Telugu Global
National

రాహుల్ పాదయాత్ర ముగిసే రోజే ప్రియాంక యాత్ర మొదలు..

రెండు నెలలపాటు ప్రియాంక పాదయాత్ర కొనసాగుతుంది. అన్ని రాష్ట్రాల రాజధానుల మీదుగా ఈ యాత్ర వెళ్లేలా రూట్ మ్యాప్ రెడీ చేశారు.

రాహుల్ పాదయాత్ర ముగిసే రోజే ప్రియాంక యాత్ర మొదలు..
X

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగిసే రోజు ప్రియాంక గాంధీ తన యాత్ర మొదలు పెట్టడానికి నిర్ణయించారు. వచ్చే ఏడాది జనవరి 26న కాశ్మీర్ లో రాహుల్ యాత్ర ముగుస్తుంది. అదే రోజు ప్రియాంక గాంధీ మహిళా మోర్చా పేరుతో పాదయాత్ర ప్రారంభిస్తారు. రెండు నెలలపాటు ప్రియాంక పాదయాత్ర కొనసాగుతుంది. అన్ని రాష్ట్రాల రాజధానుల మీదుగా ఈ యాత్ర వెళ్లేలా రూట్ మ్యాప్ రెడీ చేశారు. యువత, మహిళలు ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొనేలా కీలక నేతలు కసరత్తులు చేస్తున్నారు.

జోడో యాత్రతో కొత్త ఉత్సాహం..

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ పై ప్రజలు ఇంకా నమ్మకంతో ఉన్నారని, వారంతా సరైన సమయంలో పార్టీకి అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు నేతలు. రాహుల్ యాత్రకు వస్తున్న అనూహ్య మద్దతు కారణంగా ప్రియాంక కూడా మహిళా మోర్చా యాత్ర ప్రారంభించబోతున్నారని వెల్లడించారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.

రాయ్ పూర్ లో ప్లీనరీ..

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చ‌త్తీస్‌ గఢ్ రాజ‌ధాని రాయ్‌ పూర్‌ లో 85వ ప్లీన‌రీ స‌మావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తోంది. మూడు రోజుల పాటు ప్లీనరీ జరుగుతుంది. ఏఐసీసీ ప్లీనరీ, భార‌త్ జోడో యాత్రపై కాంగ్రెస్ స్టీరింగ్ క‌మిటీలో విస్తృతంగా చ‌ర్చించారు. జోడో యాత్ర ముగిసిన తర్వాత జ‌న‌వ‌రి 26 నుంచి హాథ్ సే హాథ్ జోడో పేరిట భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు నేతలు. ఆ రోజు నుంచే ప్రియాంక కూడా జనంలోకి వెళ్తారన్నమాట. హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంతోపాటు, అదే రోజు ప్రియాంక మహిళా మోర్చా పాదయాత్ర కూడా మొదలవుతుంది. మొత్తమ్మీద ఈసారి కచ్చితంగా బీజేపీని గద్దె దించి, కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆ పార్టీ నేతలు పట్టుదలతో ఉన్నారు. ఎన్నికల వరకు ఏదో ఒక రకంగా ప్రజల్లో ఉండేందుకు నిర్ణయించారు.

First Published:  4 Dec 2022 4:54 PM GMT
Next Story