Telugu Global
National

బీహార్ లో రాజకీయ వేడి...నితీష్ కుమార్ ఎన్డీఏ తో తెగతెంపులు చేసుకోనున్నారా ?

బీహార్ లో జేడీయూ, బీజేపీ కూటమి విడిపోనుందా ? నితీష్ కుమార్ బీజేపీకి కటీఫ్ చెప్పి ఆర్జేడీతో చేతులు కలపనున్నారా ? జరుగుతున్న పరిణామాలు ఈ ప్రశ్న‌లకు అవుననే సమాధాను చెప్తున్నాయి.

బీహార్ లో రాజకీయ వేడి...నితీష్ కుమార్ ఎన్డీఏ తో తెగతెంపులు చేసుకోనున్నారా ?
X

బీహార్ లో కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలు అధికార జేడీయూ, బీజేపీ కూటమి మధ్య విబేధాలు ఏర్పడ్డాయనే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కొంత కాలంగా ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ రేపు పాట్నాలో ఎమ్మెల్యేల, ఎంపీల‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ కూడా డుమ్మా కొట్టడానికి వీలు లేదంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఆసక్తికరంగా రేపే బీహార్ ప్రధాన ప్ర‌తిపక్షమైన రాష్ట్రీయ జనతాదళ్ కూడా ఎమ్మెల్యేల, ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది. మరో వైపు ఎన్డీఏ లో భాగస్వామ్య పక్షమైన బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్ మోర్చా కూడా మంగ‌ళ‌వారం తమ ఎమ్మెల్యేలందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. నిన్న ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెళ్ళలేదు. అంతే కాదు జులై 17 నుంచి ఆయ‌న కేంద్రం చేప‌ట్టిన నాలుగు స‌మావేశాల‌కు హాజ‌రుకాలేదు.

ఈ నేపథ్యంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ పై కుట్రలు జరుగుతున్నాయని జేడీయూ నేత లలన్ సింగ్ ఆరోపించారు. గతంలో చిరాన్ పాశ్వాన్ ద్వారా ఓ కుట్ర జరిగితే , తాజాగా జేడీయూ నాయకుడు ఆర్‌సిపి సింగ్ ద్వారా మరో కుట్ర జరిగింది అని ఆయన అన్నారు. ఈ కుట్ర చేసింది బీజేపీయేనని ఆయన పరోక్షంగా చెప్పారు. నితీష్ కుమార్ కు తెలియకుండానే ఆయన ఒప్పుకోకుండానే కేంద్రప్రభుత్వంలో మంత్రి పదవి తీసుకోవడానికి జేడీయూ ఎంపీ ఆర్‌సిపి సింగ్ అంగీకరించారని ఇది పార్టీ ధిక్కరణే అని లలన్ సింగ్ మండిపడ్డారు. కాగా జేడీయూ నుంచి ఆర్పీ సింగ్ వైదొలిగారు.

ఇక బీజేపీ పొత్తు వదులుకుంటే ప్రభుత్వ పడి పోయి మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే అందుకు జేడీయూ ఎమ్మెల్యేలెవ్వరూ సిద్దంగా లేరని సమాచారం. అందువల్ల నితీష్ కుమార్ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. నితీష్ నిన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో కూడా ఫోన్ లో మంతనాలు జరిపినట్టు సమాచారం. ఆ మూడు పక్షాలు కూడా నీతీష్ కు అండగా నిలబడటానికి సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది.

First Published:  8 Aug 2022 6:16 AM GMT
Next Story