Telugu Global
National

అటు 5జి, 6జి.. ఇటు గర్భిణిలకోసం ఇంకా జేసీబీ..

5జి, 6జి పోయి 7జి, 8జి వచ్చినా.. ఇలాంటి మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం విఫలం అయితే టెక్నాలజీ ఘనత దేనికోసం..? ఎవరికోసం..?

అటు 5జి, 6జి.. ఇటు గర్భిణిలకోసం ఇంకా జేసీబీ..
X

భారత్‌లో అక్టోబర్ 12 నాటికి 5జి సేవలు ప్రారంభిస్తామని సగర్వంగా ప్రకటించారు కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్. 2030 నాటికి దేశంలో 6జి అందుబాటులోకి వస్తుందని అంతకంటే ఘనంగా ప్రకటించారు ప్రధాని నరేంద్రమోదీ. అంతా బాగానే ఉంది. టెక్నాలజీలో మనం దూసుకెళ్తున్నాం. మరి కనీస అవసరాల సంగతేంటి.. నిన్నటికి నిన్న బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ లో ఓ గర్భిణి ఇంటికి అంబులెన్స్ చేరుకునే దిక్కులేక ఆమెను జేసీబీ తొట్టెలో ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన దుస్థితి. వరదలతో రాష్ట్రమంతా ఇబ్బందులున్న సంగతి పక్కనపెడితే.. కనీసం గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర సమయంలో కూడా అంబులెన్స్ సౌకర్యం లేకపోతే ఎలా..? వరదలొస్తే కొన్ని గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. వారి సంగతేంటి..? 5జి, 6జి పోయి 7జి, 8జి వచ్చినా.. ఇలాంటి మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం విఫలం అయితే టెక్నాలజీ ఘనత దేనికోసం..? ఎవరికోసం..?

మధ్యప్రదేశ్ లోని నీమాచ్ జిల్లా రావత్ పుర గ్రామంలో సమయానికి అంబులెన్స్ రాలేకపోవడంతో జేసీబీలో గర్భిణిని ఆస్పత్రికి తరలించారు. ఆమె క్షేమంగా పురుడుపోసుకుంది కాబట్టి సరిపోయింది, అంబులెన్స్ లేకపోవడంతో బిడ్డకు కానీ, తల్లికి కానీ ప్రమాదం జరిగి ఉంటే దానికి బాధ్యులెవరు..? మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలో మరో ఘటన జరిగింది. ఆటో రిక్షాలోనే ఓ గర్భిణి ప్రసవించింది. మధ్యప్రదేశ్, యూపీలో వెలుగులోకి రాని ఇలాంటి ఘటనలు కోకొల్లలు.

ప్రతి ఇంటికీ నీటినిచ్చాం, ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ ఇచ్చాం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు బీజేపీ నాయకులు. అటు మోదీయేమో ఇంకా వారసత్వ రాజకీయాలంటూ ఎవరినో టార్గెట్ చేయాలని చూస్తుంటారు. తాము అధికారంలోకి వచ్చి 8 ఏళ్లవుతున్నా ఇంకా పల్లెటూళ్లకు అంబులెన్స్ సౌకర్యం ఎందుకు లేదంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. టెక్నాలజీ గురించి గొప్పగా చెప్పుకునే కేంద్రం.. కనీస అవసరాలపై దృష్టిపెట్టాలంటున్నాయి విపక్షాలు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఘటనలు నిజంగా సిగ్గుచేటని విమర్శిస్తున్నారు విపక్ష నేతలు.

First Published:  26 Aug 2022 3:28 AM GMT
Next Story