Telugu Global
National

పదవీ విరమణ తర్వాత న్యాయమూర్తులకు పదవులు న్యాయవ్యవస్థకు ముప్పు: కాంగ్రెస్

కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, మాజీ న్యాయ, ఆర్థిక మంత్రి దివంగత అరుణ్ జైట్లీని ఉటంకిస్తూ, 2013లో " రిటైర్మెంట్ తర్వాత వచ్చే పదవులు పదవీ విరమణకు ముందు తీర్పులపై ప్రభావం చూపుతాయి" అని అన్నారు.

పదవీ విరమణ తర్వాత న్యాయమూర్తులకు పదవులు న్యాయవ్యవస్థకు ముప్పు: కాంగ్రెస్
X

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఎస్. అబ్దుల్ నజీర్ నియమితులైన నేపథ్యంలో ‘ఇది న్యాయవ్యవస్థకు ముప్పు’ అని కాంగ్రెస్ పేర్కొంది.

కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, మాజీ న్యాయ, ఆర్థిక మంత్రి దివంగత అరుణ్ జైట్లీని ఉటంకిస్తూ, 2013లో " రిటైర్మెంట్ తర్వాత వచ్చే పదవులు పదవీ విరమణకు ముందు తీర్పులపై ప్రభావం చూపుతాయి" అని అన్నారు.

సింఘ్వీ మాట్లాడుతూ, "మేము ఆయన‌ భావాలను సమర్దిస్తున్నాము ... ఇది న్యాయవ్యవస్థకు ముప్పు." అన్నారు.

"ఇది నాకు వ్యక్తిగతంగా తెలిసిన ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నది కాదు, కానీ పదవీ విరమణ తర్వాత న్యాయమూర్తులకు పదవులను ఇవ్వడానికి మేము సూత్రప్రాయంగా వ్యతిరేకం" అని ఆయన అన్నారు.

"ఇది ఇంతకుముందు కూడా జరిగిందని బిజెపి సమర్థించడం, దాన్నిసాకుగా చూపించడం న్యాయవ్యవస్థకు మంచిది కాదు." అని సింఘ్వి అన్నారు.

కాంగ్రెస్ ఎంపీ, కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్, అరుణ్ జైట్లీ వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ , “గత 3-4 సంవత్సరాలలో ఇలా చాలా జరుగుతున్నాయి” అని అన్నారు.

అయోధ్య బెంచ్‌కు నేతృత్వం వహించి రాజ్యసభకు నామినేట్ అయిన రంజన్ గొగోయ్ తర్వాత అబ్దుల్ నజీర్ ది రెండో నియామకం.

అయోధ్య కేసులో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్‌లో భాగమైన జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ జనవరిలో పదవీ విరమణ చేశారు.

జస్టిస్ నజీర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం 2016 నోట్ల రద్దు ప్రక్రియను సమర్థించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతల వాక్‌స్వేచ్ఛపై అదనపు ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని ఆయన ప్రకటించారు.

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెలువాయిలో జనవరి 5, 1958న జన్మించిన జస్టిస్ నజీర్, మంగళూరులోని SDM న్యాయ కళాశాలలో LLB డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఫిబ్రవరి 18, 1983న న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు.

అతను కర్ణాటక హైకోర్టులో ప్రాక్టీస్ చేసి, మే 12, 2003న దాని అదనపు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. అతను సెప్టెంబర్ 24, 2004న శాశ్వత న్యాయమూర్తి అయ్యాడు. ఫిబ్రవరి 17, 2017న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందాడు.

ట్రిపుల్ తలాక్, గోప్యత హక్కు, అయోధ్య కేసు, ఇటీవల నోట్ల రద్దుపై కేంద్రం తీసుకున్న 2016 నిర్ణయం, చట్టసభల స్వేచ్ఛ వంటి అనేక రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయాలలో జస్టిస్ నజీర్ భాగం.

జస్టిస్ నజీర్ మాట్లాడుతూ, "ఈరోజు భారత న్యాయవ్యవస్థలో పరిస్థితి గతంలో ఉన్నంత భయంకరంగా లేదు. అయితే తప్పుడు సమాచారం కారణంగా తప్పుడు అభిప్రాయాలు ప్రచారం జరుగుతున్నాయి" అని అన్నారు.

First Published:  13 Feb 2023 1:44 AM GMT
Next Story