Telugu Global
National

చీతాలు మరణిస్తాయని తెలిసే తెచ్చాం.. కేంద్రం వింత సమాధానం

చీతాల మరణాలు తమకు ఆందోళన కలిగించడంలేదని, 50శాతం చనిపోతాయని తాము ముందుగానే ఊహించామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి సుప్రీంకు అసలు విషయం చెప్పారు.

చీతాలు మరణిస్తాయని తెలిసే తెచ్చాం.. కేంద్రం వింత సమాధానం
X

భారత్ లో ప్రస్తుతం లేని జంతువులు అవి. మన వాతావరణం వాటికి అనకూలమా కాదా అనేది కూడా పూర్తిగా తెలియదు. 100 జంతువులు తెస్తే వాటిలో ఒకటీ రెండు మరణించే అవకాశం ఉందని తెలిస్తే ధైర్యం చేయొచ్చు. కానీ 100లో 50 కచ్చితంగా మరణించే అవకాశముందని తెలిస్తే ఎవరూ వాటిని తరలించే సాహసం చేయరు, తెలిసి తెలిసీ వాటికి హాని తలపెట్టరు. కానీ కేంద్రం గొప్పలకోసం ఆ తప్పు చేసింది. చీతాల మరణంపై సుప్రీంకోర్టుకి కేంద్రం ఇచ్చి నివేదిక ఇప్పుడు కలకలం రేపుతోంది.

మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో ఇటీవల వరుసగా చీతాలు మరణిస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ నివేదికలో కేంద్రం తెలిపిన సమాధానం మాత్రం వణ్యప్రాణి ప్రేమికులకు ఆగ్రహాన్ని తెప్పించింది. చీతాల మరణాలు తమకు ఆందోళన కలిగించడంలేదని, 50శాతం చనిపోతాయని తాము ముందుగానే ఊహించామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి సుప్రీంకు అసలు విషయం చెప్పారు.

‘ప్రాజెక్ట్‌ చీతా’లో భాగంగా ఆఫ్రికా నుంచి ఇటీవల 20చీతాలను తీసుకొచ్చారు. మధ్యప్రదేశ్‌ లోని కునో నేషనల్‌ పార్క్‌ లో వాటిని ఉంచారు. వివిధ కారణాలతో ఇందులో 8 చీతాలు చనిపోయాయి. మరో రెండిటి పరిస్థితి విషమంగా ఉంది. కాలర్ బోన్ ఇన్ఫెక్షన్ కారణంగా అవి చనిపోతున్నాయనే ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. అయితే తొలి ఏడాది అందులో 50శాతం చనిపోతాయని తమకు తెలుసని కేంద్రం చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. అంటే ఆఫ్రికానుంచి తెచ్చిన 20 చీతాల్లో తొలి ఏడాదే 10 చనిపోతాయని కేంద్రానికి తెలిసినా ప్రాజెక్ట్ చీతా అనే సాహసం చేసింది.

కేంద్రం సమాధానం విన్న సుప్రీంకోర్టు తదుపరి చర్యలకు ఆదేశించింది. మృత్యువాత పడుతున్నప్పటికీ చీతాలను కునో నేషనల్‌ పార్కులోనే ఉంచడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వేరే ప్రదేశానికి తరలించే ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదని అడిగింది. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది.

First Published:  21 July 2023 5:08 AM GMT
Next Story