Telugu Global
National

అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాబోయే 25 ఏళ్లలో భారత దేశం మరింత అభివృద్ధి చెందుతుందని, ఇవి మనకు ఎంతో ముఖ్యమైన కాలమని.. అభివృద్ధి దిశగా మరింత అడుగులు పడాల్సిన అవసరం ఉందని అన్నారు.

అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
X

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సెంట్రల్ హాల్‌లో ఉభయ సభలను ఉద్దేశంచి ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. దేశం ఆత్మనిర్భర్ భారత్‌గా ఆవిర్భవిస్తోందని.. పౌరులందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్రపతి అన్నారు. గత తొమ్మిదేళ్ల ప్రభుత్వ పాలనలో దేశ ప్రజల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందని ఆమె చెప్పారు. ఇప్పుడు యావత్ ప్రపంచం ఆశావాహ దృక్పదంతో మన దేశం వైపు చూస్తోందని అన్నారు.

రాబోయే 25 ఏళ్లలో భారత దేశం మరింత అభివృద్ధి చెందుతుందని, ఇవి మనకు ఎంతో ముఖ్యమైన కాలమని.. అభివృద్ధి దిశగా మరింత అడుగులు పడాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచానికే పరిష్కారాలు చూపేలా మన దేశం తయారయ్యిందని అన్నారు. డిజిటల్ ఇండియా దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయని అన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకొని కొత్త ఆవిష్కరణలు తీసుకొని వస్తున్నామని రాష్ట్రపతి అన్నారు. దేశంలోని డిజిటల్ నెట్‌వర్క్ వ్యవస్థ ప్రపంచానికే ఉదాహరణగా మారిందని అన్నారు. ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా ప్రజలకు మేలు జరుగుతోందని చెప్పారు. దేశ ప్రజలకు కోవిడ్ నుంచి విముక్తి కల్పించిన ప్రభుత్వమని, నిరుపేద కోవిడ్ బాధితులకు అండగా కూడా నిలించిందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. పేదరికం లేని భారత్ నిర్మాణం కోసం కృషి జరుగుతుందని వెల్లడించారు.

పేదలు, గిరిజనులు, బడగు, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం పని చేస్తోంది. ఓబీసీల సంక్షేమం కోసం కీలకంగా ముందడుగు వేసిందని అన్నారు. మూడు కోట్ల మందికి సొంత ఇళ్లు నిర్మించి ఇచ్చామని, 11 కోట్ల మందికి ఇంటింటికీ మంచినీరు అందించామని.. మహిళా సాధికారతను ప్రోత్సహిస్తున్నామని రాష్ట్రపతి చెప్పారు. చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవడానికి అనేక చర్యలు తీసుకున్నాము. ఫసల్ బీమా యోజన, కిసాన్ కార్డు వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. పంట నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నామని, కనీస మద్దతు ధర పెంచి రైతులను బలోపేతం చేస్తున్నట్లు వివరించారు.

ఆదివాసీ ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేసి వారి పిల్లలు చదువుకు దూరం కాకుండా చూస్తున్నామని చెప్పారు. బేటీ బచావ్ బేటీ పడావ్ నినాదం సత్ఫలితాలను ఇస్తుంది. బాలికల డ్రాపవుట్స్ తగ్గాయి. దేశంలో తొలి సారిగా మహిళల సంఖ్య పెరిగిందని రాష్ట్రపతి అన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని.. తీవ్రవాద ప్రభావిత జిల్లాల అభివృద్ధికి అనేక పనులు చేపడుతున్నామని అన్నారు.

ప్రస్తుతం దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కుంటోంది. పొరుగు దేశాల సరిహద్దుల్లోని సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కుంటున్నామని.. సర్జికల్ స్ట్రైక్స్ విజయవంతంగా చేపట్టి దేశానికి ముప్పు వాటిల్లకుంటా చూశామన్నారు. అవినీతి అనేది అంతం చేయడానికి ప్రభుత్వం ఎక్కువగా కృషి చేస్తోందని రాష్ట్రపతి చెప్పారు. ఇప్పుడున్నది ధైర్యవంతమైన, నిర్ణయాత్మకమైన, స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వమని చెప్పారు. గంటకు పైగా సాగిన ఈ ప్రసంగంలో గత తొమ్మిదేళ్లుగా ఎన్టీయే ప్రభుత్వం చేసిన పనులను ఉటంకించారు.

First Published:  31 Jan 2023 6:56 AM GMT
Next Story