Telugu Global
National

ఆహా, ఓహో.. అంబులెన్స్ కి దారిచ్చిన ప్రధాని..!!

అంబులెన్స్ కి దారివ్వడం అనేది గొప్ప కాదని, బాధ్యత అని.. ఆ బాధ్యతని నెరవేర్చినందుకు ఇంత ప్రచారం దేనికంటూ సోషల్ మీడియాలో బీజేపీని టార్గెట్ చేశారు నెటిజన్లు.

ఆహా, ఓహో.. అంబులెన్స్ కి దారిచ్చిన ప్రధాని..!!
X

2014 ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ సోషల్ మీడియా స్టార్. కనీసం అప్పటికింకా ఆయన ప్రధాని రేసులో లేరు. అయినా కూడా ఓ పద్ధతి ప్రకారం మోదీకి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగేది, అలా జరిపించుకునేవారు. ఆ టీమ్ వ్యూహాలే వేరు. బీజేపీకి, దేశానికి మోదీ కాకపోతే ఇక ప్రత్యామ్నాయం ఎవరూ లేరన్నంతగా బిల్డప్ ఇచ్చారు సోషల్ మీడియాలో. అయితే ఆ ప్రచారం ఇప్పుడు పనికిరావట్లేదు. ఇప్పుడు జనాలకు బాగా అవగాహన వచ్చింది. ఏది నిజమైన వార్త, ఏది డబ్బా కొట్టుకునే వార్త అనేది చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు కూడా ఆనాటి టెక్నిక్ వాడి మోదీ టీమ్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతోంది.

అంబులెన్స్ కి దారిచ్చారు.. అయితే..!

అంబులెన్స్ వెళ్తుంటే దారివ్వడం కనీస ధర్మం. స్పృహ ఉన్నవారు ఎవరైనా చేసే పని అది. అంతమాత్రాన అంబులెన్స్ కి దారిచ్చామంటూ ఎవరూ సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టుకోరు. ఈరోజు నేను రెండు అంబులెన్స్ లకు దారిచ్చాను, మరో ఇద్దర్ని రోడ్డు దాటించాను, ఇంకో నలుగురికి సాయం చేశాను.. ఇలా ఎవరూ సెల్ఫ్ డబ్బా వేసుకోరు. సామాన్యులకే లేని సెల్ఫ్ డబ్బా ప్రధానికి ఎందుకు. అంబులెన్స్ కి దారిచ్చిన ప్రధాని అంటూ గొప్పలు చెప్పుకోవడం ఏంటి..? ఇలా గొప్పలు చెప్పుకున్నారు కాబట్టే నెటిజన్లు ఉతికి ఆరేస్తున్నారు.

గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కాన్వాయ్ అహ్మదాబాద్ నుంచి గాంధీ నగర్ వెళ్తుండగా మధ్యలో ఓ అంబులెన్స్ అటుగా వచ్చింది. ఆ సమయంలో మోదీ, అంబులెన్స్ కోసం తన కాన్వాయ్ ఆపమని చెప్పారని, అంబులెన్స్ వెళ్లిన తర్వాత మెల్లగా మోదీ కాన్వాయ్ కదిలిందని, అది మోదీ పెద్ద మనసుకి సంకేతమంటూ గుజరాత్ బీజేపీ మీడియా విభాగం ట్విట్టర్లో ఓ పోస్టింగ్ పెట్టింది. ఇక చూస్కోండి మోదీ దేవుడంటూ భక్తులు రీట్వీట్లు చేయడం, మెసేజ్ లు పెట్టడం ఓ రేంజ్ లో జరిగిపోయాయి.

ట్రోలింగ్ లు మొదలు..

మోదీ సంగతి తెలియక ముందు జనం ఆయన్ను మెచ్చుకుని ఉండేవారేమో కానీ, మన ప్రధాని కేవలం ప్రచార ఆర్భాటాల మనిషి అని ఎనిమిదేళ్ల పాలనలో ప్రజలకి బాగా అర్థమైంది. అందుకే ఇప్పుడీ జిమ్మిక్కులకు సామాన్యులనుంచి ప్రశంసలు రాలేదు, కేవలం విమర్శలే వస్తున్నాయి. అంబులెన్స్ కి దారిస్తే దాన్ని కూడా గొప్పగా చెప్పుకోవాలా అంటూ ట్రోలింగ్ మొదలైంది. అమ్మచేతి దీవెనలు తీసుకుని ఆ విషయాన్ని కూడా ప్రచారం చేసుకునే మోదీ, అంబులెన్స్ కి దారిస్తే ఊరుకుంటారా అంటూ మరో వర్గం సెటైర్లు వేసింది. భారత్ జోడో యాత్రలో ఎన్నో అంబులెన్స్ లు రాహుల్ గాంధీ పాదయాత్రను దాటుకుని వెళ్లాయని, మరి వాటన్నిటికీ రాహుల్ పెద్ద మనసుతో దారిచ్చినట్టేనా అంటూ కాంగ్రెస్ కూడా తగులుకుంది. మొత్తమ్మీద అంబులెన్స్ కి దారివ్వడం అనేది గొప్ప కాదని, బాధ్యత అని, ఆ బాధ్యతని నెరవేర్చినందుకు ఇంత ప్రచారం దేనికంటూ సోషల్ మీడియాలో బీజేపీని టార్గెట్ చేశారు నెటిజన్లు.

First Published:  1 Oct 2022 1:53 AM GMT
Next Story