Telugu Global
National

అనేక విప్లవాలకు కారణమైన బీహార్ గడ్డకు రావడం గర్వంగా ఉంది -కేసీఆర్

గాల్వాన్ లోయలో చైనా సైనికులతో పోరాడుతూ ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తానని గతంలోనే ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు బీహార్ లో 5గురు సైనికుల కుటుంబాలకు, ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున చెక్కులను పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో అందించారు. అలాగే.. సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ కార్మికుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున చెక్కుల‌ను అందజేశారు.

అనేక విప్లవాలకు కారణమైన బీహార్ గడ్డకు రావడం గర్వంగా ఉంది -కేసీఆర్
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ పర్యటనలో భాగంగా ఈ రోజు పాట్నాలో గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన బీహార్ కు చెందిన‌ ఐదుగురు సైనికుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున, అలాగే.. సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్నిప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున చెక్కుల‌ను సీఎం కేసీఆర్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...''ఈ బీహార్ గడ్డ అనేక విప్లవాలకు మూలం. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఇక్కడి నుంచే సంపూర్ణ విప్లవం ప్రారంభించారు. ఇలాంటి గడ్డ‌ మీద నిలబడి మాట్లాడటం గర్వంగా ఉంది.'' అన్నారు. పోయిన ప్రాణాలను తిరిగి తేలేం కానీ ప్రాణాలకు తెగించి దేశం కోసం పోరాడుతున్న సైనికులకు అండగా మేమున్నాం అనే సందేశాన్ని పంపడం అవసరం అని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్దిలో బీహార్ కార్మికుల శ్రమ ఉంది. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం మాబాధ్యత. అందుకే చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నాం అన్నారు కేసీఆర్. కరోనా సమయంలో కూడా ఇతర రాష్ట్రాల కార్మికుల కోసం 150 ప్రత్యేక రైళ్ళను వేసి వాళ్ళను స్వస్థలాలకు పంపామని కేసీఆర్ గుర్తు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన బీహార్ సీఎం నితీశ్ కుమార్... ''సరిహద్దుల్లో చనిపోయిన మా రాష్ట్ర సైనికుల కుటుంబాలకు మేము ఆర్థిక సహాయం చేశాం. అయితే అలా మరణించిన, దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడం గొప్ప విషయం'' అని ఆయన అన్నారు.

అంతే కాదు 14 సంవత్సరాలు పోరాడి కేసీఆర్ తెలంగాణ సాధించారని, ప్రస్తుతం ఆ రాష్ట్ర అభివృద్దికి అనేక కార్యక్రమాలు చేపట్టారని, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు చూసి తాము కూడా నేర్చుకుంటున్నామని నితీశ్ అన్నారు. అలాంటి కేసీఆర్ మీద పనిలేనివాళ్ళు పనికిమాలిన విమర్శలు చేస్తూ ఉంటారని అటువంటి వాటిని పట్టించుకోకుండా కేసీఆర్ ముందుకు సాగాలని నితీశ్ కుమార్ అన్నారు.

ఈ కార్యక్రమం తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు.

First Published:  31 Aug 2022 10:42 AM GMT
Next Story