Telugu Global
National

కాంగ్రెస్‌ అంటే భయమెందుకు?

సీట్లు, ఓట్లు తక్కువయినప్పటికీ కాంగ్రెస్‌కు తగిన బలముంది. ఈ బలం రేపు బిజెపి పాలనని గద్దె దించే స్థాయిలలో పెరిగితే ప్రమాదమనే స్పృహ మోదీకి తెలుసు.. కనుకనే కాంగ్రెస్‌ మీద పదే పదే అసత్యాలతో, అర్ధ సత్యాలతో కూడిన ఆరోపణలు చేస్తున్నారు.

కాంగ్రెస్‌ అంటే భయమెందుకు?
X

మూడోసారి కూడా తామే అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే కాంగ్రెస్‌ మీద విరుచుకుపడటమెందుకు? తన అహంకారం వల్లనే కాంగ్రెస్‌ అధికారానికి దూరమైంద‌ని ప్రధాని మోదీ గురువారం పార్లమెంటులో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం మీద మాట్లాడుతూ ఆరోపించారు. 400 నుంచి 40 సీట్లకు పడిపోయిందని కాంగ్రెస్‌ని విమర్శించారు. మూడోసారి కూడా బిజెపినే అధికారం చేపట్టి తీరుతుందని చెప్పిన మోదీ తన ప్రసంగంలో గంటన్నరకు పైగా కాంగ్రెస్‌ మీదనే దాడి చేశారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్‌ల‌ పాలన మీద విమర్శల పరంపర కొనసాగించారు. తమ దర్బార్‌లో ఇతరులకు స్థానం లేకుండా వారసత్వ రాజకీయాల్ని కొనసాగిస్తున్న కాంగ్రెస్‌ను ప్రజలు పక్కకు పెట్టారని మోదీ చెబుతున్నారు. మరి ఈ విషయం ఇంత స్పష్టంగా తెలిసిన మోదీ కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్త్రాలు, దూషణలు, ఆరోపణలు చేయడం, కాంగ్రెస్‌ భాగస్వామిగా ఉన్న ‘ఇండియా’ కూటమి మీద సెటైర్లు వేయడానికి బదులుగా తమ తొమ్మిదేళ్ళ పాలన గురించి చెప్పుకుంటే బావుండేది.

కలలో కూడా తన పేరునే తలుచుకుంటున్నారని చెబుతున్న మోదీ కాంగ్రెస్‌ను తలపోయడం ఎందుకు? గుజరాత్‌లో, మధ్యప్రదేశ్‌లో, ఉత్తరప్రదేశ్‌లో, కాశ్మీర్‌లో, నాగాలాండ్‌లో, మిజోరాంలో ఇంకా అనేక రాష్ట్రాలలో అధికారానికి దూరమైందని చెబుతూనే కాంగ్రెస్‌ నామజపం చేయడమెందుకు? లోక్‌సభలో 40 సీట్లకు పడిపోయిన కాంగ్రెస్‌ అంటే భయమెందుకు? అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్‌ లేదంటూనే ఆ పార్టీ మీద ముప్పేట దాడి ఎందుకో మోదీ చెప్పాలి. ముఖ్యంగా తొమ్మిదేళ్ళుగా తాము అధికారంలో ఉండి కాంగ్రెస్‌ది అవినీతి పాలన, స్కామ్‌ల పాలన అనడం ఏ పరమార్థం కోసం?

యుపిఏ పేరును ‘ఇండియా’ గా మార్చుకున్నంత మాత్రాన మోదీకి ఎందుకు అభ్యంతరం? ప్రజల్లో పలుకుబడి, పరపతి లేని పార్టీలు అంటూనే ఆ పార్టీలకు మోదీ భయపడటమెందుకు? మీడియా, సోషల్‌ మీడియా అంతటా తామే స్వైర విహారం చేస్తుండగా కాంగ్రెస్‌, రాహుల్‌ గాంధీ నాయకత్వం ఏం చేయగలదని మోదీ అనుకుంటున్నారు. లోక్‌సభలో చేసిన ప్రసంగంలో పదేపదే ‘కాంగ్రెస్‌’ పేరును ప్రస్తావించడం ఆ పార్టీకి లేదంటున్న స్థానాన్నితనే కట్టబెట్టడం కాదా? రాహుల్‌ గాంధీని ‘ఫెయిల్డ్‌ ప్రొడక్ట్‌’ అని దూషించడం వల్ల ఒరిగేదేమిటి? మూడో సారి కూడా తమది విజయం అని చెబుతున్న మోదీ రాహుల్‌ గాంధీ ‘ప్రేమ దుకాణాల’కు తాళాలు పడతాయని చెబుతున్నారు. అంత ధీమా ఉన్నప్పుడు రాహుల్‌ పేరు ఎత్తడం అవసరమా? కనుకనే కాంగ్రెస్‌కు ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటున్నారు.

