Telugu Global
National

ప్రముఖ గాయకుడు భూపీందర్ సింగ్ అనారోగ్యంతో మృతి..

సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య మిథాలి, కుమారుడు నిహాల్ సింగ్ ఉన్నారు.

ప్రముఖ గాయకుడు భూపీందర్ సింగ్ అనారోగ్యంతో మృతి..
X

బాలీవుడ్ దిగ్గజ గాయకుడు, సినిమా పాటలతోనే కాకుండా గజల్స్ తో కూడా ప్రేక్షకులను కట్టిపడేసే భూపీందర్ సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 82 ఏళ్లు. పెద్దపేగు క్యాన్సర్ తో కొంతకాలంగా ఆయన బాధపడుతున్నారు. 10 రోజుల క్రితం ఆయన ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఇటీవలే ఆయనకు కొవిడ్ పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన కోలుకోలేకపోయారు. సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య మిథాలి, కుమారుడు నిహాల్ సింగ్ ఉన్నారు.

హస్కీ వాయిస్..

1970, 80ల్లో భూపీందర్ గాత్రం బాలీవుడ్ ని ఉర్రూతలూగించింది. ముఖ్యంగా ఆర్డీ బర్మన్, గుల్జార్ వంటి సంగీత కారులకు ఆయన ఆస్థాన గాయకుడు. కిషోర్ కుమార్, రఫీ వంటి దిగ్గజ గాయకులతో కలసి పాటలు పాడారు భూపీందర్ సింగ్. మౌసం, ఆహిస్తా ఆహిస్తా, దూరియా, హఖీఖత్ వంటి సినిమాలు ఆయన ప్రతిభకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. భూపీందర్ సింగ్ భార్య మిథాలి సింగ్ కూడా నేపథ్య గాయకురాలే. ఆమె బంగ్లాదేశ్ కి చెందిన మహిళ. భూపీందర్ అమృత్ సర్ వాసి.

భూపీందర్ గాయకుడే కాదు మంచి గిటారిస్ట్ కూడా. ఆర్డీబర్మన్ టీమ్ లో పాటలు పాడటంతోపాటు, గిటారిస్ట్ గా కూడా ఆయన పనిచేశారు. ఆల్ టైమ్ హిట్స్ 'దమ్ మారో దమ్', 'చురాలియా హై' పాటల్లో ఆయన కూడా భాగస్వామి. పత్రికల్లో వచ్చిన కవితలు సేకరించి, వాటిని కంపోజ్ చేసి, ఢిల్లీలోని తన స్నేహితుల కోసం పాటలు పాడుతుండేవారు భూపీందర్ సింగ్, ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియోలో పనిచశారు. 1964లో చేతన్ ఆనంద్ సినిమా హఖీఖత్ తో ఆయన సినిమా జీవితం మొదలైంది. మదన్ మోహన్ ఆయన్ను సినీ ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ఆర్డీ బర్మన్, నౌషాద్, సలీల్ చౌదరి, జైదేవ్, ఖయ్యూమ్, రాజేష్ రోషన్‌, బప్పీలహరి వంటి మ్యూజిక్ డైరెక్టర్లతో కలసి ఆయన పనిచేశారు. భూపీందర్ మరణం బాలీవుడ్ సంగీత ప్రపంచానికి తీరనిలోటు. పలువురు ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

First Published:  19 July 2022 2:03 AM GMT
Next Story