉండబోదని తెలిపారు. ఈ పథకం కోసం మూడు జైళ్లలో కొన్ని గదులలో అటాచ్డ్ బాత్రూం, ఒక బెడ్, మంచి నీరు, ఫ్యాన్ సౌకర్యంతో సిద్ధం చేశారు. ఇక సెప్టెంబర్ 25 నుంచి అమృత్‌సర్, ఫరీద్‌కోట్‌లోని సెంట్రల్ జైలు, ముక్తసర్ సాహిబ్‌లోని జిల్లా జైలు.. సెప్టెంబర్ 30 నుంచి భటిండా, గుర్‌దాస్‌పూర్‌లోని సెంట్రల్ జైలు, మాన్సాలోని జిల్లా జైలులో ఈ పథకం అమలులోకి రానుంది. దీంతో పాటు 'పరివార్ ములాఖత్' పేరుతో మరో పథకాన్ని లుథియానా సెంట్రల్ జైలులో ఇప్పటికే అమలు చేస్తున్నారు. ఖైదీ కుటుంబానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులతో నాలుగు గంటల పాటు గడిపేందుకు ఈ పథకం ద్వారా ఛాన్స్ ఇస్తున్నారు.

కాగా, జైలులోని ఖైదీలను కలవడానికి వచ్చే భాగస్వాములు తప్పకుండా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హెల్త్ సర్టిఫికెట్ తీసుకొని రావాలి. అందుతో సదరు భాగస్వామికి హెచ్ఐవీ, ఎస్టీడీ, కోవిడ్, టీబీ, ఇతర ప్రాణాంతకమైన వ్యాధులు లేనట్లుగా ధృవీకరించాలి. ఈ సర్టిఫికెట్ వారం రోజుల లోపే జారీ చేసినదై ఉండాలి. దీంతో పాటు వివాహ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డును జైలు అధికారులకు సబ్మిట్ చేయాలి. జైలులో సుదీర్ఘ కాలంగా శిక్షను అనుభవిస్తూ.. సత్ప్రవర్తన కలిగిన వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. పెరోల్ కోసం అర్హులైన వారికి ఈ పథకంలో ప్రాధాన్యత ఇవ్వరు. ఆ ఖైదీలు ఎలాగో పెరోల్ మీద బయటకు వెళ్లి కుటుంబంతో గడపుతారు కాబట్టి వాళ్లకు ఛాన్స్ ఉండదని అధికారులు చెప్తున్నారు.

అయితే ప్రమాదకరమైన ఖైదీలు, గ్యాంగ్‌స్టర్లకు ఈ పథకాన్ని వర్తింప చేయడం లేదు. సత్ప్రవర్తన కలిగిన అండర్ ట్రయల్ ఖైదీలు ఈ పథకాన్ని ఉపయోగించుకునే వెసులు బాటు ఉన్నది.

First Published:  21 Sep 2022 5:48 AM GMT
Next Story