Telugu Global
National

నిషేధాజ్ఞలు మరిచి టపాసుల మోత.. ఢిల్లీలో తీవ్రస్థాయికి కాలుష్యం

ఢిల్లీ ప్రజలు ప్రభుత్వ సూచనలను పట్టించుకున్నట్లులేదు. పండుగ రోజు భారీగా టపాసులు పేల్చారు. దీంతో నగరంలో దట్టమైన పొగ కమ్ముకుంది.

నిషేధాజ్ఞలు మరిచి టపాసుల మోత.. ఢిల్లీలో తీవ్రస్థాయికి కాలుష్యం
X

ఢిల్లీలో కొంతకాలంగా కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. దేశ రాజధానిలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ ఏదీలేదు. నగరంలో వాహనాలను సరి-బేసి విధానంలో మాత్రమే అనుమతిస్తున్నారు. వరుసగా గత ఏడాదితో పాటు ఈ ఏడాది కూడా బాణసంచా తయారీ, క్రయవిక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. దీపావళి నాడు ఎక్కడా టపాసులు పేల్చవద్దని ప్రభుత్వం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది.

అయితే ఢిల్లీ ప్రజలు ప్రభుత్వ సూచనలను పట్టించుకున్నట్లులేదు. పండుగ రోజు భారీగా టపాసులు పేల్చారు. దీంతో నగరంలో దట్టమైన పొగ కమ్ముకుంది. విజబులిటీ గణనీయంగా తగ్గిపోయి కాస్త దూరంగా ఉన్న దృశ్యాలను చూడటం కూడా కష్టంగా మారింది.

ఆదివారం రాత్రి ఢిల్లీ నగరంలోని కరోల్ బాగ్, పంజాబీ బాగ్, ఆర్కే పురం, లోధీ రోడ్ ప్రాంతాల్లో భారీగా బాణసంచా పేల్చారు. ఆకాశాన్ని కాంతులతో ముంచేసిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. ఢిల్లీలో ఇప్పటికే కాలుష్యం తీవ్రస్థాయికి చేరడంతో పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఇప్పుడు బాణసంచా కాల్పులతో నగరం మరింత కాలుష్యమయంగా మారింది. దీంతో ఢిల్లీలో కాలుష్యం వల్ల ప్రజలు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది.

First Published:  13 Nov 2023 4:46 AM GMT
Next Story