రెండు గంటల 13 నిమిషాల ప్రసంగంలో 90 శాతం సమయాన్ని కాంగ్రెస్‌ మీదనే కేంద్రీకరించారు ప్రధాన మోదీ. 40 సీట్లకు పడిపోయిన కాంగ్రెస్‌ ఇక ఏమీ చేయలేదని ధైర్యంగా ఉండలేకపోతున్నారు మోదీ. చచ్చిన పాము అంటూనే మరల మరల కొట్టి చంపాలనుకోడం ఎందుకు? కానీ మోదీకి తెలుసు.. కాంగ్రెస్‌ చచ్చిన పాము కాదని, వందేళ్ళ పైబడిన చరిత్ర గల కాంగ్రెస్‌ను అంత త్వరగా రాజకీయ యవనిక మీద నుంచి తప్పించడం సాధ్యం కాదని కూడా తెలుసు. సైద్ధాంతికంగా కాంగ్రెస్‌ లౌకికవాదానికి కట్టుబడిన పార్టీ. విద్వేష రాజకీయాలకు వ్యతిరేకం. మత ప్రాతిపదికన రాజకీయాలు నడిపే ధోరణి కాంగ్రెస్‌కు లేదు. భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రం మీద ప్రజలను ఏకం చేయగలిగిన సిద్ధాంత బలం ఉన్న పార్టీ కాంగ్రెస్‌. మత విద్వేష రాజకీయాలతో విసిగిపోయే ప్రజానీకానికి ప్రత్యామ్నాయంగా నిలిచే పార్టీ కాంగ్రెస్‌. కనుక ఆ పార్టీని బలహీసపరచాలనే ఎత్తుగడతోనే కాంగ్రెస్‌ మీద విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పొరపాట్లు చేసింది. కానీ అధికారం కోసం మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకునే ధోరణి ఆ పార్టీకి లేదు. గతంలో జరిగిన తప్పులు, పొరపాట్లు లేవనెత్తి కాంగ్రెస్‌ను ప్రజల నుంచి దూరం చేయడం అంత సులువు కాదు. అయినప్పటికీ పదే పదే విమర్శలు ఎక్కుపెట్టడం ద్వారా అభాసు పాలుజేసి కాంగ్రెస్‌ను నీరసపరచాలని కాషాయ పరివారపు కుటిల వ్యూహంలో భాగంగానే మోదీ కాంగ్రెస్‌ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ప్రజలు గమనిస్తారు. ఎవరేమిటో పోల్చుకుంటారు. అబద్ధాల హవా ఎల్లకాలం సాగదు. ఈ సంగతి తెలిసినప్పటికీ తక్షణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ను కార్నర్‌ చేయడం ఒక ఎత్తుగడ.

కాంగ్రెస్‌ మీద ఎంత వీలయితే అంత వ్యతిరేకత కనబరచడం, ‘ఇండియా’ కూటమిలో ఉన్నవారి మనోస్థైర్యాన్ని దెబ్బతీయడమనే మైండ్‌ గేమ్‌కు శ్రీకారం చుట్టింది కాషాయ పరివారం. అందులో భాగంగానే వరుసగా ‘ఇండియా’ కూటమి మీద విరుచుకుపడుతున్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్‌ను దెబ్బతీసే వ్యూహంతో వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్‌కు దేశమంతటా తగిన నిర్మాణం ఉంది. నమ్మకమైన యంత్రాంగం ఉంది. కొన్ని వర్గాలలో బలమైన పునాది ఉంది. 40 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్‌ అక్కడే ఉండిపోదు. తమ వైఫల్యాలను ఆసరాగా చేసుకొని కాంగ్రెస్‌ ఎగిసిపడే కేతనం అయ్యే ప్రమాదం లేకపోలేదని నరేంద్రమోదీకి, బిజెపి పరివారానికి తెలుసు. కనుకనే పని గట్టుకుని నెహ్రూ కుటుంబాన్ని, రాహుల్‌ గాంధీని విమర్శించడం బిజెపి నాయకులకు నిత్యకృత్యమయింది. ఇదే ధోరణి లోక్‌సభలో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై చర్చలో కనిపించింది. రాహుల్‌ గాంధీ దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతున్నాడని బిజెపి నాయకులు ఆరోపించడం సంఘ్‌ పరివార్‌ కుట్రలో అంతర్భాగం. సీట్లు, ఓట్లు తక్కువయినప్పటికీ కాంగ్రెస్‌కు తగిన బలముంది. ఈ బలం రేపు బిజెపి పాలనని గద్దె దించే స్థాయిలలో పెరిగితే ప్రమాదమనే స్పృహ మోదీకి తెలుసు.. కనుకనే కాంగ్రెస్‌ మీద నరేంద్ర మోదీ పదే పదే అసత్యాలతో, అర్ధ సత్యాలతో కూడిన ఆరోపణలు చేస్తున్నారు. కానీ అతి సర్వత్రా వర్జయేతే అన్న మాట ఉంది. మోదీ కాంగ్రెస్‌ను, ప్రతిపక్షాలను కార్నర్‌ చేస్తున్న కొద్దీ అవి బలం సంతరించుకునే అవకాశముందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story