Telugu Global
National

నా అన్న వారియర్.. ఆయన్ను కొనే ధైర్యం ఎవరికీ లేదు –ప్రియాంక

తన సోదరుడికి సత్యం అనే రక్షణ కవచం ఉందని, అందుకే చలికాలంలో టీషర్టులు ధరించినా రాహుల్ కి ఏమీ కాదన్నారు. 3,000 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసిన సోదరుడిని చూస్తే గర్వంగా ఉందని ప్రియాంక అన్నారు.

నా అన్న వారియర్.. ఆయన్ను కొనే ధైర్యం ఎవరికీ లేదు –ప్రియాంక
X

''అదానీ, అంబానీ ఏదైనా కొనొచ్చు. కానీ, వారు నా అన్నను మాత్రం కొనలేరు. ఎందుకంటే ఆయన నీతి, నిజాయితీలకు కట్టుబడ్డారు'' అని అన్నారు ప్రియాంక గాంధీ. భారత్ జోడో యాత్ర ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌ లోకి అడుగుపెట్టిన సందర్భంగా సరిహద్దులో ఆమె ఘన స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రసంగించారు. ''రాహుల్‌ వ్యక్తిత్వాన్ని నాశనం చేసేందుకు కేంద్రం రూ.కోట్లు ఖర్చు చేయొచ్చేమో.. కానీ, ఆయన యోధుడు. ఆయన అనుసరించే సత్యమార్గం నుంచి దారి మళ్లించలేరు'' అని ప్రియాంక వ్యాఖ్యానించారు.


ఆయనకు రక్షణ కవచాలున్నాయి..

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తెలుపు రంగు టీషర్ట్ లోనే కనిపిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలోనూ ఆయన టీషర్టే ధరించడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ విషయంపై ఆయన్ను ప్రశ్నించారు కూడా. ప్రియాంక కూడా స్పందించారు. తన సోదరుడికి సత్యం అనే రక్షణ కవచం ఉందని, అందుకే చలికాలంలో టీషర్టులు ధరించినా రాహుల్ కి ఏమీ కాదన్నారు. 3,000 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసిన సోదరుడిని చూస్తే గర్వంగా ఉందని ప్రియాంక అన్నారు.

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో 9 రోజుల విరామం తర్వాత మంగళవారం రాహుల్ గాంధీ యాత్ర ఢిల్లీలోని కాశ్మీరీ గేట్‌ వద్ద ఉన్న హనుమాన్‌ మందిరం నుంచి ప్రారంభమైంది. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ మీదుగా సాగి మధ్యాహ్నానికి యూపీలోకి అడుగు పెట్టింది. యూత్ర తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున రాహుల్ తో కలసి ముందుకు నడిచారు. యాత్రలో సోదరి ప్రియాంకను రాహుల్ ముద్దు పెట్టుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా జోడో యాత్రలో పాల్గొన్నారు.



First Published:  4 Jan 2023 2:32 AM GMT
Next Story