Telugu Global
National

ప‌ద‌వీవిర‌మ‌ణ త‌ర్వాత రాష్ట్ర‌ప‌తి కోవింద్ ఎక్కడ ఉంటారు? ఆయనకు ఏ సౌకర్యాలు ఉంటాయి?

రిటైర్మెంట్ అనంతరం రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రతీ నెల రూ. 1.50 లక్షల పెన్షన్ లభిస్తుంది. దీంతో పాటు సెక్రటేరియల్ స్టాఫ్, ఆఫీస్ ఖర్చుల కోసం నెలకు రూ. 60 వేలు ఇస్తారు.

ప‌ద‌వీవిర‌మ‌ణ త‌ర్వాత రాష్ట్ర‌ప‌తి కోవింద్ ఎక్కడ ఉంటారు? ఆయనకు ఏ సౌకర్యాలు ఉంటాయి?
X

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 24న‌ పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పటికే కొత్త రాష్ట్రపతి ఎన్నిక పూర్తయ్యింది. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నిక లాంఛనమే అయినా.. గురువారం భారత కొత్త రాష్ట్రపతి ఎవరన్నది అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే, పదవీ విరమణ చేయనున్న రామ్‌నాథ్ కోవింద్ ఆ తర్వాత ఏం చేయనున్నారు? ఎక్కడ నివసిస్తారు? ఆయనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు అందుతాయనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది.

రామ్‌నాథ్ కోవింద్ సంబంధించిన సామాగ్రినంతటినీ రాష్ట్రపతి భవన్ నుంచి రెండు రోజుల ముందే అంటే ఈ నెల 22న కొత్త బంగ్లాకు తరలిస్తారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ప్రస్తుతం నివాసం ఉంటున్న 10 జన్‌పథ్ పక్కనే ఉన్న బంగ్లాను రామ్‌నాథ్‌కు కేటాయించారు. ఈ నెల 25న రామ్‌నాథ్ రాష్ట్రపతి భవన్‌ను ఖాళీ చేసి తనకు కొత్తగా కేటాయించిన ఇంటికి వెళ్తారు.

అంతకు ముందు, ఈ నెల 23న రాష్ట్రపతి గౌరవార్థం వీడ్కోలు విందు ఏర్పాటు చేయనున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ ఫేర్‌వెల్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ప్ర‌ధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మెమెంటో పాటు పార్లమెంట్ సభ్యులు సంతకాలు చేసిన సిగ్నేచర్ బుక్‌ను ఆయనకు అందిస్తారు.

రిటైర్మెంట్ అనంతరం రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రతీ నెల రూ. 1.50 లక్షల పెన్షన్ లభిస్తుంది. దీంతో పాటు సెక్రటేరియల్ స్టాఫ్, ఆఫీస్ ఖర్చుల కోసం నెలకు రూ. 60 వేలు ఇస్తారు. ఇక రామ్‌నాథ్ కోవింద్‌కు కేటాయించిన బంగ్లాకు ఎలాంటి అద్దె చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆది పూర్తిగా ఉచితం. అంతే కాకుండా రెండు ల్యాండ్ లైన్ ఫోన్లు, ఒక మొబైల్, బ్రాండ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉచితంగా అందిస్తారు.

మాజీ రాష్ట్రపతులకు ఇచ్చినట్లుగానే ఒక కారు, డ్రైవర్‌ను ఉచితంగా ఏర్పాటు చేస్తారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని ప్రభుత్వమే చూసుకుంటుంది. విమాన, రైలు ప్రయాణాలు ఒక సహాయకుడితో పాటు ఉచితంగా పొందవచ్చు. ఇక ఆఫీసులో పని చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సెక్రటరీలను ఏర్పాటు చేస్తుంది. అలాగే పర్సనల్ స్టాఫ్‌ను కూడా కేంద్రమే కేటాయిస్తుంది. ఇక రామ్‌నాథ్ వ్యక్తిగత భద్రత కోసం ఢిల్లీ పోలీసులతో సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు.

Next Story