Telugu Global
National

గుజరాతీయులను తిడుతున్నారు.. మోదీ మాటల అంతరార్థమేంటి..?

మోదీ సొంత రాష్ట్రం, ఆయన సీఎంగా పనిచేసిన రాష్ట్రం కావడంతో అక్కడ గెలుపు పార్టీకి అత్యవసరం. గుజరాత్ లో అధికారం కోల్పోతే మాత్రం.. ఢిల్లీ పీఠంపై కూడా ఆశ వదిలేసుకోవాల్సిందే.

గుజరాతీయులను తిడుతున్నారు.. మోదీ మాటల అంతరార్థమేంటి..?
X

ఏ ఎండకాగొడుగు పట్టడం మామూలే, కానీ ఏ ఎన్నికలకు ఆ గొడుగు పట్టడం బీజేపీకి బాగా తెలుసు. గుజరాత్ లో ఎన్నికలు తరుముకొస్తున్న వేళ, ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తెస్తున్నారు ప్రధాని మోదీ. గుజరాత్ ని, గుజరాతీయులను కొంతమంది తిడుతున్నారని, అలాంటి నాయకులకు, పార్టీలకు బుద్ధి చెప్పాలని అన్నారు. జునాఘడ్ లో 4,155 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల్ని ప్రారంభించిన ఆయన, ప్రాంతీయతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

ఎవరు తిట్టారు..? ఎందుకు తిట్టారు..?

ప్రధాన మంత్రిని తిడితే గుజరాత్ ని తిట్టినట్టా, ప్రధాని అసమర్థతను ప్రశ్నిస్తే గుజరాతీయులను హేళన చేసినట్టా.. అంటే ప్రధాని కేవలం తాను గుజరాత్ పౌరుడిని అనుకుంటున్నారా, దేశానికి ప్రతినిధి అనుకుంటున్నారా..? ఎన్నికల వేళ ప్రధాని మోదీ గుజరాత్ లో ప్రాంతీయ తత్వాని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుండటం విశేషం. గుజరాత్ పౌరుల్ని దూషించేవారికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందంటూ పొలిటికల్ డైలాగులు కొట్టారు మోదీ. ఈ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే వారిని క్షమించకూడదని అన్నారు మోదీ. కేంద్రంలో తన పాలనపై పడిన మరకలను ఇలా తుడిచేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.

గుజరాత్ లో కమలం వాడిపోతోందా..?

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా మోదీ సొంత రాష్ట్రం, ఆయన సీఎంగా పనిచేసిన రాష్ట్రం కావడంతో అక్కడ గెలుపు పార్టీకి అత్యవసరం. గుజరాత్ లో అధికారం కోల్పోతే మాత్రం.. ఢిల్లీ పీఠం కూడా ఆశ వదిలేసుకోవాల్సిందే. అందుకే ఇక్కడ గెలుపుకోసం శాయశక్తులు ఒడ్డేందుకు సిద్ధంగా ఉన్నారు మోదీ. కేజ్రీవాల్ ని గుజరాత్ లో నిలువరించేందుకు ఢిల్లీలో స్కామ్ లు, స్కీమ్ లు అంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఆ పార్టీ నాయకుల వెంటపడుతున్నారు. తాజాగా స్థానిక, స్థానికేతర అనే భేదం తీసుకొచ్చేలా మాట్లాడారు మోదీ. గుజరాతీయులను తిడుతున్నారంటూ సెంటిమెంట్ మంట రాజేయాలని చూశారు. ఓవైపు ఎన్నికల ఏడాదిలో వేల కోట్ల రూపాయలతో పెట్టుబడులు కుమ్మరిస్తున్నట్టు కలరింగ్ ఇస్తూ, మరోవైపు సెంటిమెంట్ తో ఓట్లు సంపాదించాలనుకుంటున్నారు మోదీ. ఈ వ్యూహం ఏ స్థాయిలో బెడిసికొడుతుందో మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.

First Published:  20 Oct 2022 2:25 AM GMT
Next Story